ఆదివారం, 26 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 13 అక్టోబరు 2020 (08:28 IST)

టిక్కెట్లు ఉన్నవారికి మాత్రమే దుర్గ‌మ్మ దర్శనం.. భవాని భక్తుల‌కు సైతం ఆన్‌లైన్ టిక్కెట్లు త‌ప్పనిసరి

ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలను ఈ నెల 17 నుండి 25 వరకు కరోనా నేపథ్యంలో అత్యంత జాగ్రత్తలతో భక్తులకు అసౌకర్యం లేకుండా నిర్వహించేందుకు అన్ని శాఖల సమన్వయంతో కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్న‌ట్లు కృష్ణా జిల్లా కలెక్టర్‌ ఏ.యండి.ఇంతియాజ్ తెలిపారు.

కలెక్టరు ఇంతియాజ్ మాట్లాడుతూ.. ఆన్ లైన్ ద్వారా అందుబాటులో ఉంచిన రూ.300, రూ.100, ఉచిత దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులు మాత్రమే దర్శనానికి అనుమతించడం జరుగుతుందన్నారు. భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా ద‌స‌రా నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరపాలని నిర్ణయించామని, అందుకు అనుగుణంగానే ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న అమ్మవారి దర్శనానికి ఆన్‌లైన్ టిక్కెట్లను అందుబాటులో ఉంచామని తెలిపారు.

దసరా ఉత్సవాల సాధారణ రోజుల్లో ప్రతిరోజూ 10 వేల టిక్కెట్లు, మూలా నక్షత్రం రోజున 13 వేల టిక్కెట్లు అందుబాటులో ఉంచామన్నారు. ప్రతి గంటకూ 1000 మంది భక్తులకు అమ్మవారి దర్శనం చేసుకునేలా ఏర్పాట్లు చేశామన్నారు. కరోనా నేపథ్యంలో కోవిడ్-19 నిబంధనలను అనుసరిస్తూ దర్శన, ఇతర ఏర్పాట్లు చేసామని, భవాని భక్తులు కూడా తప్పనిసరిగా ఆన్‌లైన్ టిక్కెట్లు పొంది ఉండాలని కలెక్టరు సూచించారు.

కరోనా నేపథ్యంలో క్యూలైన్లలో శానిటైజర్లు కూడా అందుబాటులో ఉంచుతున్నామన్నారు. 10ఏళ్ల లోపు పిల్లలకు, 65 సంవత్సరాలు పైబడిన వృద్ధులకు, దివ్యాంగులకు దసరా ఉత్సవాలలో ఇంద్రకీలాద్రిపైకి అనుమతించడం లేదని, భక్తులు సహకరించాలన్నారు. 
 
తలనీలాలు సమర్పించడంపై నిషేధం: దేవ‌స్థానం ఛైర్మ‌న్ పైలా స్వామినాయుడు
పైలా స్వామినాయుడు మాట్లాడుతూ అన్ని శాఖల సమన్వయంతో రాష్ట్ర వేడుకలైన దసరా ఉత్సవాలను జయప్రదం చేసే దిశలో చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇప్పటికే ఆన్‌లైన్ ద్వారా లక్ష టిక్కెట్లను అందుబాటులో ఉంచామన్నారు. వాటిలో సుమారు 67 వేల టిక్కెట్లు భక్తులు తీసుకోవడం జరిగిందన్నారు.

ఇంకా సుమారు 26 వేల టిక్కెట్లు అందుబాటులో ఉన్నాయని, దసరా సమయంలో రద్దీని దృష్టిలో పెట్టుకుని వీలైతే ఆన్‌లైన్ టిక్కెట్లను ముందు రోజు విడుదల చేసేందుకు చర్యలు తీసుకుంటున్న‌ట్లు పేర్కొన్నారు. ఆన్‌లైన్ టిక్కెట్లు లేని భక్తులెవరూ దయచేసి రావద్దని, వచ్చి ఇబ్బంది పడవద్దని విజ్ఞప్తి చేశారు. భక్తుల మనోభావాలు దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక పూజలు, నవరాత్రుల నిర్వాహణలో ఎటువంటి లోటుపాట్లకు తావు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.

కోవిడ్ నేపథ్యంలో అన్ని జిల్లాలకు చెందిన భవానీ దీక్ష గురువులతో మాట్లాడడం జరిగిందని, వారికి తగిన సూచనలను చేశామన్నారు. 
 
