ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : బుధవారం, 17 జనవరి 2024 (19:57 IST)

జనసేనలోకి కొణతాల రామకృష్ణ? అనకాపల్లి నుంచి పోటి?

konakala ramakrishna
ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయి. దీంతో ఆ రాష్ట్ర రాజకీయాలు కూడా శరవేగంగా మారిపోతున్నాయి. ముఖ్యంగా, కీలక నేతలు తమ పట్టును నిలబెట్టుకునేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. ఇందులోభాగంగా, ఇతర పార్టీల్లో చేరేందుకు అమితాసక్తి చూపుతున్నారు. తాజాగా ఏపీ రాజకీయాల్లో ఉన్న సీనియర్ రాజకీయ నేతల్లో ఒకరైన మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ జనసేన పార్టీలో చేరేందుకు సిద్ధమైనట్టు తెలుస్తుంది. ఆయన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌తో బుధవారం భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. 
 
పవన్‌తో సమావేశమైన ఆయన పలు అంశాలపై చర్చించినట్టు సమాచారం. వైకాపా వ్యవస్థాపక సభ్యుల్లో కొణతాల రామకృష్ణ కూడా ఒకరు కావడం గమనార్హం. చాలాకాలంగా క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చిన ఆయన ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమాల్లో పాల్గొంటూ వచ్చారు. ఈ నేపథ్యంలో ఆయన బుధవారం హైదరాబాద్ నగరంలో పవన్ కళ్యాణ్‌ను కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. 
 
పవన్‌తో భేటీ సందర్భంగా కేవలం ఉత్తరాంధ్ర సమస్యలను మాత్రమే ప్రస్తావించినట్టు ఆయన చెప్పారు. కాగా, వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఆయన అనకాపల్లి లోక్‌సభ స్థానం నుంచి బరిలోకి దిగాలన్న తలంపులో కొణతాల రామకృష్ణ ఉన్నట్టు తెలుస్తుంది. పవన్‌తో జరిగే భేటీలోనూ ఇదే అంశంపై చర్చినట్టు సమాచారం. మరోవైపు, అన్నీ అనుకూలిస్తే, వచ్చే నెలలో ఆయన జనసేన పార్టీలో చేరే అవకాశం ఉంది.