మంగళవారం, 2 డిశెంబరు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Modified: సోమవారం, 5 ఏప్రియల్ 2021 (15:34 IST)

వివాహేతర సంబంధం: నిలదీసినందుకు భర్తను బకెట్‌తో మోది చంపిన భార్య

తాళికట్టిన భర్తనే కడతేర్చింది ఓ భార్య.. కాళ్లు కడిగి కన్యాదానం చేసిన అత్తమామలే అతన్ని తిరిగిరాని లోకాలకు పంపించేశారు. పద్మనాభం మండలంలోని కృష్ణాపురం రెల్లికాలనీలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి సీఐ విశ్వేశ్వరరావు తెలిపిన వివరాలివి. రెల్లి కాలనీకి చెందిన పల్లా కనకరాజు(40)కు విజయనగరం జిల్లా గుర్ల మండలం దమరసింగికి చెందిన పైడమ్మతో 15 ఏళ్ల కిందట వివాహం జరిగింది.
 
కృష్ణాపురంలోని స్ప్రింగ్‌ ఫీల్డ్‌ పాఠశాల బస్సులో క్లీనర్‌గా పని చేస్తున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. భార్య పైడమ్మ వేరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకుందని కనకరాజు గతంలో ఆమెను నిలదీశాడు. ఈ నేపథ్యంలో భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. మూడు రోజుల కిందట వీరి మధ్య మళ్లీ గొడవ జరిగింది.
 
కనకరాజు మామ సోమాదులు సోములు, అత్త పాపయ్యమ్మ, బావమరిది కంచయ్య, బావమరిది భార్య లక్ష్మి ఈ నెల ఒకటో తేదీన మధ్యాహ్నం మూడు గంటల సమయంలో కనకరాజు ఇంటికి వచ్చారు. భార్యతో సహా వీరందరూ కనకరాజు తలపై బకెట్‌తో దారుణంగా కొట్టారు. ఎవరికి చెప్పకుండా అందరూ తిరిగి వెళ్లిపోయారు.
 
సాయంత్రం ఐదు గంటల సమయంలో అతని తల్లి లక్ష్మి ఇంటికి వచ్చి చూస్తే.. తల, పెదవుల మీద గాయాలతో కనకరాజు మంచం మీద పడి ఉండడం చూసి షాక్‌కు గురైంది. ఏం జరిగిందని అతన్ని అడగ్గా.. జరిగిన విషయం చెప్పారు. వెంటనే ఆమె విజయనగరం మహారాజా ఆస్పత్రిలో కనకరాజును చేర్పించింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అతను మృతి చెందాడు. తల్లి లక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అతని భార్యతో సహా ఐదుగురిపై కేసు నమోదు చేసినట్టు సీఐ తెలిపారు.