తాడికొండ ఎమ్మెల్యేపై అనర్హత వేటు తప్పదా…?

tadikonda mla sridevi
ఎం| Last Updated: బుధవారం, 20 నవంబరు 2019 (07:32 IST)
గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ దళిత మహిళా ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి తప్పుడు కుల సర్టిఫికెట్‌ సమర్పించి ఎన్నికల కమీషన్‌ను తప్పు దోవ పట్టించారని రాష్ట్రపతికి లీగల్‌ రైట్స్‌ ప్రొటక్షన్‌ ఫోరంతో పాటు పలువురు ఆధారాలతో ఫిర్యాదు చేయటం జరిగింది.

ఈ ఫిర్యాదుపై స్పందించిన రాష్ట్రపతి కార్యాలయం వాస్తవాలను విచారించి నివేదకను పంపాలని కేంద్ర ఎన్నికల కమీషన్‌ను ఆదేశించింది. వెంటనే ఎన్నికల కమీషన్‌ స్పందించి గుంటూరు జిల్లా కలెక్టర్‌ను విచారణ జరిపి శ్రీదేవి ఏ కులం, మతానికి చెందిన వారో వివరాలు తెలపాలని లిఖిత పూర్వకంగా తెలియజేసింది. దీంతో కలెక్టర్‌ స్పందించి విచారణ అధికారిగా జాయింట్‌ కలెక్టర్‌ను నియమించారు.

ఈ నెల 26వ తేదీ విచారణకు హాజరు కావాలని జాయింట్‌ కలెక్టర్‌ దినేష్‌ కుమార్‌ ఎమ్మెల్యే శ్రీదేవికి నోటీసు జారీ చేయటమే కాకుండా మీరు దళిత వర్గానికి చెందిన వారని నిరూపించుకునే పత్రాలు కూడా సమర్పించాలని, మీ వెంట మీ కుటుంబసభ్యులు ఎవరినైనా తీసుకురావచ్చని సూచించారు.

వినాయకచవితి పండుగ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీదేవి తన నియోజకవర్గంలోని ఒక మండపాన్ని సందర్శించినప్పుడు పలువురు అభ్యంతరం వ్యక్తం చేయటంతో… ఆమె ఎస్సీ, ఎస్టీ అంటరాని తనం కేసును పెట్టడంతో ఆమె సొంత కులం ఏమిటి అనే విషయం తెరపైకి వచ్చింది.

గతంలో ఒక ఛానెల్‌కు శ్రీదేవి ఇంటర్వ్యూ ఇస్తూ తాను క్రైస్తవ మతానికి చెందిన మహిళ అని అంగీకరించారు. ఈ వీడియోను ఆధారం చేసుకుని పలువురు ఇతర ఆధారాలతో కలిపి ఫిర్యాదు చేయటంతో శ్రీదేవి వ్యవహారం పూర్తిగా తెరపైకి వచ్చింది.దీనిపై మరింత చదవండి :