శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 10 ఆగస్టు 2019 (08:05 IST)

భోగాపురం ఎయిర్ పోర్టు నిర్మాణం డౌటే

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడి ప్రభుత్వ హయాంలో తలపెట్టిన భోగాపురం విమానాశ్రయ నిర్మాణానికి కాలం చెల్లినట్లే కనిపిస్తోంది. ఈ విమానాశ్రయం నిర్మాణంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వం తిరిగి సమీక్ష చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయానికి కేవలం 45 కిలోమీటర్ల దూరంలో ఈ విమానాశ్రయ నిర్మాణాన్ని తలపెట్టారు. 
 
భోగాపురం విమానాశ్రయం నిర్మాణం ప్రాజెక్టుపై 2015లో నిర్ణయం తీసుకున్నారు. దాని రన్ వే 3800 కిలోమీటర్లు ఉంటుంది. దీనికి 2017లో పర్యావరణ అనుమతులు లభించాయి. ఈ ప్రాజెక్టుకు కావాల్సిన భూమి 2700 ఎకరాలు. విశాఖ విమానాశ్రయానికి అతి సమీపంలో తలపెట్టినందున భోగాపురం విమానాశ్రయ నిర్మాణంపై కేంద్రం పునరాలోచనలో పడినట్లు చెబుతున్నారు.

ఇంత సమీపంలో రెండు అంతర్జాతీయ విమానాశ్రయాలు అవసరమా అనే ప్రశ్న వేసుకుని కేంద్రం పునరాలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. భోగాపురం గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టుల నిర్మాణానికి ఈ ఏడాది ఫిబ్రవరిలో మూడు సంస్థలు ముందుకు వచ్చాయి. జీఎమ్మార్, జీవీకె, ఎస్ బ్యాంక్ ఈ ప్రాజెక్టును చేపట్టడానికి ఆసక్తి ప్రదర్శించాయి.

ఈలోగా రాష్ట్రంలో ఎన్నికలు వచ్చాయి. చంద్రబాబు ప్రభుత్వం గద్దె దిగి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి చెందిన వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధికారంలోకి వచ్చింది. ప్రభుత్వం మారడంతో భోగాపురం విమానాశ్రయానికి సంబంధించిన పైల్ ముందుకు కదల్లేదు. 
 
గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టు పేరు మీద కేంద్రం ప్రభుత్వం నుంచి చంద్రబాబు ప్రభుత్వం పర్యావరణ అనుమతులు పొందింది. దానికి 2700 ఎకరాల భూమిని సేకరించేందుకు కూడా సిద్ధపడింది. అయితే, భూసేకరణకు స్థానిక ప్రజల నుంచి వ్యతిరేకత ఎదురైంది. భోగాపురం విమానాశ్రయం నిర్మిస్తున్నారనే వార్తలు రావడంతో విశాఖ విమానాశ్రయంలో నేవీ పలు ఆంక్షలు విధించింది. పలు విమానాలు రద్దయ్యాయి. 
 
జీఎమ్మార్, జీవీకె, ఎస్ బ్యాంకులతో పాటు మరో నాలుగు సంస్థలు కూడా తొలుత టెండర్లు దాఖలు చేసి, ఆ తర్వాత వెనక్కి తగ్గాయి. మూడు సంస్థల బిడ్లను ప్రభుత్వం పరిశీలించింది. చివరకు జీఎమ్మార్ బిడ్ కు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. లాభార్జన ఆశించకుండా జీఎమ్మార్ అధిపతి గ్రంథి మల్లికార్జున రావు బిడ్ వేశారని చెబుతున్నారు. 
 
మల్లికార్డున్ రావు స్వగ్రామం రాజాంకు కూతవేటు దూరంలోనే భోగాపురం ఉంది. దీంతో ఆయన భోగాపురం విమానాశ్రయాన్ని లాభాలు ఆశించకుండా నిర్మించాలని అనుకున్నట్లు చెబుతారు. అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఫిబ్రవరిలో శంకుస్థాపన కూడా చేశారు. అయితే, ప్రస్తుత స్థితిలో భోగాపురం విమానాశ్రయం నిర్మాణంపై నీలినీడలు అలుముకున్నాయి.