వైసీపీ అబద్ధాల ప్రచారానికి ప్రభుత్వ నిధులను వినియోగిస్తున్నారని టీడీపీ ఏపీ అధ్యక్షుడు కళా వెంకట్రావు మండిపడ్డారు.
అంబులెన్స్‌ల నిర్వహణలో జగన్ ప్రభుత్వం చేసేంది గోరంత. ప్రచారం కొండంతగా ఉంది. ఆత్మస్తుతి పరనిందగా ఉంది. అబద్ధాలు పదేపదే చెప్పి నందిని పంది, పందిని నంది చేయాలని వైసీపీ ఉబలాటపడుతోందని ఆరోపించారు. ఈ మేరకు సమాధానం చెప్పాలంటూ విజయసాయి రెడ్డికి పలు ప్రశ్నలు సంధించారు. ఆ వివరాలు యధాతథంగా...
* 108 అంబులెన్స్ ఒక్క దాని నిర్వహణకు చంద్రబాబు ప్రభుత్వం నెలకు రూ. 1,31,000 వేలు చెల్లించగా దాన్ని రూ. 2,21,000 వేలకు ఎందుకు పెంచారు? ఒక్క అంబులెన్స్ పై గరిష్టంగా ఒక్క నెలకు రూ. 90 వేలు పెంచారు. దీని ప్రకారం 5 ఏళ్లలో అదనంగా విజయసాయి రెడ్డి అల్లుడి సంస్థకు చెల్లిస్తున్నది రూ. 307 కోట్లు- ఇది నిజం కాదా? ఇది అవినీతి కాదా?
* జగన్ ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెంబర్ . 105, 106లో అంబులెన్స్ లు ఫైనాన్స్ విధానంలో కొనాలని, దీని వల్ల ప్రభుత్వ నిధుల ఖర్చు ఉండదని పేర్కొన్నారు. దీని విరుద్ధంగా రూ. 200 కోట్లు ప్రభుత్వ నిధులు పెట్టి అంబులెన్స్ లు ఎందుకు కొన్నారు? కమిషన్ కోసం కాదా? 10 శాతం కమిషన్ వేసుకున్నా అంబులెన్స్ ల కొనుగోళ్లలో మరో రూ. 20 కోట్లు అవినీతికి పాల్పడ్డారు. ఇది నిజం కాకపోతే జీవో ప్రకారం ఫైనాన్స్ లో ఎందుకు కొనుగోలు చేయలేదు?
* 108,104 అంబులెన్స్ ల నిర్వహణకు ఇచ్చే నిధుల్లో రూ. 307 కోట్లు, అంబులెన్స్ ల కొనుగోళ్లలో సుమారు మరో రూ. 20 కోట్లు అవినీతికి పాల్పడ్డారు?
టీడీపీ ప్రభుత్వం ఈ క్రింది వాహనాలు నిర్వహించింది వాస్తవం కాదా?
104 అంబులెన్స్ లు 292
108 అంబులెన్స్ లు 468
ప్రైవేటు అంబులెన్స్ లు 177
తల్లీ బిడ్డ ఎక్స్ ప్రెస్ లు 279
ముఖ్యమంత్రి బాల సురక్ష అంబులెన్స్ లు 400
ఫీడర్ అంబులెన్స్ లు 144
ఎ.ఎల్. ఎస్ అంబులెన్స్ లు 76
మహాప్రస్థానం 53
మొత్తం 1889
చంద్రబాబు ప్రభుత్వం తక్కువ ఖర్చుతో 1,889 వాహనాలను ఉపయోగించగా జగన్ ప్రభుత్వం ఎక్కువ ఖర్చుతో 1,088 వాహనాలు నడపడం ఏమిటి గొప్ప? పైగా గత ప్రభుత్వం 732 వాహనాలే నడిపినట్టు అబద్ధాల అడ్వర్ టైజ్ మెంట్ ఇస్తారా?
* చంద్రబాబు ముఖ్యమంత్రి సహాయనిధి క్రింద రూ. 1523 కోట్లు ఖర్చు చేశారు. జగన్ ఎంత ఖర్చు చేశారో ఎందుకు లెక్క చెప్పడం లేదు?
* 13 మెడికల్ కాలేజీలు పెడతామంటూ వైకాపా నేతలు గొప్పలు చెప్పుకుంటున్నారు. చంద్రబాబు 23 జిల్లాలకు 23 మెడికల్ కాలేజీలు ఇవ్వలేదా? అలాగే తిరుపతిలో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులైన స్విమ్స్, బర్డ్స్, మంగళగిరిలో ఎయిమ్స్, విశాఖలో మెడ్ టెక్ జోన్ ఏర్పరిచినది వాస్తవం కాదా?
* టీడీపీ ప్రభుత్వం ఆరోగ్యశ్రీలో 800 జబ్బులకే పరిమితం చేశారనే వైకాపా నేతల ఆరోపణలు అబద్ధం కాదా? 1,044 జబ్బులకు చంద్రబాబు పెంచింది వాస్తవం కాదా?
* 2018-19లో వైద్య, ఆరోగ్యశాఖకు చంద్రబాబు ప్రభుత్వం రూ. 8,910 కోట్లు ఖర్చు చేయగా, 2019-20 లో జగన్ ప్రభుత్వం రూ. 7,408 కోట్లకు తగ్గించింది వాస్తవం కాదా? చంద్రబాబు కన్నా ఎక్కువ బడ్జెట్ ఉన్న జగన్ వైద్య ఆరోగ్యశాఖకు ఎందుకు రూ. 1,493 కోట్లు తగ్గించారు? నిదులు తగ్గించి సేవలు పెంచామని ప్రకటనలు చేస్తే నమ్మడానికి ఆంధ్రులు అమాయకులు అనుకుంటున్నారా?
* కరోనా కిట్లలో జగన్ ప్రభుత్వం అవినీతికి పాల్పడుతూ అడ్డంగా దొరికి పోయింది వాస్తవం కాదా?
* ఉద్దానం, కనిగిరిలో కిడ్నీ బాధితులకు 7 డయాలసిస్ కేంద్రాలను చంద్రబాబు ప్రభుత్వం ఏర్పటు చేసింది వాస్తవం కాదా?
* జగన్ ప్రభుత్వం స్కామ్ ల కోసమే స్కీమ్ లు పెడుతున్నది అవినీతి కప్పిపెట్టుకోవడానికి అబద్ధాలతో, పరనిందలతో ఆడంబర ప్రచారం చేసుకుంటూ ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారు.
* పదమూడు నెలల్లోనే జగన్ ప్రభుత్వం ధరలు పెంచడం ద్వారా రూ. 50 వేల కోట్లు ప్రజలపై భారం వేసింది వాస్తవం కాదా? రూ.87 వేల కోట్లు అప్పులు చేసింది వాస్తవం కాదా? జగన్ ఇచ్చిన సంక్షేమం కన్నా పెంచిన ధరలు అధిక భారం కాదా?