1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 11 ఆగస్టు 2021 (11:42 IST)

సింహాచలం ఆలయంలో అపశృతి : కూలిన ధ్వజస్తంభం

విశాఖపట్నం జిల్లాలోని సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి దేవస్థానంలో అపశృతి జరిగింది. ఇక్కడి ఉపాలయం శ్రీ సీతారామస్వామి సన్నిధిలోని ధ్వజస్తంభం కూలిపోయింది. బుధవారం తెల్లవారుజామున అకస్మాత్తుగా ఆలయంలోని ధ్వజస్తంభం కూలడంతో అధికారులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. 
 
ఆ తర్వాత తేరుకున్న అధికారులు ఆలయంలోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు. ధ్వజస్తంభం కూలిపోవడానికి గల కారణాలను ఆరా తీశారు. ఎవరి ప్రమేయం లేదని నిర్ధాంచుకున్న అనంతరం అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. 
 
ఈ పురాతనమైన ఈ ధ్వజస్తంభం లోపలి భాగంలోని ధ్వజస్తంభం కర్ర పుచ్చిపోవడంతో అకస్మాత్తుగా కూలిపోయినట్లు అధికారులు గుర్తించారు. ఈ సంఘటన ఉదయం 6.30గంటల సమయంలో జరిగినట్లు.. సీసీ టీవీ పుటేజీ పరిశీలన అనంతరం అధికారులు తెలిపారు.
 
కాగా, 10 రోజుల్లో శాశ్వతంగా కొత్త ధ్వజస్తంభాన్ని ఏర్పాటు చేస్తామని సింహాచల దేవస్థానం ఈవో సూర్యకళ మీడియాకు వివరించారు. 60 ఏళ్లకు చెందిన ధ్వజస్తంభమని.. లోపలి భాగంలోని కర్రకు చెదలు పట్టడంతో కూలిపోయినట్లు వివరించారు.