శుక్రవారం, 22 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శుక్రవారం, 29 మే 2020 (16:09 IST)

కంటికి కనిపించని శత్రువుతో యుద్ధం.. ఏపీ పోలీస్ సేవలు ప్రశంసనీయం

ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న కరోనా వైరస్, రాష్ట్రంలో వ్యాప్తి చెందకుండా ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖ అనితరమైన సేవలు అందిస్తూ కీలక పాత్ర పోషిస్తోంది. పగలనక, రేయనక, ఎండనక, వాననక, ప్రజారోగ్యం కోసం, ప్రజా శ్రేయస్సు కోసం అహోరాత్రం శ్రమిస్తూ తమ ప్రాణాలు సైతం లెక్కించక, విధులను నిర్వహిస్తున్న పోలీసు సిబ్బంది యొక్క త్యాగం అజరామరం. 
 
ఈ రోజు కోవిడ్ నియంత్రణలో భారతదేశం ఇతర దేశాలకు ఆదర్శంగా నిలబడిందంటే, దానికి పోలీసు సిబ్బందితో పాటు మిగతా ఫ్రంట్ వారియర్స్ యొక్క త్యాగాలు కారణమని చెప్పక తప్పదు. అందులో భాగంగా ఆంధ్ర ప్రదేశ్ పోలీసు శాఖ గత రెండున్నర నెలలుగా శ్రమించడం అమోఘం. ఈ క్రమంలో 45 మంది పోలీసులు కరోనా బారినపడ్డారు. అయినా సరే మొక్కవోని ధైర్యంతో విధులు నిర్వహిస్తున్నారు.
 
కోవిడ్‌పై యుద్ధంలో పోలీసు సిబ్బంది అంకిత భావంతో పని చేయడంలో వారి కుటుంబ సభ్యుల సహకారమూ లేకపోలేదు. ఆపదపొంచి ఉన్నదని తెలిసినప్పటికీ, పోలీసు సిబ్బందిని కరోనా సమరానికి సమాయత్తం చేస్తూ వారికి వీర తిలకందిద్ది తమ కుటుంబ సభ్యులే  పంపించిన ఘట్టం అభినందనీయం. వారి త్యాగ నిరతిని ప్రశంసిస్తూ డీజీపీగారు స్వయానా లేఖ రాయడం, మీ సంక్షేమం కోసం నేనున్నానంటూ భరోసా ఇవ్వడం, అది తన ప్రధమ కర్తవ్యంగా భావించడం మనకందరికీ విదితమే. 
 
ఒక క్రొత్త సమస్య... దానిని ఎలా ఎదుర్కోవాలో తెలీదు... అయినప్పటికీ,  వైరస్ బారిన పడకుండా చాకచక్యంగా విధులు నిర్వర్తించాల్సిన అవసరాన్ని గుర్తించిన డీజీపీ ఒక పక్కా ప్రణాళికతో ముందుకు కదిలారు. ముందుగా తమ సిబ్బందిలో జవ సత్వాలు నింపి, ప్రాణాలను సైతం లెక్కించక నిరంతరం విధులు నిర్వర్తించే విధంగా వారిలో స్ఫూర్తిని నింపారు. మరోపక్క పోలీస్ సిబ్బంది వ్యక్తిగత రక్షణకు వారికి కావల్సిన మాస్క్‌లు, హాండ్ గ్లౌజ్‌లు, శానిటైజర్లు అందిస్తూ, అత్యంత ప్రమాదకరమైన రెడ్‌జోన్ ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్న వారికి నాణ్యతతో కూడిన పీపీఈ కిట్లను అందిస్తూ నూతనోత్సాహాన్ని నింపారు. 
 
55 ఏళ్ల వయస్సు పైబడిన వారిని క్షేత్రస్థాయి విధులకు దూరంగా ఉంచారు, మరో పక్క, రోగనిరోధకశక్తిని పెంపొందించే క్రమంలో  విటమిన్ మాత్రలు, పౌష్టికాహారం, హోమియో పిల్స్‌ను ఎప్పటికప్పుడు సమకూర్చారు. ఈ క్రతువులో ప్రభుత్వంతో పాటు ఎందరో మానవతావాదులు, స్వచ్ఛంద సంస్థలు, పోలీసు శాఖకు బాసటగా నిలిచి, వివిధ రూపాలలో సహాయ సహకారాలు అందించారు. 
 
