ప్రత్యేక హోదా కోసం శ్రీకాకుళం వాసి ఆత్మబలిదానం
విభజన హామీ మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలని కోరుతూ శ్రీకాకుళం జిల్లా వాసి ఒకరు ఆత్మబలిదానానికి పాల్పడ్డారు. ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఢిల్లీలోని ఏపీ భవన్ వేదికగా ధర్మపోరాట దీక్ష సోమవారం జరుగుతోంది. ఇందులో ఏపీ సీఎం చంద్రబాబు స్వయంగా పాల్గొన్నారు. ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఈ దీక్ష జరుగనుంది.
ఈ దీక్షలో పాల్గొనేందుకు ఢిల్లీకి వెళ్ళిన శ్రీకాకుళం జిల్లా కింతలికి చెందిన దవళ అర్జున్ రావు ఆత్మహత్య చేసుకున్నాడు. ఏపీ భవన్ సమీపంలోని జశ్వంత్ సింగ్ రోడ్డు ఫుట్ పాత్‌పై ఉదయం 7 గంటల ప్రాంతంలో అర్జున్ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. అతని దగ్గర నుంచి సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. నోట్ తెలుగులో రాసి ఉందని పోలీసులు తెలిపారు. ప్రత్యేక హోదా కోసం ఆత్మహత్యకు పాల్పడినట్టు లేఖలో అర్జున్ పేర్కొన్నట్టు చెప్పారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.