మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎంజీ
Last Updated : గురువారం, 9 సెప్టెంబరు 2021 (06:35 IST)

ఎమ్మెల్యే చెవిరెడ్డి చంద్రగిరిలో 75 వేల వినాయక విగ్రహాల పంపిణీ

పర్యావరణ హితం.. కరోనా కట్టడి కోసం చంద్రగిరి నియోజకవర్గ పరిధిలో ఒక్క అడుగు చొప్పున తయారు చేసిన 75 వేలకు పైగా గణేష విగ్రహాల పంపిణీకి ప్రభుత్వ విప్, చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సంకల్పించారు. తొలిపూజను అందుకునే గణనాధుని చవితి పండుగ వేడుకలు ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నేతృత్వంలో నియోజకవర్గ పరిధిలో అత్యంత వైభవంగా నిర్వహిస్తూ వచ్చారు.

రాష్ట్రంలోనే ప్రత్యేకంగా తుమ్మలగుంటలో వినాయక చవితి వేడుకలు నిర్వహించేవారు. గత 14 సంవత్సరాలుగా గణేష్ విగ్రహాలను అందిస్తూ.. సాంప్రదాయ పండుగను భవిష్యత్తు తరాలకు తెలియజేస్తున్నారు. నేడు కరోనా నేపథ్యంలో ప్రజల సంక్షేమం కోసం వినాయక చవితి వేడుకలను ఇళ్ళకే పరిమితం చేసుకోవాలని, ఆయురారోగ్యాలతో పండుగను జరుపుకోవాలని ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పిలుపునిచ్చారు. 
 
పర్యావరణ హితం.. కరోనా కట్టడి నేపథ్యం 
వినాయక చవితిని సాంప్రదాయబద్ధంగ జరుపుకుందామని ఎమ్మెల్యే చెవిరెడ్డి తనయుడు, వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షులు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం 75 వేలకు పైగా ఉచిత వినాయక మట్టి విగ్రహాల పంపిణీ కార్యక్రమాన్ని మోహిత్ రెడ్డి ప్రారంభించారు. ఇందుకు తిరుపతి రూరల్ మండలం.. పేరూరు పంచాయతీలోని ధర్మరాజులు ఆలయం వేదికైంది.

ఈ సందర్భంగా మోహిత్ రెడ్డి మాట్లాడుతూ.. ముందుగా నియోజకవర్గ ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు. మట్టితో చేసిన వినాయక ప్రతిమలను పూజించడం సాంప్రదాయ పద్ధతిగా స్వీకరించాలన్నారు. పర్యావరణానికి ఎటువంటి హాని కలగకుండా మనల్ని మనం పరిరక్షించుకునేందుకు మనమందరం సంకల్పించాలని కోరారు.

చంద్రగిరి శాసన సభ్యులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రకృతి పర్యావరణ పరిరక్షణకు, సంప్రదాయ పద్దతులను అమలు చేసేందుకు శ్రీకారం చుట్టారన్నారు. ఏటా వినాయక చవితి పండుగ పర్వదినాన్ని పురస్కరించుకొని మట్టి గణపతి విగ్రహాలను పంపిణీ చేస్తున్నారని తెలియజేశారు.
 
ఈ ఏడాది కూడా 75 వేలకు పైగా మట్టి గణపతి ప్రతిమలను పంపిణీ చేయనున్నట్లు స్పష్టం చేశారు. దయచేసి ఎవరు ప్లాస్టర్ ఆఫ్ పారిస్ తో తయారు చేసిన, కృత్రిమ రంగులు వేసినటువంటి వినాయక ప్రతిమలు వినియోగించవద్దని తెలియజేశారు. నియోజకవర్గ పరిధిలో ఉచితంగా పంపిణీ చేసే మట్టి గణపతి విగ్రహాలను ప్రజలకు అందుబాటులో ఉంచేందుకు అనుకూలంగా  16 కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.

కరోనా పరిస్థితుల దృష్ట్యా నిబంధనలు అనుసరించి వినాయక చవితి పండుగను జరుపుకోవాలని ప్రజలకు విన్నవించారు. రాష్ట్ర ప్రభుత్వ నియమాలను తూచా తప్పక పాటిద్దామని కోరారు. ఈ కార్యక్రమంలో పేరూరు పంచాయతీ సర్పంచ్ కేశవులు, వైఎస్ఆర్సీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.