శనివారం, 23 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 19 మే 2021 (10:59 IST)

దేశం మొత్తం ఏపీ వైపే చూడటం అంటే ఇదేనేమో? దేవినేని ఉమ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపు దేశం మొత్తం వైపు ఎందుకు చూస్తుందో ఇపుడు అర్థమవుతుందని టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమామహేశ్వర రావు అన్నారు. తిరుపతి ఉపఎన్నిక కోసం మార్చిలో బడ్జెట్ వాయిదా పడిందని... 2 ఏళ్లు డిమాండ్లపై చర్చలేకుండా లక్షల కోట్లు ఖర్చు పెట్టారని ఆయన ఆరోపించారు.
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, 'తిరుపతి ఉపఎన్నిక కోసం మార్చిలో బడ్జెట్ వాయిదా 2 ఏళ్లు డిమాండ్లపై చర్చ లేకుండా లక్షల కోట్లు ఖర్చు పెట్టారు. మొక్కుబడి తంతుగా ఒక్కరోజు బడ్జెట్ దేశం మొత్తం ఏపీ వైపే చూడటం అంటే ఇదేనా? కరోనా కష్ట సమయాల్లో బడ్జెట్ సమావేశాలు ఎందుకు పెట్టాల్సిన పరిస్థితి వచ్చిందో ప్రజలకు సమాధానం చెప్పండి? వైఎస్ జగన్' అని దేవినేని ఉమ పేర్కొన్నారు. 
 
ఒక రోజుపాటు నిర్వహించతలపెట్టిన అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించింది. మంగళవారం ఆన్‌లైన్‌లో జరిగిన ఆ పార్టీ శాసనసభాపక్ష సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. తూతూమంత్రంగా ఒకరోజు అసెంబ్లీ సమావేశం నిర్వహించడం వల్ల ఏ ప్రయోజనం లేదని, అందుకే దానిని బహిష్కరించాలని నిర్ణయించామని సమావేశానంతరం ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, శాసనమండలిలో ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు విలేకరులకు తెలియజేశారు. 
 
అసెంబ్లీ పెడుతున్న గురువారం రోజు తాము మాక్‌ అసెంబ్లీ నిర్వహించి రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను చర్చిస్తామని, ప్రజల పట్ల తమ బాధ్యతను నిర్వర్తిస్తామని చెప్పారు. 'ఈ ఏడాది మార్చిలో అసెంబ్లీ పెట్టి బడ్జెట్‌ ఆమోదం పొందాల్సి ఉంది. ఆ సమయంలో రాష్ట్రంలో కరోనా కేసులు 900 మాత్రమే ఉన్నాయి. కేంద్రం పార్లమెంటు సమావేశాలను, అనేక రాష్ట్ర ప్రభుత్వాలు అసెంబ్లీ సమావేశాలను ఆ సమయంలో నిర్వహించి బడ్జెట్లను ఆమోదింపజేసుకొన్నాయి. కానీ ఈ ముఖ్యమంత్రి అసెంబ్లీ అంటే లెక్కలేనితనంతో సమావేశాలు పెట్టలేదు. 
 
ఇప్పుడు రెండు లక్షల క్రియాశీల కేసులు ఉన్నప్పుడు అసెంబ్లీ పెడతామని అంటున్నారు. అది అసెంబ్లీపై ప్రేమ కాదు. ఆరు నెలల్లోపు అసెంబ్లీని పెట్టాల్సిన రాజ్యాంగ అవసరం రీత్యా పెడుతున్నారు. అది కూడా కేవలం ఒక రోజు పెట్టి దులుపుకొని పోతున్నారు. ఆ ఒక్క రోజులోనే గవర్నర్‌ ప్రసంగం, బడ్జెట్‌ ఆమోదం రెండూ అవగొట్టేసుకొని పోవాలని నిర్ణయించుకొన్నారు. ఇంత మొక్కుబడి తంతులో మేం భాగస్వాములం కాదల్చుకోలేదు. అందుకే బహిష్కరణ నిర్ణయం తీసుకొన్నాం' అని  అచ్చెన్నాయుడు అన్నారు