శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 4 ఆగస్టు 2021 (12:25 IST)

12 ఏళ్ల బాలికపై అఘాయిత్యం.. ఆపై చెట్టుకు ఉరేశారు..

మహిళలపై అఘాయిత్యాలు రోజు రోజుకీ పెచ్చరిల్లిపోతున్నాయి. తాజాగా మధ్యప్రదేశ్‌లో 12 ఏళ్ల బాలికపై లైంగిక దాడి జరిగింది. ఆమెపై అఘాయిత్యానికి పాల్పడిన దుండగులు.. అనంతరం చెట్టుకు ఉరేశారు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని విదిషా జిల్లాలో మంగళవారం చోటుచేసుకుంది.
 
వివరాల్లోకి వెళ్తే.. మంగళవారం ఉదయం 11 గంటల సమయంలో బాలిక తల్లి సమీప అడవిలోకి వెళ్లింది. తల్లిని అనుసరిస్తూ బాలిక కూడా వెళ్లింది. అయితే తల్లి ఇంటికి తిరిగి వచ్చేసరికి చిన్నారి కనిపించలేదు. దీంతో తమ బిడ్డ తప్పిపోయిందని గ్రామస్తులకు తల్లిదండ్రులు తెలిపారు. కొన్ని గంటల పాటు అడవిలో ఆ బిడ్డ కోసం గాలింపు చేశారు. చివరకు ఓ చెట్టుకు బాలిక వేలాడుతూ ఉండటాన్ని చూసి గ్రామస్తులు షాక్ అయ్యారు. ఆమె చేతులు కట్టేసి ఉంచారు.
 
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. మైనర్‌పై లైంగికదాడికి పాల్పడి ఉరేసినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ ఘటనకు సంబంధించి ఓ యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. బాలికపై సామూహిక అత్యాచారం జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు.