జగన్‌కు షాక్... కాంగ్రెస్ పార్టీలో చేరనున్న వైఎస్.సునీత
ఏపీలోని అధికార వైకాపాకు షాకులపై షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే ఆ పార్టీకి చెందిన నేతలు అనేక మంది పార్టీని వీడిపోతున్నారు. తాజాగా తన సోదరి వైఎస్ షర్మిలను కాంగ్రెస్ హైకమాండ్ ఏపీ పీసీసీ చీఫ్‌గా నియమించింది. ఈ షాక్ నుంచి తేరుకోక ముందే, ఆ పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి దివంగత వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె వైఎస్ సునీతా రెడ్డి వైకాపాకు టాటా చెప్పి.. కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు. తన సోదరి పీసీసీ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆమె కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకునే అవకాశం ఉంది. ఆ తర్వాత వచ్చే ఎన్నికల్లో పులివెందుల లేదా కడప లోక్‌సభకు పోటీ చేసే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది.
కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆదేశిస్తే వచ్చే ఎన్నికల్లో పులివెందుల నుంచి శాసనసభ లేదా కడప లోక్‌సభకు పోటీ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. వైఎస్ వివేకా హత్యకు సంబంధించిన కోర్టు కేసుల్లో సునీత ఇంప్లీడ్ అయ్యారు. తన తండ్రిని చంపిన వారికి కఠిన శిక్షలు పడాలని ఆమె న్యాయపోరాటం చేస్తున్నారు. ఇపుడు ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టి సీఎం జగన్మోహన్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని ఆమె ముందుకు సాగనున్నారు.
వైకాపాపై వైఎస్ షర్మిళ ఎఫెక్ట్ : 5 నుంచి 7 శాతం ఓట్లు చీలిపోవచ్చు : ఆర్ఆర్ఆర్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల బాధ్యతలు చేపట్టడం వల్ల అధికార వైకాపాకు అపార నష్టం తప్పదని వైకాపా రెబెల్ ఎంపీ రఘురామకృష్ణం రాజు జోస్యం చెప్పారు. వైకాపా ఓట్లు 5 నుంచి 7 శాతం మేరకు చీలిపోతాయని తెలిపారు.
సంక్రాంతి సంబరాల కోసం ఆయన తన సొంత నియోజకవర్గానికి సుధీర్ఘకాలం తర్వాత ఆయన వచ్చారు. ఈ సందర్భంగా భీమవరం మండలం, రాయలం గ్రామంలో టీడీపీ, జనసేన పార్టీ నేతలతో ఆయన ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నాలుగేళ్ల తర్వాత సొంత నియోజకవర్గంలో పండుగ జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. పార్లమెంట్ సమావేశాలు తర్వాత తాను నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటానని చెప్పారు.
వైకాపా పాలన పట్ల రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారన్నారు. ఎన్నికలు ఎపుడు జరుగుతాయా అని ప్రజలు ఎదురు చూస్తున్నారని, వైకాపాను సాగనంపేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు.
వచ్చే ఎన్నికల్లో టీడీపీ - జనసేన కూటమి ఏకంగా 135 నుంచి 155 సీట్ల వరకు గెలుచుకునే అవకాశం ఉందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఏపీ శాఖ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల బాధ్యతలు చేపట్టడం వల్ల వైకాపాకు 5 నుంచి 7 శాతం మేరకు ఓట్లు చీలిపోతాయని చెప్పారు.