శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 14 డిశెంబరు 2019 (16:33 IST)

దిశ చట్టం ఓ బోగస్... 21 రోజుల్లో శిక్షించడం అసాధ్యం : అయేషా తండ్రి

అత్యాచారాలకు పాల్పడే వారికి కేవలం 21 రోజుల్లో శిక్షించేలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన దిశ చట్టంపై మృతురాలు ఆయేషా మీరా తండ్రి ఇక్బాల్ బాషా స్పందించారు. ఈ దిశ చట్టం ఓ బోగస్ అంటూ వ్యాఖ్యానించారు. ఇలాంటి అర్థంపర్థం లేని చట్టాలు వద్దనీ, ప్రజలకు ఉపయోగపడే చట్టాలు చేయాలని ఆయన సూచించారు. కేవలం రాజకీయ కోసం చట్టాలు చేయవద్దని ఆయన హితవు పలికారు. 
 
దిశ చట్టంపై ఆయన శనివారం మాట్లాడుతూ, రేప్ చేసినట్టు తేలిన నేరస్థులకు 21 రోజుల్లో శిక్షలు వేయడం సాధ్యం కాదన్నారు. సక్రమంగా దర్యాప్తు చేస్తే నిందితులను పట్టుకోవచ్చన్నారు. తన కుమార్తె అయేషా హత్య కేసులో సీబీఐ  విచారణను ఎప్పటికి పూర్తి చేస్తుందో తెలియదని పేర్కొన్నారు. తాము ఆరోపిస్తున్న నిందితులను విచారించారో లేదా అన్న విషయం తమకు బోధపడటంలేదన్నారు. అయేషా మీరా కేసులో గతంలో జరిగిన విచారణ అంతా బోగస్ అని చెప్పారు.
 
ఆయేషా మీరా అవశేషాలను సేకరించిన ఫోరెన్సిక్ బృందం 
మరోవైపు, గత 2007లో డిసెంబర్ 27న విజయవాడ శివారు ప్రాంతాల్లో తెనాలికి చెందిన విద్యార్థిని ఆయేషా మీరా దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ కేసులో నిందితుడు సత్యంబాబు నిర్దోషిగా బయటపడటంతో నేరస్థుడెవరో తేల్చేందుకు సీబీఐ నడుం బిగించింది. 12 యేళ్ళ క్రితం ఖననం చేసిన ఆయేషా మీరా మృతదేహాన్ని మరోసారి బయటకు తీసి రీపోస్ట్ మార్టమ్ చేయనున్నారు. 
 
ఈ నేపథ్యంలో శనివారం ఖననం చేసిన అయేషా మీరా ఎముకల నుంచి పోరెన్సిక్ బృందం అవశేషాలను సేకరించింది. సీబీఐ ఎస్పీ విమల్ ఆదిత్య అధ్వర్యంలోని రీ పోస్టుమార్టం నిర్వహించనున్నారు. సేకరించిన ఆధారాల మేరకు విచారణ జరపాలని అధికారులు యోచిస్తున్నారు.