ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 30 జనవరి 2020 (13:50 IST)

సమత కేసులోని దోషులకు ఉరిశిక్షలు ఖరారు

తెలంగాణ రాష్ట్రంలోని అదిలాబాద్ జిల్లాలో జరిగిన సమత అత్యాచార, హత్య కేసులో దోషులుగా తేలిన వారికి ప్రత్యేక కోర్టు ఉరిశిక్షలను విధిస్తూ తీర్పునిచ్చారు. ఈ మేరకు గురువారం అదిలాబాద్ ప్రత్యేక కోర్టు తీర్పునిచ్చింది. ఫలితంగా ఈ కేసులో దోషులుగా తేలిన ఏ1 ముద్దాయి షేక్ బాబు (30), ఏ2 ముద్దాయి షేక్ షాబుద్దీన్ (40), ఏ3 ముద్దాయి షేక్ మగ్దుం (30)లకు ఉరిశిక్షలను విధించింది. 
 
తీర్పు వెల్లడించడానికి ముందు దోషులుగా తేలిన ముగ్గురిని పిలిపించి, నేరం రుజువైందని న్యాయమూర్తి తెలిపారు. మీరు ఏమైనా చెప్పుకునేది ఉందా? అని నిందితులను న్యాయమూర్తి అడిగారు. దీంతో ప్రధాన నిందితుడు షేక్‌ బాబు కంటతడి పెట్టాడు. 
 
కుటుంబాలకు తామే పెద్ద దిక్కని ముగ్గురు నిందితులు బోరున విలపించారు. తీర్పు నేపథ్యంలో ఆదిలాబాద్‌ జిల్లాలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కోర్టు వద్ద పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. కోర్టుకు సమత కుటుంబీకులు, గ్రామస్తులు చేరుకున్నారు. 
 
అదిలాబాద్ జిల్లాలో గత యేడాది నవంబరు నెల 24వ తేదీన లింగాపూర్‌ మండలం ఎల్లాపటార్‌ గ్రామ సమీపంలో సమతపై అఘాయిత్యానికి పాల్పడిన విషయం విదితమే. ఈ కేసు విచారణకు డిసెంబర్‌ 11న ఆదిలాబాద్‌లో ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేశారు. ఈ కేసులో డిసెంబర్‌ 14న ఛార్జిషీటును ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులో పోలీసులు దాఖలు చేశారు. డిసెంబర్‌ 31న కోర్టు విచారణ పూర్తి చేసింది. జనవరి 20న ప్రాసిక్యూషన్‌, డిఫెన్స్‌ లాయర్ల మధ్య వాదనలు ముగిశాయి. అయితే ఈ కేసు తీర్పు జనవరి 27న వెల్లడించాల్సి ఉండే. అయితే న్యాయమూర్తి అనారోగ్యం కారణంగా ఈ నెల 30కు వాయిదా వేసింది కోర్టు. 
 
కేసు పూర్వపరాలు... 
ముగ్గురు నిందితుల్లో చిన్నవాడైన షేక్‌బాబు(30) తొలుత బాధితురాలిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆమె రామ్‌నాయక్‌ తండా శివారులోని జాదవ్‌ జ్ఞానేశ్వర్‌ పొలం వద్దకు రాగానే రోడ్డు పక్కకు నెట్టేసి బలాత్కారానికి యత్నించాడు. ఆమె ప్రతిఘటించడంతో తర్వాత సమీపంలోని పొదల్లోకి లాక్కెళ్లి అత్యాచారం చేశాడు. ఇందుకు మిగిలిన ఇద్దరు నిందితులు సహకరించారు. 
 
బాధితురాలి కాళ్లు, చేతులు కదలకుండా పట్టుకున్నారు. తర్వాత మిగిలిన ఇద్దరూ అత్యాచారానికి ఒడిగట్టారు. అనంతరం బాధితురాలు తమ విషయం బయటికి చెబుతుందేమోనని అనుమానం వారిలో మొదలైంది. ఒక వేళ అదే జరిగితే క్రిమినల్‌ కేసు నమోదు అవుతుందని భావించిన ఆ ముగ్గురూ ఆమెను హతమార్చడమే సరైందనుకున్నారు. 
 
దీంతో షేక్‌ షాబొద్దిన్‌, షేక్‌ మఖ్దుం ఆమె చేతులు, కాళ్లను గట్టిగా పట్టుకోగా.. షేక్‌ బాబు తన వెంట తెచ్చుకున్న కత్తితో దాడి చేశాడు. ఆ తర్వాత గొంతు కోశాడు. తీవ్ర రక్తస్రావంతో సమత అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఆమె చనిపోయింది అని నిర్ధారించుకున్న ముగ్గురూ.. ఆమె వద్ద ఉన్న రూ.200 తీసుకుని పారిపోయారు. ఈ ఘటన జరిగిన మూడు రోజుల తర్వాత ముగ్గురు నిందితులను పోలీసులు ఆసిఫాబాద్‌లో అరెస్టు చేశారు. 
 
సమతను కత్తితో పొడిచిన సమయంలో ఆమె చేతి వేళ్లపై, మెడపై, ఇతర శరీర భాగాలపై కత్తి గాయాలయ్యాయి. నిందితులు వాడింది కోళ్లు కోసే కత్తి అని.. దీని పొడవు 29 సెంటిమీటర్లు అని పోలీసులు గుర్తించారు. నిందితుల క్రూరత్వం గురించి పోలీసులు సాక్ష్యాధారాలతో సహా ఆదిలాబాద్‌లోని ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులో మొత్తం 96 పేజీల నివేదికను సమర్పించారు. 
 
44 మంది సాక్షుల వాంగ్మూలాన్ని నమోదు చేయడంతో పాటు శాస్త్రీయ ఆధారాలతో కూడిన ఫోరెన్సిక్‌, డీఎన్‌ఏ నివేదికల్ని పొందుపరిచారు. 96 పేజీల నివేదికలో 13 పేజీలు ఛార్జిషీట్‌ కాగా, మిగతా పేజీల్లో సాక్షుల వాంగ్ములాలు, ఫొరెన్సిక్‌ నివేదికలు, పంచనామా వివరాలు ఉన్నాయి.