గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 11 జులై 2020 (19:40 IST)

వైసీపీ దుర్మార్గాలను రాష్ట్రపతి దృష్టికి తీసుకెళుతాం: బోండా ఉమా

అధికారులు అధికార పార్టీకి కొమ్ముకాస్తూ ప్రతిపక్షపార్టీ నాయకుల పైన అక్రమ కేసులు బనాయిస్తున్నారు. అధికార పార్టీ నాయకులు అచ్చొచ్చిన ఆంబోతుల్లా ప్రవర్తిస్తున్న వాళ్లపై ఒక్క కేసు నమోదు చేయటంలేదని మాజీ ఎమ్మెల్యే, టీడిపీ నాయకులు బొండా ఉమామహేశ్వరావ్ అన్నారు.

వైసీపీ ప్రభుత్వం ప్రతిపక్ష నాయకులపై చేస్తున్న వేధింపులపై మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయంలో విలేఖరుల సమావేశం నిర్వహించిన ఆయన అంబేడ్కర్ రాసిన రాజ్యాంగంలో ఎవరికైనా ఒకటే శిక్ష ఉందని కానీ ఉన్నత చదువులు చదువుకున్న పోలీసు అధికారులు అధికార పక్షం చేతితో కీలు బొమ్మల్లా మారిపోయి ప్రభుత్వ తప్పిదాలను ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని మండిపడ్డారు.

తాడేపల్లి నుండి ఆదేశాలు వస్తే మంగళగిరి పోలీసు కార్యలయంలో అమలు చేస్తున్నారు. గురజాలలో విక్రమ్ అనే తెలుగుదేశం పార్టీ కార్యకర్త, దళిత యువకుడిని పోలీసులే హత్య చేయించడం దుర్మార్గమని మండిపడ్డారు.

ఊరిలో గొడవలకు దూరంగా ఉందామని హైదరాబాద్ వెళ్లిన విక్రమ్ ను సిఐ ప్రత్యర్దులకు సమాచారం ఇచ్చి నడి రోడ్డు మీద పట్టపగలు హత్య చేయించారని ఆవేదన వ్యక్తం చేశారు. స్వయానా విక్రమ్ తల్లి వైసీపీ నాయకుల పాత్ర చాలా స్పష్టంగా వివరించి ఆధారాలు చూపించినా ఎటువంటి చర్యలు తీసుకోవటం లేదని అన్నారు.. 

“ఏ మచ్చలేని 70 సంవత్సరాల వయసున్న అయ్యన్నపాత్రుడు పైన నిర్భయ కేసు (రేప్) పెట్టారు. 40 సంవత్సరాల రాజకీయ చరిత్ర ఉన్న అచ్చెన్నాయుడు పైన కేసులు పెట్టి వేధిస్తున్నారు. స్పీకర్ గా, శాసనసభ వ్యవహారాల మంత్రిగా, ఆర్ధికమంత్రిగా పదవులు నిర్వహించిన యనమల రామకృష్ణుడిపై ఆశీర్వదించి, అక్షింతలు వేద్దామని ఒక పెళ్లికి వెళితే ఆయనపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారు.

నిమ్మకాయల చిన్నరాజప్ప పై అక్రమ కేసులు కేసు పెట్టి వేదిస్తున్నారు. ఎటువంటి వివాదాలకు వెళ్లని అత్యంత సౌమ్యుడి పేరున్న కొల్లు రవీంద్రపై హత్య కేసు బనాయించారు. రాజశేఖర్ రెడ్డి హయాంలో కూడా వీళ్లందరు ప్రతిపక్షనాయకులుగా ఉన్నారు. అప్పుడు కూడా వీళ్లపై ఎటుకంటి కేసులు పెట్టలేదని” గుర్తు చేశారు.
 
కొల్లు రవీంద్ర గురించి కృష్ణ జిల్లాలో చిన్న పిల్లవాడిని అడిగినా చెబుతారని మోకా బాస్కర్ రావు, చింత చిన్న కుటుంబాల మద్య జరిగిన గొడవల్లో భాగంగా బాస్కర్ రావును హత్య చేస్తే రవీంద్రపై కేసు పెట్టారు.

