మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By శ్రీ
Last Modified: సోమవారం, 2 డిశెంబరు 2019 (15:19 IST)

ఆడబిడ్డ అసువులు బాసిన ఘటనపై స్పందించడానికి కేసీఆర్ దొరగారికి 3 రోజులు పట్టింది: రాములమ్మ ఫైర్

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పైన విజయశాంతి ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ శివారులో జరిగిన వెటర్నరీ డాక్టర్ దారుణ హత్యోదంతం పై ఎట్టకేలకు కేసిఆర్ గారు  72 గంటలు గడిచాక పెదవి విప్పడం చాలా విడ్డూరంగా ఉంది.
 
 హుజూర్ నగర్ ఉపఎన్నిక ఫలితం వచ్చిన వెంటనే, హుటాహుటిన ప్రెస్ మీట్ పెట్టి తన సొంత డబ్బా కొట్టుకున్న సీఎం దొరగారు... మానవ మృగాల చేతిలో అమానుషంగా అత్యాచారానికి గురై... అమాయక ఆడబిడ్డ అసువులు బాసిన ఘటనపై స్పందించడానికి మూడు రోజులు తీసుకున్నారు. 
 
అది కూడా మహిళా సంఘాలు నిలదీసిన తర్వాత, జాతీయ మీడియా ఏకిపారేసిన తర్వాత, ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ద్వారా విచారణ పేరుతో మొక్కుబడిగా ఓ ప్రకటన చేసి దొరగారు చేతులు దులుపుకున్నారు. 
 
ఈ మాటేదో వరంగల్లో మానస హత్యాచారానికి గురైన వెంటనే గాని... వెటర్నరీ డాక్టర్‌ను సజీవ దహనం చేసిన ఘటన వెలుగులోకి వచ్చిన  రోజే చెప్పి ఉంటే... దానికి విలువ ఉండేది. ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ద్వారా నిందితులకు శిక్ష వేయిస్తాం అని చెప్తున్న కేసీఆర్ గారు... వెటర్నరీ డాక్టర్ కనిపించలేదని ఆమె కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్‌కి వెళితే బాధ్యతారహితంగా మాట్లాడిన పోలీసుల వైఖరి భవిష్యత్తులో పునరావృతం కాకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటారవి చెప్పలేదు.
 
ఇలాంటి దారుణ ఘటనలపై ఫిర్యాదు అందిన వెంటనే పరిధుల పేరుతో జాప్యం చేయకుండా పోలీసులకు ఎలాంటి ఆదేశాలు ఇస్తారని కెసిఆర్ గారు ప్రకటించలేదు. ఇలా అసలు విషయాల గురించి మాట్లాడకుండా కేవలం కంటితుడుపు చర్యగా ఓ ప్రకటన చేసి కేసీఆర్ గారు తప్పించుకున్నారు. 
 
ఈ ఒక్క విషయంలోనే కాదు... గతంలో ఆర్టీసీ సమ్మె విషయంలో కూడా కెసిఆర్ గారి తీరు విమర్శలకు తావిచ్చే విధంగా ఉంది. ఇప్పుడు ఆర్టీసీని అన్ని విధాల ఆదుకుంటామని చెప్పే సీఎం దొరగారు... ఈ ప్రకటన ఏదో హైకోర్టు తీర్పు వచ్చిన వెంటనే చేసి ఉంటే బాగుండేది. 
 
కానీ  కార్మికులు సమ్మె విరమించినంత మాత్రాన విధుల్లోకి తీసుకోబోమని లేబర్ కోర్టు తీర్పు వచ్చే వరకు కార్మికులు వేచి ఉండాల్సిందేనని ఆర్టిసి ఎమ్‌డి ఎందుకు ప్రకటన చేయాల్సి వచ్చింది? అసలు కేసీఆర్ గారు ఆర్టీసీని కాపాడాలనే నిర్ణయం తీసుకునేందుకు రెండు నెలల సమయం ఎందుకు పట్టింది?
 
ప్రగతి భవన్లో పెంచుకున్న పెంపుడు కుక్కకు ఇచ్చిన విలువ కూడా తెలంగాణ ప్రజానీకానికి లేదని కెసిఆర్ గారిపై విమర్శలు ఉన్నాయి. కానీ సీఎం దొరగారి వాలకం చూస్తుంటే నవ్విపోదురుగాక నాకేమి సిగ్గు అన్న చందంగా ఉంది. ఈ దొరతనానికి చరమగీతం పాడే రోజు దగ్గర్లోనే ఉంది అంటూ విజయశాంతి విమర్శించారు.