 
 
విశ్వమానవతా సంస్థ సహకారంతో  పోలీసు సిబ్బంది మరియూ వారి కుటుంబ సభ్యుల ఆరోగ్యం దృష్టిలో ఉంచుకుని, ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి ఆన్లైన్ కౌన్సెలింగ్, ఆన్లైన్ ట్రీట్మెంట్ ఇవ్వడం చేశారు.
 
 
పోలీసు సిబ్బంది విధులలో ఉన్న దృష్ట్యా, వారి కుటుంబ సభ్యులకు నిత్యావసర వస్తువులు మరియూ అత్యవసర సేవల కల్పనకు ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్‌లో ఫామిలీ వెల్ఫేర్ డెస్క్ ఏర్పాటు చేశారు. ఈ అవకాశాన్ని వేలాది మంది పోలీసు కుటుంబాలు ఉపయోగించు కొన్నారు. 
 
అదేవిధంగా, మానసిక ఒత్తిడి, ఆరోగ్య సమస్యలు దృష్టిలో పెట్టుకొని, హెల్త్ సర్వే నిర్వహించడం జరిగింది. ఆరోగ్య భద్రతలో లభ్యమైన డేటా, హెల్త్ సర్వే డేటా ఆధారంగా, హృదయ, మూత్రపిండ, దీర్ఘ కాలిక శ్వాస కోశ సంబంధిత వ్యాధులు, డయాబెటిస్ తదితర సమస్యలు ఉన్న వారిని గుర్తించి, వారికి కౌన్సెలింగ్ ఇస్తూ వారిలో మనో ధైర్యాన్ని నింపారు. అందులో తీవ్రత ఉన్నవారిని ఎంపిక చేసి, అట్టి వారిని నిరంతరం పర్యవేక్షిస్తూ, వారిని ఎప్పటికప్పుడు పరామర్శిస్తూ వ్యాధి బారిన పడకుండా కాపాడటం జరిగింది. 
 
కోవిడ్ విధులు నిర్వహిస్తున్న 45 మంది పోలీస్ సిబ్బందికి కరోన వైరస్ లక్షణాలు బయటపడంతో డి‌జి‌పి గారు ఎప్పటికప్పుడు అట్టి వ్యక్తుల చికిత్స గురించి వాకబు చేస్తూ వారికి, వారి కుటుంబ సభ్యులకు కావాల్సిన సదుపాయాలు ఏర్పరిచి, మెరుగైన వైద్య సేవలను అందించడం వల్ల కోవిడ్ బారిన పడ్డ పోలీసు సిబ్బంది అందరూ ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యారు.
 
పోలీసు శాఖ తీసుకున్న చర్యలు వల్ల గత రెండు వారాలుగా పోలీసు సిబ్బంది ఎవ్వరికీ వ్యాధి సోకక పోవడం గమనార్హం.
 
 కరోనా సోకిన విషయాన్ని ప్రాథమిక దశలో గుర్తించకపోవడంతో హిందూపురంకి చెందిన ఏఎస్ఐ హాబీబూల్లాను పోలీస్ శాఖ కోల్పోవడం దురదృష్టకరం. దేశంలో ఎక్కడాలేని విధంగా, గౌరవ ముఖ్యమంత్రి హాబీబుల్లా కుటుంబానికి 50 లక్షలు ఆర్థిక సహాయం అందించి, దేశానికే ఆదర్శంగా నిలిచారు. వారి సహాయం పోలీసు శాఖ ఎప్పటికీ మరువదు. వారిచ్చిన ధైర్యం, స్పూర్తితో రెట్టింపు ఉత్సాహంతో ప్రజా సేవలో అంకిత మవుతూ దేశానికే ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖ ఆదర్శంగా నిలుస్తోంది.
 
కరోనా వ్యాప్తిని నివారించే క్రమంలో వ్యాధి బారిన పడి కోలుకున్న పోలీసు సిబ్బంది అందరికీ, వారి కుటుంబ సభ్యులకు డీజీపీ గారు  అభినందనలు తెలియచేశారు. పోలీసు సిబ్బంది, ద్విగుణీకృత ఉత్సాహంతో కరోన వ్యాప్తి నివారణకు ముందుకు కదలాలని గౌతమ్ సవాంగ్ ఆకాంక్షించారు.