ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేయలేకపోయిన పవన్ కళ్యాణ్.. ఎందుకో తెలుసా?
ఏపీ ఉప ముఖ్యమంత్రి, సినీ నటుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తన ఓటు హక్కును వినియోగించుకోలేక పోయారు. కానీ, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు, ఏపీ మంత్రి నారా లోకేశ్ మాత్రం ఓట్లు వేశారు. వీరిద్దరూ ఓటు వేయంగా పవన్ కళ్యాణ్ ఎందుకు ఓటు వేయలేదన్న సందేహం ప్రతి ఒక్కరికీ వస్తుంది. దీనికి కారణం.. పవన్ కళ్యాణ్ పట్టభద్రుడు కాకపోవడమే దీనికి కారణంగా చెప్పొచ్చు.
గుంటూరు - కృష్ణా జిల్లాలు, ఉభయ గోదావరి జిల్లాల నియోజకవర్గాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ, ఉత్తరాంధ్ర నియోజకవర్గ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు గురువారం పోలింగ్ జరుగుతుంది. ఉండవల్లిలోని పోలింగ్ బూత్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన తనయుడు, మంత్రి నారా లోకేశ్‌లు ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ఈ ఎన్నికల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఓటు హక్కును వినియోగించుకోలేక పోయారు. గ్యాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కేవలం పట్టభద్రులకు మాత్రమే ఓటు హక్కు కల్పిస్తారు. పవన్ కళ్యాణ్ మాత్రం ఇంటర్ వరకు మాత్రమే చదువుకున్నారు. ఆయన డిగ్రీని పూర్తి చేయలేదు. దీంతో ఆయన ఈ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకోలేక పోయారు. అయితే, ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్న కూటమి అభ్యర్థులకు ఓటు వేయాలని కోరుతూ ఆయన ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు.