గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శుక్రవారం, 14 ఆగస్టు 2020 (17:33 IST)

కోవిడ్ నియంత్రణలో స్వచ్ఛంద సంస్థల పాత్ర ఏంటో తెలుసా?

కోవిడ్-19 వ్యాప్తిని నిరోధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటోంది. ముఖ్యంగా వైద్య, ఆరోగ్యశాఖ, పోలీసు శాఖ మరియు అనేక ఇతర శాఖలు కలిసి పనిచేస్తున్నాయి.

అదే సమయంలో ఎన్జీవోలు, స్వచ్ఛంద సంస్థలు కోవిడ్-19 వైరస్ వ్యాప్తి నివారణ చర్యల్లో పాల్గొనవచ్చు. వారు కూడా తమకు ఉన్న నెట్వర్క్ తో ప్రజల్లో కోవిడ్ పై అవగాహన కల్పించడం ద్వారా వైరస్ వ్యాప్తిని నిరోధించవచ్చు. ఈ నేపథ్యంలో ఎన్జీవోలు, స్వచ్ఛంద సంస్థలు చేయవలసిన కార్యక్రమాలను కింద తెలియజేయడం అయినది. 
 
* కోవిడ్-19 వైరస్ పై ఖచ్చితమైన సమాచారాన్ని తెలుసుకోండి. ఇది ఇతరులకు తెలియజేయండి.
* వైరస్ నివారణకు చేతి శుభ్రత, వ్యక్తిగత పరిశుభ్రత, ఇంటికి పరిమితమై ఉండటం, సామాజిక దూరాన్ని పాటించడంలాంటి ప్రవర్తనలను ప్రజలకు ఆచరించమని చెప్పండి.
* కోవిడ్-19 అనుమానిత కేసు ద్వారా, లేదా నిర్ధారిత కేసుల ద్వారా వైరస్ వ్యాప్తి జరగకుండా ప్రభుత్వం చేపట్టే నియంత్రణ చర్యలకు సహకరించండి.
* ప్రజల్లో ఉన్న అపోహలను, భయాలను తొలగించే విధంగా వాస్తవిక సమాచారాన్ని అందుబాటులో ఉంచండి.
* ప్రభుత్వం చేపట్టిన నివారణ కార్యక్రమాలకు ప్రజల మద్దతును కూడగట్టండి.
* అనగారిన వర్గాల అవసరాలను తీర్చేందుకు ప్రభుత్వం చేపట్టే ఉపశమన చర్యలను అధికారులతో, ఇతర సంస్థలతో కలిసి వారికి చేరువయ్యేలా చూడండి. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు, పిల్లల అవసరాలు తీర్చేలా స్థానికంగా పని   చేయండి.
 
ఏం కమ్యూనికేట్ చేయాలి?
 
వాస్తవాలు తెలియజేయండి: 
* ప్రభుత్వం, యూనిసెఫ్, ప్రపంచ ఆరోగ్య సంస్థ, మరియు ఎన్.సి.డి.సి వారు అందించే వాస్తవ సమాచారాన్ని సరైన సమయానికి ప్రజలకు చేరవేయాలి. 
* ఎవరికైనా కోవిడ్-19 వైరస్ సోకినట్లు అనుమానం కలిగితే ఏం చేయాలో స్పష్టమైన సూచనలు ఇవ్వండి. 
* కోవిడ్ వైరస్ వ్యాప్తిని మరియు ఇన్ఫెక్షన్ ను నివారించడానికి ప్రభుత్వం అందిస్తున్న విశ్వసనీయమైన సమాచారాన్ని ప్రజలకు తెలియజేయాలి.
 
భయాలను తొలగించండి: 
ప్రజల కోసం ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను, చర్యలను వివరించండి. కోవిడ్-19 వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి ప్రభుత్వం తీసుకుంటున్న నివారణ చర్యలను ప్రజలకు స్పష్టంగా తెలియజేయండి.
 
కోవిడ్-19 నివారణలో ఎన్జీవోలు, స్వచ్ఛంద సంస్థల పాత్ర మరియు బాధ్యతలు
 
ప్రజలు తీసు కోవాల్సిన సురక్షితమైన చర్యలపై అవగాహన కల్పించండి: 
*పోస్టర్లు, సామాజిక మాధ్యమాల్లో పోస్టులు, కరపత్రాలు, తరచుగా అడిగే ప్రశ్నలకు సమాధానాలు మొదలైనవి ఉపయోగించండి. వైరస్ ను నివారించడానికి ప్రజలు తీసుకోవలసిన చర్యలపై (పరిశుభ్రత, నివారణ) అవగాహన కలిగించాలి. 
*మాస్కులు ఎప్పుడు ధరించాలి, ఎప్పుడు పరీక్షలు చేయించుకోవాలి, ఎక్కడ పరీక్షలు చేయించుకోవాలి, ఏదైనా సహాయం లేదా సమాచారం అవసరమైతే ఎవరికి ఫోన్ చేయాలి తదితర విషయాలన్నీ ప్రజలకు తెలిసేలా చేయాలి.
 
సమాజంపై దీని ప్రభావాన్ని వివరించండి: 
వైరస్ వ్యాప్తి చెందితే సేవలు, రవాణా, పంపిణీ వ్యవస్థ, వివిధ వ్యాపారాలు మొదలైన వాటిపై ఎలాంటి ప్రభావం ఉండవచ్చో వివరించండి. దీన్ని బట్టి ప్రజలు తమ అవసరాలను ప్లాన్ చేసుకుంటారు.
 
సామాజిక దూరం యొక్క ఆవశ్యకత గురించి తెలియజేయండి: 
వైరస్ వ్యాప్తిని నిరోధించగలిగే వ్యూహాల్లో అత్యంత ముఖ్యమైనది సామాజిక దూరాన్ని పాటించడం. వ్యక్తులు ఒకరినొకరు కలవకుండా ఆపడం. సామాజిక దూరం మరియు చేతులు శుభ్రంగా కడుక్కోవడం గురించి అవగాహన కల్పించాలి.
 
ఎలా కమ్యూనికేట్ చేయాలి?
 
సామాజిక మాధ్యమాలను ఉపయోగించడం
*ఎక్కడైనా తప్పుడు సమాచారం, వార్తలు కనిపిస్తే అక్కడికక్కడే వాటిని ఖండించడం.
*అధికారికమైన, నమ్మకమైన సమాచారాన్ని మాత్రమే షేర్ చేయాలి (ప్రభుత్వ వెబ్ సైట్లు, ప్రపంచ ఆరోగ్య సంస్థ, యూనిసెఫ్ మొదలైన వారి సమాచారం).
*మీ వద్ద ఉన్న సమాచారం మొత్తాన్ని ఒకేసారి షేర్ చేయవద్దు. అవసరాన్ని బట్టి మరియు మీరు పంపించే వ్యక్తులకు సంబంధించిన సమాచారాన్ని మాత్రమే షేర్ చేయండి.
 
పట్టణాల నుండి వచ్చినవారి సంరక్షణ మరియు జాగ్రత్తలు 
కరోనా వైరస్ వ్యాపిస్తున్న నేపథ్యంలో పట్టణాలకు వలస వెళ్ళిన వారు తిరిగి గ్రామాలలో వారి ఇళ్లకు వస్తున్నారు. అలాంటి వారెవరైనా మీ కాలనీలో లేదా గ్రామంలోకి వస్తే వారిని కనీసం 14 రోజులు ఇంటికే పరిమితం అవ్వమని చెప్పాలి. వారికి ఇంట్లో (home quarantine) ఎలా వేరుగా ఉండాలి? తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సూచనలు చెప్పాలి. ఏమైనా సహాయం అవసరమైతే వాటిని అందించే ఏర్పాట్లు చేయాలి.
 
ఐ.ఇ.సి (ఇన్ఫర్మేషన్. కమ్యునికేషన్. ఎడ్యుకేషన్) సామగ్రిని ఉపయోగించండి
* ప్రజలు ఎక్కువగా తిరిగే ప్రదేశాల్లో పోస్టర్లు అతికించండి (పంచాయతీ కార్యాలయం, బస్స్టాప్, పాలు అమ్మే దుకాణాలు మొదలైనవి) 
* కంటికి కనిపించే ఎత్తులో పోస్టర్లను అతికించాలి (పోస్టర్ పైభాగం ఐదు అడుగుల ఎత్తులో ఉండాలి). దీనివల్ల ప్రజలు సులభంగా చదవగలుగుతారు.
 
కరపత్రాలు పంపిణీ చేయండి
* తరచుగా అడిగే ప్రశ్నలకు సమాధానాలు, కోవిడ్-19 వైరస్ కు సంబంధించిన సమాచారంతో కూడిన కరపత్రాలను వీలైనంత త్వరగా ప్రజలకు చేరవేయాలి.
* మీ చేతులు శుభ్రంగా కడుక్కున్న తర్వాతే కరపత్రాలు పంపిణీ చేయాలి. 
* పంచాయతీ కార్యాలయాలు, పాఠశాలలు, ఆసుపత్రులు వంటి ప్రదేశాల్లో కొన్ని కరపత్రాలను ఉంచండి. వాటిని ప్రజలు ఇంటికి తీసుకువెళ్లి చదువుకోవచ్చు.
 
కాన్ఫరెన్స్ కాల్స్ నిర్వహించడం
* ఏదైనా ముఖ్యమైన సమాచారాన్ని తెలియజేయాలని అనుకుంటే వాట్సాప్ గ్రూపును తయారు చేయండి, లేదా కాన్ఫరెన్స్ కాల్ చేయండి. దీనివల్ల సమాచారం వేగంగా ఎక్కువమందికి చేరుతుంది.
* హైరిస్క్ కలిగిన వ్యక్తులకు పంపిన సమాచారం గురించి ఆ తర్వాత ఫాలోఅప్ చేస్తూ ఉండాలి. నమ్మకమైన సమాచారాన్ని మాత్రమే తీసుకోవాలని వారికి చెబుతూ ఉండాలి. 
 
మరింత సమాచారాన్ని కింది సంస్థల నుంచి పొందవచ్చు:
భారత ప్రభుత్వం (mygov.in) 
యూనిసెఫ్ (www.unicef.org/coronavirus)
ప్రపంచ ఆరోగ్య సంస్థ (www.who.int)