శనివారం, 24 ఫిబ్రవరి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 7 డిశెంబరు 2023 (10:30 IST)

మిచాంగ్ తుపాను.. నిండుతున్న గోదావరి రిజర్వాయర్లు

మిచాంగ్ తుపాను కారణంగా గోదావరి జిల్లాల పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు రిజర్వాయర్లు, చెరువులు నిండుతుండగా, వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి.
 
ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం కొంగవారిగూడెంలోని యర్ర కాలువ నుంచి కరాటం కృష్ణమూర్తి రిజర్వాయర్‌కు భారీగా నీరు వచ్చి చేరుతోంది. మరోరోజు వర్షం కురిస్తే జలాశయం నిండుకుండలా మారే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం రిజర్వాయర్ పూర్తి స్థాయి 83.50 మీటర్లకు గాను 82.68 మీటర్ల నీటిమట్టం ఉంది. 
 
జలాశయంలోకి ఇప్పటి వరకు 15,372 క్యూసెక్కుల నీరు వచ్చి చేరింది. ఏలూరు జిల్లా చింతలపూడి మండలం నాగిరెడ్డిగూడెం వద్ద ఉన్న తమ్మిలేరు జలాశయానికి బుధవారం 1,493 క్యూసెక్కుల నీరు చేరింది. 
 
రిజర్వాయర్‌ బేసిన్‌ మట్టం 355.18 అడుగులు కాగా సామర్థ్యం 355 అడుగులుగా ఉందని రిజర్వాయర్‌ అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ ఎ. పరమానందం తెలిపారు.