ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : ఆదివారం, 20 సెప్టెంబరు 2020 (16:27 IST)

వారంవారం కోర్టు బోనులో నిలబడేవారు న్యాయస్థానాలను తప్పుపట్టడమా? : బొండా ఉమ

రాజధాని ప్రకటన, ఏర్పాటు, భూసేకరణ ప్రక్రియమొత్తం బహిరంగంగా, రైతులసమక్షంలో పారదర్శకంగా జరిగింది తప్ప, క్విడ్ ప్రోకో వ్యవహారంలా చీకట్లో జరగలేదని, అటువంటప్పుడు లేని ఇన్ సైడర్ ట్రేడింగ్ ఎలా జరుగుతుందని టీడీపీ నేత, మాజీఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు ప్రశ్నించారు.

ఆయన తననివాసం నుంచి జూమ్ యాప్ ద్వారా విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే ... "వైసీపీ 15నెలల పాలనలో రాష్ట్రం 20ఏళ్లు వెనక్కు వెళ్లింది. భూమాఫియా, మైనింగ్, శాండ్, లిక్కర్, మాఫియాలతో వైసీపీనేతలు రాష్ట్రాన్ని అడ్డగోలుగా దోచుకుంటూ, వారి అవినీతిని ప్రశ్నిస్తున్నటీడీపీపై నిందలువేస్తున్నారు.

వైసీపీ ప్రభుత్వం చేస్తున్న అవినీతి నుంచి ప్రజలదృష్టిని మళ్లించడానికే జగన్ అండ్ కో ఇన్ సైడర్ ట్రేడింగ్ అంటూ దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం సాగిస్తున్న వన్ సైడ్ ట్రేడింగ్ తప్ప, ఎక్కడా ఇన్ సైడర్ ట్రేడింగ్ లేనేలేదు. రాష్ట్రానికి ఏదో మేలుచేస్తారని ప్రజలు 22మంది ఎంపీలను వైసీపీకి అప్పగిస్తే, వారంతా కక్షపూరితధోరణితో ఫ్యాక్షన్ మనస్తత్వంతో పార్లమెంట్ లో టీడీపీపై బురదజల్లుతున్నారు.

పార్లమెంట్ స్పీకర్ మాట్లాడాల్సిన అంశాలే మాట్లాడమని చెబుతున్నా వినకుండా, వైసీపీఎంపీలు అమరావతి భూములపై విషప్రచారం చేస్తున్నారు.  గల్లీస్థాయిలో రాష్ట్ర పరువు తీసిన వైసీపీ ప్రభుత్వం, ఇప్పుడు ఎంపీలతో ఇష్టారీతిన మాట్లాడిస్తూ, ఢిల్లీస్థాయిలో కూడా ఏపీని అపహస్యం చేస్తోందన్నారు. రాజధానిలో భూములు కొనకూడదని, చట్టంలో ఎక్కడాలేదు. అలా ఉందని ఎక్కడుందో వైసీపీప్రభుత్వం చెప్పాలి. 

రాష్ట్ర విభజన జరిగినప్పటినుంచీ, నూతన రాజధాని ప్రకటన వచ్చేవరకు, ఆప్రాంతంలో కేవలం 127ఎకరాలకు సంబంధించి మాత్రమే క్రయవిక్రయాలు జరిగినట్లు రిజిస్ర్టేషన్లు చెబుతున్నాయి. అటువంటప్పుడు రూ.2లక్షలకోట్ల అవినీతి ఎక్కడ జరిగిందో వైసీపీప్రభుత్వం, ఆపార్టీ ఎంపీలు చెప్పాలి. శివరామకృష్ణన్ కమిటీ నివేదిక తరువాత ప్రసారమాధ్యమాల్లో అమరావతి ఎక్కడ రాబోతుందో ప్రచారం జరిగింది.

అది తెలిసినవారు ఆప్రాంతంలో భూములుకొంటే, అది చట్టవిరుద్ధమెలా అవుతుందో వైసీపీ ఎంపీలు సమాధానం చెప్పాలి. వారం వారం కోర్టుల్లో చేతులుకట్టుకొని నిలబడే వారు కూడా న్యాయస్థానాలు ఏం చేయాలో, జడ్జీలు ఏం చెప్పాలో నిర్ణయించడం బాధాకరం. దమ్మాలపాటి శ్రీనివాస్ కు సంబంధించిన వ్యవహారాలు మీడియాలో ప్రసారం చేయవద్దని కోర్టు చెప్పడాన్ని తప్పుపడుతున్న వైసీపీనేతలు గతంలో జరిగిన వాటిని విస్మరిస్తే ఎలా?

జగన్ బాబాయి వివేకానందరెడ్డి హత్యకేసు విచారణ హైకోర్టులో జరుగుతున్నప్పుడు, కేసు విచారణ వివరాలు మీడియాలో రాకూడదని న్యాయస్థానం చెప్పలేదా? ఉమ్మడి రాష్ట్రంలో గవర్నర్ గా పనిచేసిన తివారీ విషయంలో కూడా నాటి న్యాయస్థానం అదేవిదంగా మీడియాను నియంత్రించలేదా?  అదేవిధంగా వైసీపీఎమ్మెల్యే అంబటి రాంబాబు, మరో మహిళ వ్యవహరంలో కూడా నాడు న్యాయస్థానం ఇదేవిధంగా చెప్పడం జరిగింది.

