1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 24 మే 2024 (08:13 IST)

ఆదివారానికి తీవ్ర వాయుగుండంగా మారనున్న అల్పపీడనం - తెలుగు రాష్ట్రాలపై ప్రభావమెంత?

rain
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వచ్చే ఆదివారానికి తీవ్రవాయుగుండంగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇది ఆదివారం సాయంత్రానికి పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్‌ ప్రాంతాల మధ్య తీరం దాటే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఈ తుఫాను ప్రభావంతో ఉత్తర ఒడిశా, పశ్చిమబెంగాల్, మిజోరం, త్రిపుర, మణిపూర్ రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. అయితే మిగతా తీర ప్రాంత రాష్ట్రాలపై ప్రభావం తక్కువగానే ఉంటుందని పేర్కొంది.
 
ప్రస్తుత నైరుతికి సీజన్‌కు సంబంధించి రుతుపవనాలకు ముందు ఏర్పడుతున్న మొట్టమొదటి తుఫాన్ ఇదేనని అధికారులు తెలిపారు. హిందూ మహా సముద్రంలో ఏర్పడే తుఫానులకు పెట్టే పేర్ల క్రమంలో.. ప్రస్తుతం ఉన్న పేరు రెమల్. దీనిని ఈ తుఫానుకు పెట్టనున్నట్టు వెల్లడించారు.
 
కాగా, బంగాళాఖాతంలో అల్పపీడనం పరిస్థితిపై భారత వాతావరణ శాఖ శాస్త్రవేత్త మోనికా శర్మ స్పందిస్తూ, 'మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం శుక్రవారం ఉదయానికల్లా వాయుగుండంగా మారుతుంది. తర్వాత మరింత బలపడి శనివారం ఉదయానికల్లా తుఫానుగా, ఆ తర్వాత తీవ్ర తుఫానుగా మారుతుంది. ఆదివారం సాయంత్రానికల్లా పశ్చిమబెంగాల్, బంగ్లాదేశ్ ల మధ్య తీరం దాటే అవకాశం ఉంది' అని పేర్కొన్నారు. 
 
మరోవైపు, అల్పపీడనం తుఫానుగా మారాక గంటకు 102 కిలోమీటర్ల వరకు వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. మే 27వ తేదీ వరకు ఒడిశా, పశ్చిమబెంగాల్, ఈశాన్య రాష్ట్రాల వారు చేపల వేట, ఇతర ఏ పనులపైనా సముద్రంలోకి వెళ్లవద్దని స్పష్టం చేసింది. ఇప్పటికే సముద్రంలోకి వెళ్లిన మత్స్యకారులు వెంటనే తీరానికి చేరుకోవాలని సూచించింది.