ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 3 ఫిబ్రవరి 2021 (08:55 IST)

వింత వ్యాధుల కట్టడికి నిరంత‌ర ప‌ర్య‌వేక్ష‌ణ: డిప్యూటీ సీఎం

ఇటీవల పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాల్లో గుర్తించిన వింత వ్యాధులపై నిరంతర అధ్యయనం చేయనున్నట్లు డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ వెల్లడించారు. గత డిసెంబరు 5వ తేదీ నుంచి పశ్చిమగోదావరి జిల్లా, ఏలూరులో సుమారు 600 మంది అంతుచిక్కని వ్యాధి బారినపడ్డారన్నారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం తక్షణం స్పందించి, చర్యలు తీసుకున్న వైనాన్ని మంత్రి గుర్తు చేశారు.

వింతవ్యాధి ఇతర ప్రాంతాలకు సోకకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. ఘటన జరిగిన వెంటనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి డిసెంబర్ 10న  ఏలూరులో బాధితులను పరామర్శించిన విషయాన్ని ప్రస్తావించారు. ఏలూరులో వింతవ్యాధి నియంత్రణకు వైద్యారోగ్య శాఖ బాగా కృషి ఫలితంగా ప్రజల్లో ఉన్న భయాన్ని పారదోలగలిగామని మంత్రి కాళీకృష్ణ శ్రీనివాస్ తెలిపారు.

పూళ్ల కొమిరెపల్లిలో కూడా అదే తరహా వింతవ్యాధి సోకడంతో పూర్తి స్థాయిలో ముందస్తు చర్యలు తీసుకున్నామని మంత్రి వివరించారు. వైద్య ఆరోగ్యశాఖ తీసుకున్న చర్యలతో వింతవ్యాధితో ఏ ఒక్కరూ ప్రాణాలు కోల్పోలేదన్నారు. అదే సమయంలో ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేపడుతూ 104, 108 వాహనాలతో పాటు మెడికల్ టీమ్స్ ను అందుబాటులో ఉంచామన్నారు.

ముఖ్యమంత్రి జగన్ ఆదేశాల మేరకు వింత వ్యాధి గుర్తింపునకు 21 మందితో ఉన్నత స్థాయి కమిటీని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. ఈ కమిటీ ఇప్ప‌టికే నీరు, పాలు, కూరగాయలు, పంటలు, పలు ఆహార పదార్ధాల నుంచి శాంపిల్స్ తీసుకుని పరిశోధనకు పంపించిందన్నారు.

ఆయా పరిశోధన సంస్థల నుంచి ప్రభుత్వానికి నివేదికలు అందాయని వీటిని ఆధారం చేసుకుని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా ఏం చేయాలనే దానిపై చర్యలు చేపడుతున్నామని మంత్రి తెలిపారు.             

వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్ సింఘాల్ మాట్లాడుతూ వింత వ్యాధిపై ఇప్పటి వరకు ఎయిమ్స్, సీసీఎంబీ, నిమ్స్ వంటి 13 సంస్థల్లో పరిశోధనలు జరిగాయన్నారు. సీసీఎంబీ నివేదికలో ఎలాంటి కారణాలు లేవని, నిమ్స్ నివేదికలో ట్రైజో ఫాస్ ఉందని బయటపడిందన్నారు.

బాధితుల రక్త, యూరిన్ పరీక్షల ఫలితాల్లో  లెడ్, నికేల్ ఉన్నట్లు గుర్తించారన్నారు. మిగతా అన్ని సంస్థలు కూడా ఎలాంటి బాక్టీరియా,వైరస్ లేదని తేల్చి చెప్పాయన్నారు. ఆ సంస్థల నివేదికల ఆధారంగా  దీర్ఘకాలిక అధ్యయనానికి ఆయా సంస్థలతో ఒప్పందాలు చేసుకుంటున్నామని అనిల్‌సింఘాల్ వెల్లడించారు. మెటల్స్ ఎలా కలుస్తున్నాయనే దానిపై రాబోయే రోజుల్లో పూర్తి స్థాయి అధ్యయనం చేస్తామన్నారు.

తొలుత వింత వ్యాధులపై ఉభయగోదావరి జిల్లాల్లో అధ్యయనం చేస్తామన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయా ప్రాంతాల్లో ఆర్గానిక్ వ్యవసాయంపై దృష్టి పెట్టాలన్నారు. బాధితుల నుంచి శాంపిళ్లలో బలమైన లోహాలు ఎలా వచ్చాయనేదానిపై పరిశోధనలకు రాష్ట్రంలో ల్యాబ్‌లు ఏర్పాటు చేయాల్సి ఉందని, ఇందుకోసం 7శాఖల సమన్వయంతో పూర్తి స్థాయిలో అధ్యయనం చేయాల్సి ఉందని తెలిపారు.