మంగళవారం, 26 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 18 జులై 2019 (19:50 IST)

గ్రామ వాలంటీర్ల వ్యవస్థ నియమాక ప్రక్రియ అంశాలపై సిఎస్ సమీక్ష

రాష్ట్రంలో త్వరలో ఏర్పాటు చేయనున్న గ్రామ సచివాలయ వ్యవస్థ, వాటిలో నియమించనున్న గ్రామ వాలంటీర్ల నియామకం తదితర అంశాలపై గురువారం అమరావతి సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం సంబంధిత శాఖల కార్యదర్శులతో సమీక్షించారు.

ముఖ్యంగా అక్టోబరు మాసంలో ఈ గ్రామ వాలంటీర్ల వ్యవస్థను అమలులోకి తీసుకురానున్న నేపథ్యంలో వారి నియామకం, విధివిధానాలు తదితర అంశాలకు సంబంధించిన ప్రక్రియనంతటినీ వేగవంతంగా పూర్తిచేసి రెండు మూడు రోజుల్లో ముఖ్యమంత్రితో సమావేశమై తదుపరి నోటిఫికేషన్ జారీ చేసేందుకు తగిన చర్యలు తీసుకునేలా కసరత్తును పూర్తి చేయాలని పంచాయితీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి, ఆర్ధిక శాఖల ముఖ్య కార్యదర్శులు గోపాల కృష్ణ ద్వివేది, ఎస్ఎస్ రావత్ లను సిఎస్ ఆదేశించారు.

గ్రామ స్థాయిలో వివిధ అంశాలకు సంబంధించి ప్రస్తుతం ఉన్న సేవలకు అదనంగా రానున్న గ్రామ కార్యదర్శుల వ్యవస్థ ద్వారా ప్రజలకు గ్రామ స్థాయిలో మరిన్ని మెరుగైన సేవలు అందేలా చర్యలు తీసుకోవల్సి ఉందని అన్నారు.  ప్రస్తుతం పంచాయితీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి, వ్యవసాయ అనుబంధశాఖలు, వైద్య ఆరోగ్యం, ఇంధన తదితర ప్రధాన శాఖలు తరపున గ్రామ స్థాయిలో శాశ్వత, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ విధానంలో ఎంతమంది సిబ్బంది పనిచేస్తున్నారు,

వారి నియమాక ప్రక్రియ విధి విధానాలు, వారికి ప్రస్తుతం చెల్లిస్తున్న జీతభత్యాలు తదితర అంశాలపై ఆయా శాఖల కార్యదర్శులను సిఎస్ అడిగి తెలుసుకున్నారు. త్వరలో ఏర్పాటు కాబోయే గ్రామ సచివాలయ వ్యవస్థలో సంబంధిత శాఖల తరపున ఎంతమంది నియామకం అవసరం ఉందనే అంశాలపై సమావేశంలో చర్చించారు. ఈ ప్రక్రియనంతటినీ త్వరితగతిన పూర్తి చేయాలని సిఎస్  సుబ్రహ్మణ్యం ఆయా శాఖల కార్యదర్శులను ఆదేశించారు.

సమావేశంలో పశుసంవర్ధక, మత్స్యశాఖల ప్రత్యేక ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య, పంచాయితీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి, ఆర్థిక, వైద్య ఆరోగ్య, వ్యవసాయ శాఖల ముఖ్య కార్యదర్శులు గోపాలకృష్ణ ద్వివేది, ఎస్ఎస్ రావత్, డా.కెఎస్ జవహర్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, ఇంధన శాఖ కార్యదర్శి ఎన్.శ్రీకాంత్, ఆయా శాఖల కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.