బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Updated :విజయవాడ , శుక్రవారం, 20 ఆగస్టు 2021 (11:51 IST)

విద్యుదాఘాతంతో ఏనుగు మృతి... విద్యుత్ శాఖ నిర్ల‌క్ష్యం

విద్యుత్ అధికారుల నిర్ల‌క్ష్యం వ‌ల్ల ఒక చిన్న ఏనుగు మృతి చెందింది. చిత్తూరు జిల్లా సోమల మండలంలోని అన్నెమ్మ గారి పల్లె పంచాయతీలో ఈ సంఘ‌ట‌న జ‌రిగింది. బోనమంద సమీపంలోని రైతు పొలంలో విద్యుత్ తీగలు తగిలి 17 సంవత్సరాల వయసు కలిగిన మగ ఏనుగు మృతి చెందింది.

ఇటీవల రెండు నెలలుగా బోనమంద, పేటూరు, అన్నెమ్మ గారి పల్లి అటవీ ప్రాంతాలలో ఏనుగుల సంచారం జరుగుతూ రైతుల పంట పొలాలపై దాడులు చేస్తూ రైతులకు తీవ్ర నష్టం కలిగిస్తూ వస్తున్నాయి. అక‌స్మాత్తుగా విద్యుత్ షాక్ తో ఏనుగు మృతి చెందిన వార్త మండలంలో దావానలంలా వ్యాపించింది. అటవీ శాఖ అధికారులకు విషయం తెలియడంతో డి ఎఫ్ ఓ రవిశంకర్, రేంజ్ ఆఫీసర్ బాలకృష్ణ, పలమనేరు, చిత్తూరు ,సోమల, సదుం మండలాల నుంచి దాదాపు 30 మందికి పైగా అటవీశాఖ అధికారులు సంఘ‌ట‌న స్థ‌లానికి వ‌చ్చారు. ఏనుగు మృతి చెందిన ప్రదేశానికి చేరుకొని సంఘటన జరిగిన తీరును పరిశీలించారు.

తక్కువ ఎత్తులో విద్యుత్ తీగలు ఉండటం కారణంగా ఏనుగుకు విద్యుత్ తీగలు తగిలి మరణించినట్లు ధ్రువీకరించారు. మరణించిన ఏనుగుకు కంటి సమస్య ఉన్నట్లుగా తెలుస్తోంద‌ని అటవీ అధికారులు తెలిపారు. అదే సమయంలో అక్కడికి వచ్చిన మండల విద్యుత్ శాఖ అధికారులపై అటవీశాఖ అధికారులు మండిపడ్డారు. విద్యుత్ శాఖ సిబ్బంది కూడా తమ తప్పేమీ లేదంటూ సమాధానమిచ్చారు.

అయితే రైతు చాలా కాలం నుండి తక్కువ ఎత్తులో విద్యుత్ తీగలు ఉన్నాయని, వాటిని సరి చేయమని విద్యుత్ శాఖ సిబ్బందికి చెప్పినట్లు సమాచారం. ఇన్నిరోజులు రైతు పంట పొలాలపై ఏనుగు దాడి చేస్తూ తీవ్ర నష్టాన్ని కలిగిస్తున్నా ఏ రోజు అటవీ అధికారులు పట్టించుకోకపోగా, ఏనుగు మృతి చెందిందని సమాచారంతో పదుల సంఖ్యలో హాజరుకావడంపై అక్కడే ఉన్న ప్రజలు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

ఇదే అట‌వీ శాఖ అధికారులు ఏనుగుల బారి నుండి పంటలను, రైతులను కాపాడేందుకు ముందుగా స్పందించి ఉంటే ఈ సంఘటన జరిగి ఉండేది కాదని అనుకుంటున్నారు. సంఘటన జరిగిన ప్రాంతంలోనే తిరుపతి జంతుప్రదర్శన శాల వైద్యాధికారి తోయిబాషి పోస్టుమార్టం నిర్వహించారు.
ఇప్పటి వరకు జిల్లాలో మరణించిన ఏనుగుల లో అధిక శాతం విద్యుత్ షాక్ గురై మరణించినవేనని డిఎఫ్వో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎఫ్ఆర్వోలు బాలకృష్ణారెడ్డి, శ్రీనివాసులు, సుబాష్, తహశీల్దారు శ్యాంప్రసాద్ రెడ్డి, ఎస్ఐ లక్ష్మీకాంత్ పాల్గొన్నారు.