పోలవరంపై పులివెందుల పంచాయతీ : దేవినేని ఉమ
పోలవరం పనులు దాదాపు పూర్తయ్యాయని మాజీమంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు అన్నారు. పోలవరంపై పులివెందుల పంచాయాతీ మొదలుపెట్టారని ఆయన ఎద్దేవా చేశారు. శుక్రవారం మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన సీఎం జగన్, వైసీపీ నేతలపై మండిపడ్డారు.
15 రోజుల్లో సెటిల్మెంట్ చేసుకోవాలని జగన్ చెబుతున్నారని దేవినేని అన్నారు. పోలవరం పనులు దాదాపు పూర్తయ్యాయని చెప్పారు. అయితే... పోలవరం పనుల్లో అవినీతి జరిగిందంటూ కావాలనే వైసీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. పోలవరం డ్యామ్ దగ్గర గోదావరి వరదను మళ్లించేందుకు నవయుగ ఇంజినీర్లు రాత్రింబవళ్లు కష్టపడుతున్నారని దేవినేని ఉమా స్పష్టం చేశారు.
కాగా 60సీ నిబంధన ప్రకారం 2018 ఫిబ్రవరిలో నవయుగ సంస్థకు హెడ్ వర్క్స్ పనులు అప్పగించారు. రూ.3 వేల కోట్ల విలువైన పులను నవయుగకు అప్పగిస్తూ అప్పటి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రూ.3,220 కోట్ల జల విద్యుత్ టెండర్లను కూడా నవయుగ దక్కించుకుంది.
జల విద్యుత్ ప్రాజెక్టు నుంచి కూడా తప్పుకోవాలని నవయుగకు తాజాగా ఇరిగేషన్ శాఖ సూచించింది. పోలవరం పనులపై వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ.. ఇప్పటికే ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. పోలవరం టెండర్లు, పనుల అప్పగింత, అంచనాల పెంపుతో అవినీతి జరిగిందని నివేదికలో పేర్కొంది. దీంతో నవయుగను ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకోవాలని జగన్ సూచించారు.