బుధవారం, 27 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 16 మార్చి 2020 (08:51 IST)

నేడు గవర్నర్‌తో ఎన్నికల కమిషనర్‌ భేటీ

రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ రమేష్‌కుమార్‌ నేడు గవర్నర్‌ బిశ్వభూషణ్‌తో భేటీ కానున్నారు. విజయవాడలోని రాజ్‌భవన్‌లో గవర్నర్‌తో ఈసీ సమావేశం కానున్నారు. ఎన్నికల వాయిదా అంశాన్ని రమేష్‌కుమార్‌ గవర్నర్‌కు వివరించనున్నారు. ఎన్నికల కమిషనర్‌పై సీఎం జగన్‌ ఇప్పటికే గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. జగన్‌ లేవనెత్తిన అభ్యంతరాలపై గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ ఎస్‌ఈసీతో చర్చించనున్నారు.

ఎస్‌ఈసీ రమేష్‌కుమార్‌ ఇప్పటికే సిబ్బందితో సమావేశమయ్యారు. గవర్నర్‌కు ఇచ్చే నివేదికపై అధికారులతో చర్చించారు. ఎన్నికల కమిషనర్‌పై ఇప్పటికే గవర్నర్‌కు జగన్‌ ఫిర్యాదు చేశారు. కరోనా ఎఫెక్ట్ స్థానిక సంస్థల ఎన్నికలపై పడింది. కరోనా నివారణపై ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలను వాయిదా వేసింది.

6 వారాల పాటు ఈ ప్రక్రియను నిలిపివేస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేశ్ కుమార్ ప్రకటించిన విషయం తెలిసిందే. 6 వారాల తర్వాత పరిస్థితిని సమీక్షించి షెడ్యూల్‌ను విడుదల చేస్తామన్నారు. ఇప్పటి వరకూ ఏకగ్రీవమైన స్థానాల్లో ఎన్నికలు ఉండవని ఆయన తెలిపారు. వలంటీర్లపై ఆరోణలు వస్తున్న నేపథ్యంలో కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని రమేశ్ కుమార్ ఆదేశించారు.

అయితే కమిషనర్ నిర్ణయంపై జగన్ తీవ్రంగా స్పందించారు. స్థానిక ఎన్నికలు వాయిదాపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన ఆయన.. ఎస్‌ఈసీ రమేశ్ కుమార్‌ తాము నియమించిన వ్యక్తి కాదని.. చంద్రబాబు హయాంలోనే నియమించారన్నారు. తన సామాజిక వర్గానికి చెందిన వారిని నియమించారన్నారు. ఈసీ వ్యాఖ్యలు బాధాకరమని జగన్ వ్యాఖ్యానించారు.