అంతరాలయ దర్శనం నిలుపుదల: దుర్గ‌గుడి ఈవో ఎం.వి.‌సురేష్‌బాబు
ఉదయం 5 నుండి రాత్రి 8 గంటల వరకే భక్తులను అమ్మ‌వారి దర్శనానికి అనుమతిస్తున్న దృష్ట్యా మీడియాకు సంబంధించి పరిమిత సంఖ్యలో మాత్ర‌మే రెండు షిప్టులుగా కవరేజీకి ఏర్పాట్లు చేసుకోవాలని సమాచార శాఖ అధికారులకు సూచించారు.

ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 17న  ఉదయం 9 నుండి రాత్రి 8 గంటల వరకు భక్తులను అనుమతించడం జరుగుతుందని, దసరా రోజుల్లో ఉదయం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు దర్శనానికి అనుమతిస్తున్నామని, 21న మూలా నక్షత్రం రోజున సరస్వతీ దేవి అలంకారంలో ఉన్న అమ్మవారి దర్శనం ఉదయం 3 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు దర్శనానికి ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.

విజయవాడ మున్సిపల్ కార్పోరేషన్ ఆధ్వర్యంలో చెప్పుల స్టాండు, క్లోక్ రూమ్ రథం సెంటర్ వద్ద ఏర్పాటు చేస్తున్న‌ట్లు తెలిపారు. వినాయకుని గుడి నుండి దర్శనానికి భక్తులను అనుమతించడం జరుగుతుందని, అక్కడ మూడు లైన్లతో ప్రారంభమై కొండ‌పైన ఓంకారం టర్నింగ్ వద్ద 5 లైన్లుగా క్యూలైన్లను నిర్వహిస్తామన్నారు. క్యూలైన్లను నిరంతరం శానిటైజేషన్ చేయడం జరుగుతుందన్నారు.

క్యూ లైన్‌కు వచ్చే భక్తుల టెంపరేచర్‌ను పరీక్షించడం జరుగుతుందని తెలిపారు. సాధ్యమైనంతవరకూ భక్తులు త్రాగునీరు వారి వెంట తెచ్చుకోవాలని, కరోనా నేపథ్యంలో స్వీయనియంత్రణ చాలా ముఖ్యమన్నారు. ఆన్‌లైన్ టిక్కెట్లను ఇప్పటివరకూ సుమారు 70 శాతం మేర భక్తులు బుక్ చేసుకోవడం జరిగిందన్నారు. కేవలం ఆన్‌లైన్ టిక్కెట్లు పొంది ప్రింటింగ్ తీసుకువచ్చిన వారిని మాత్రమే దర్శనానికి అనుమతిస్తామని, ఈ విషయంలో భక్తులు సహక‌రించాల‌న్నారు.

ప్రత్యేక పూజలను ఆన్‌లైన్ ద్వారా నిర్వహించడం జరుగుతుందని, వాటికి సంబంధించిన అమ్మవారి ప్రసాదాన్ని, వస్త్రాలను పోస్టు ద్వారా పంపించడం జరుగుతుందన్నారు. 
 
ఆన్‌లైన్ ద్వారా టిక్కెట్లు బుక్ చేసుకున్న భక్తులు పాటించాల్సిన నియమాలు... 
* దర్శనానికి విచ్చేసే భక్తులు తప్పనిసరిగా మాస్క్ ధరించడం, చేతికి గౌజులు ధరించడం, సామాజిక దూరం పాటించడం శానిటైజర్ వినియోగించుట మరియు ఆలయ ప్రాంగణ ప్రవేశము నందు ధర్మల్ టెంపరేచర్ స్క్రీనింగ్ చేయించు కోవాలి. 
* భక్తులు వాటర్ బాటిల్ వెంట తెచ్చుకోవాలి
* 10ఏళ్ల లోపు మరియు 65 ఏళ్లు పైబడిన భక్తులు, వికలాంగులు, జలుబు, దగ్గు, జ్వరం మరియు అనారోగ్యం కలిగినవారిని, గర్భిణీ స్త్రీలను ఆలయానికి అనుమతించబడరు. 
* టిక్కెట్టు ప్రింటు తీసుకుని కేటాయించిన సమయం కంటే 15 నిమిషాలు ముందుగా ఐడి ప్రూఫ్‌తో సంబంధిత క్యూ లైన్ల వద్ద రిపోర్టు చేయాలి. 
* ఆలయ బస్సు, లిఫ్టు సౌకర్యం మరియు ఘాట్ రోడ్ దారి నిలుపుదల చేయడమైనది. 
* భక్తులు వారి సామాన్లుకు వారే బాధ్యత వహించవలెను.