హత్య జరిగిన సాయంత్రమే హంతకులు సరండర్ అయ్యారని సాక్షి టీవీలో కూడా వస్తే సరండర్ అయిన హంతకుల చేత పోలీసులు రవీంద్రకు పోన్ చేయించి ఆ ఆదారంతో దుర్మార్గంగా కేసు నమోదు చేసి రాజమండ్రి జైల్ లో పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు.

అయ్యన్న పాత్రుడు ఎనమల రామకృష్ణుడు, అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర లపై జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం రాక ముందు ఏ కేసులైనా ఉన్నాయా అని పోలీసు అధికారులను ప్రశ్నించారు. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ అత్యంత విక్షతతో పని చేస్తుందని, భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇలా జరగడం లేదని అన్నారు. చిన్న మెసేజ్ పార్వర్డ్ చేసినందుకు కిశోర్,  రంగనాయకమ్మపై కేసులు పెట్టారన్నారు.

2013 లో చింత కుటుంబ సభ్యుడిని హత్య చేసిన మోకా బాస్కర్ రావు ను వదలమనే స్టేట్మెంట్ ను నాడు చింతకుటుంబ సభ్యులు ఇచ్చారన్నారు. కానీ కొల్లు రవీంద్రపై అన్యాయంగా హత్య కేసును బనాయించాలని చూస్తున్నారు. రెండు కుటుంబాల మద్య ఉన్న గొడవలను తెలుగుదేశం మెడకు చుట్టాలని చూస్తున్నారు.

తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు అనేకమంది హత్యకు గురయ్యారైనా హంతకులపై అధికారులు ఎటువంటి కేసులు పెట్టడం లేదన్నారు. ఉన్నత చదువులు చదువుకున్న పోలీసు అధికారులు, చట్టాలు తెలిసిన అధికారులు రాజ్యాంగాన్ని అపహాస్యం చేయొద్దని విజప్తి చేశారు.

వైకాపా ప్రభుత్వ అవినీతిని, తప్పులను, దుర్మాలను ప్రశ్నించిన వారిపై ఉక్కుపాదంతో అణచివేస్తున్నారు. స్వాతంత్ర్యం వచ్చిన 70 సంత్సరాలలో ప్రజల గొంతు నొక్కేసిన ప్రభుత్వాలు, పోలీసు యంత్రాంగాన్ని చూడలేదు. గత ఐదు సంవత్సరాలలో ఏ అధికారైనా హైకోర్టు మెట్లు ఎక్కి ఉదయం నుండి సాయంత్రం వరకు పడిగాపులు కాసారా అని ప్రశ్నించారు.

రాజ్యాంగాన్ని, రాజ్యాంగ వ్యవస్థలను తుంగలో తొక్కడం వల్ల ఈ రోజు పోలీసు అధికారులను కోర్టులు చీవాట్లు పెడుతున్నాయి. గతంలో జగన్ మోహన్ రెడ్డి తండ్రి మాటలు విని పని చేసిన అధికారులను దృష్టిలో పెట్టుకోవాలని పనిచేయాలని అధికారులను కోరారు.

ఆల్ ఇండియా సర్వీసు టాపర్ గా నిలిచిన ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మీ 16 నెలలు జైలులో ఉందని,. రాజగోపాల్, ఎల్వీ సుబ్రమణ్యం లాంటి అనేక మంది అధికారులు అనేక ఇబ్బందులు పడ్డారని గుర్తు చేశారు. ప్రతిపక్ష వేధింపుల కోసమే అధికార యంత్రాంగం పని చేస్తుందా అనే అనుమానం కలుగుతుందన్నారు.

ఇప్పటి వరకు రాష్ట్రంలో జరిగిన సంఘటనల పై తెలుగుదేశం పార్టీ అన్నీ రాజ్యాంగ వ్యవస్థల దృష్టికి తీసుకెళుతుందని త్వరలోనే ఢిల్లీకి వెళ్లి ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడవలసిన భారత ప్రధమ పౌరుడు రాష్ట్రపతి దృష్టికి తీసుకెళతామని చెప్పారు.

ఇప్పటికే గవర్నర్, హైకోర్టుల దృష్టికి తీసుకెళ్లాం. ఇప్పటికైనా అధికారులు ఇలాంటి వేదింపు చర్యలను మానుకోవాలన్నారు. ఈ ప్రభుత్వం చేసే ప్రతీ దుర్మార్గమైన చర్యలకు తరువాత సమాధానంచెప్పాల్సి ఉంటుందని గుర్తుంచుకోవాలన్నారు.