శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 13 మే 2020 (13:15 IST)

ఏపీలో కరోనా బస్సులు సిద్ధం.. 36 సీట్ల స్థానంలో 26 సీట్లు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజా రవాణాను పునరుద్ధరించే చర్యలను ఆ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. ఈ నెల 17వ తేదీతో ముగియనున్న లాక్డౌన్ తర్వాత ఈ ప్రజా రవాణా పునరుద్ధరించే అవకాశం ఉంది. 
 
అయితే, కరోనా వైరస్ మహమ్మారి నుంచి బయటపడాలంటే.. ఖచ్చితంగా సామాజిక భౌతికదూరం పాటిస్తూనే, ముఖానికి మాస్క్ ధరించాల్సిన నిబంధన ఏర్పడింది. ఈ పరిస్థితుల్లో ఏపీఎస్ ఆర్టీసీ అధికారులు సూపర్ లగ్జరీ బస్సులను సమూలంగా మార్చాలని నిర్ణయించారు.
 
ప్రయాణికుల మధ్య దూరం తప్పనిసరిగా ఉండాల్సిన నేపథ్యంలో మొత్తం 36 సీట్లలో 10 సీట్లను తగ్గించి, 26 సీట్లకు కుదించారు. ప్రయాణికులు నడిచే దారిలో 8 సీట్లను అమర్చారు. 
 
అటూ, ఇటూ రెండు రెండు సీట్లుండే చోట ఒక్క సీటునే ఏర్పాటు చేశారు. ఈ మోడల్‌ను అధికారులు ఓకే చేస్తే, మిగతా అన్ని బస్సులనూ ఇలాగే మార్చేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నారు.
 
అయితే, ఈ బస్సులో ప్రయాణ చార్జీలు అధికంగా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే.. పది సీట్లను తొలగించడం వల్ల తీవ్ర నష్టం వచ్చే అవకాశం ఉంది. దీన్ని భర్తీ చేసుకునే ప్రక్రియలో భాగంగా, అదనపు వడ్డనకు ఆర్టీసీ చర్యలు తీసుకునే అవకాశాలు లేకపోలేదు.