నిన్నటికి నిన్న సినీనటి రకుల్ ప్రీత్ సింగ్ డ్రగ్స్ వ్యవహారంలో కూడా ఢిల్లీ హైకోర్ట్ ఏం చెప్పిందో వైసీపీ ఎంపీలకు తెలియదా. అన్నీ తెలిసికూడా వైసీపీ ప్రభుత్వం, ఆపార్టీ నేతలు న్యాయస్థానాలను దూషిస్తూ, జడ్జీలను తప్పుపట్టడం సిగ్గుచేటు. ఢిల్లీలోని మేథావులు, మీడియా పెద్దలు, వైసీపీ సానుభూతిపరులు అక్కడున్న సినీనటి కేసులో హైకోర్టు ఆదేశాలను పట్టించుకోకుండా మాట్లాడితే ఎలా? 

జడ్జీల ముందు చేతులుకట్టుకొని నిలబడాల్సిన వారు వారినే దూషించే స్థాయికి చేరారంటే, వైసీపీ ఎంతలా బరితెగించిందో అర్థమవుతోంది.  రాజధానిలో చంద్రబాబు ప్రభుత్వం జడ్జీలకు భూములిచ్చిందని చెబుతున్న వైసీపీనేతలు, గతంలో ఉమ్మడి రాష్ట్రంలో వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన జీవోనెం-243ని చదువుకోవాలి.

2005లో ఆనాటి రాష్ట్ర ప్రభుత్వం, ఐఏఎస్, ఐపీఎస్ లు, న్యాయమూర్తులకు హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడప్రాంతాల్లో ఇంటిస్థలాలు ఇవ్వవచ్చని సదరు జీవోలో పేర్కొన్నది.  అది తప్పయితే, వైసీపీ ప్రభుత్వం ఆనాడు ఇచ్చిన స్థలాలను ఎందుకు వెనక్కు తీసుకోవడం లేదు? వై.ఎస్ ప్రభుత్వమిచ్చిన జీవోని రద్దుచేసి, జగన్ ఎందుకు ఆ భూములు వెనక్కు తీసుకోవడంలేదు.

రాష్ట్రంలో పరిపాలన సజావుగా సాగడం కోసం అధికారులకు రాజధానిప్రాంతంలో ఇంటిస్థలాలు ఇవ్వడం, ప్లాట్లు కేటాయించడం అనేది ఎప్పటినుంచో వస్తున్నదే. రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం రాజధానిలో ఎమ్మెల్యేలకుకూడా స్థలాలు ఇచ్చింది. చంద్రబాబు నాయుడు ఏనాడూ తనపార్టీ వారికి గజం కూడా ఇవ్వలేదు.  పదేపదే అబద్ధాలు చెబుతూ, వాటినే గల్లీనుంచి ఢిల్లీలో కూడా ప్రచారం చేస్తూ ప్రజలను తప్పదారి పట్టిస్తున్నారు.

కేంద్రం మెడలు వంచి ప్రత్యేకహోదా తెస్తామన్నవారు, రాష్టప్రయోజనాలను తాకట్టు పెట్టి, కేసులనుంచి బయటపడటంకోసం కేంద్రపెద్దల కాళ్లు పట్టుకుం టున్నారు. రాష్ట్ర విభజన తర్వాత అమరావతి ప్రకటన, ఏర్పాటు అనేవి ఎవరికీ తెలియకుండా జరగలేదు. చీకట్లో క్విడ్ ప్రోకో వ్యవహారంలా జరిగింది కాదు. గత 16 నెలలుగా రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం సాగిస్తున్న వన్ సైడ్ ట్రేడింగ్ తప్ప, ఎక్కడా ఇన్ సైడర్ ట్రేడింగ్ జరగలేదు.

ఢిల్లీలో ఉన్న మేథావులు, వైసీపీ సానుభూతిపరులు గతంలో న్యాయస్థానాలు ఇచ్చిన తీర్పులను పరిశీలించి మాట్లాడితే మంచిది. గతంలో కోర్టులు ఏఏ సందర్భాలలో మీడియాను నియంత్రిస్తూ తీర్పులిచ్చాయో తెలుసుకుంటే మంచిది. 
అమరావతిని నాశనం చేయడానికే వైసీపీ ప్రభుత్వం తొలినుంచీ దుష్ప్రచారం చేస్తోంది. దానిలో భాగంగానే మూడు రాజధానుల పేరుతో విశాఖలో 30వేల ఎకరాలు కాజేశారు.

చివరకు సింహాచలం భూములను కూడా వదలకుండా కొట్టేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. వీటన్నింటి సంగతేమిటో తేల్చండి. తమ ప్రభుత్వ దోపిడీ నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికే హిందూ దేవాలయాలపై దాడులుచేస్తూ, ఆలయ భూములను కైంకర్యం చేస్తున్నారు.

విగ్రహాలను ధ్వంసంచేస్తూ, రథాలు తగలబెడుతు న్నారు. న్యాయమూర్తులను, న్యాయస్థానాలను కించపరిచేలా వ్యాఖ్యలుచేసినందుకు వైసీపీ ప్రభుత్వం, ఆపార్టీనేతలు  తప్పుతెలుసుకొని తక్షణమే బహిరంగ క్షమాపణలు చెప్పాలి"