సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 2 డిశెంబరు 2019 (10:00 IST)

నేను బక్కోడినే కాదు ... మొండోడిని కూడా : సీఎం కేసీఆర్

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ రాష్ట్ర ఆర్టీసీ కార్మికులతో సమావేశమయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 95 డిపోల్లో ఒక్కో డిపో నుంచి ఐదుగురిని చొప్పిన హైదరాబాద్‌లోని తన నివాసానికి పిలిపించి, వారికి విందు భోజనం పెట్టించారు. ఆ తర్వాత వారి సమస్యలపై సుధీర్ఘంగా మాట్లాడారు. ఈ సందర్భంగా కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. నేను బక్కోడినే కాదు.. కాస్త మొండోడిని అంటూ చలోక్తి విసిరారు. 
 
ప్రభుత్వ పాలన సాగించడం అంటే అంత సులభం కాదన్నారు. అన్ని విభాగాలను సమన్వయం చేసుకుంటూ వెళ్లాల్సి ఉంటుందన్నారు. ఓ ఇంట్లోనూ, బక్కగా ఉన్నవాడు, లావుగా ఉన్నవాడు, పాసైనోడు, ఫెయిలైనోడు ఇలా రకరకాలుగా ఉంటారని, మరి ప్రభుత్వం కూడా అలాంటిదేనని అన్నారు. అందరినీ పైకి తీసుకురావాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుందన్నారు. 
 
సాధారణంగా తనకు మొండితనం ఎక్కువని, అసలీ సమ్మె వ్యవహారం ఎందుకు ఓ కొలిక్కిరాదని పట్టుదలగా తీసుకుని కార్మికులను పిలిచానని వెల్లడించారు. మీ సంగతేంటని అధికారులను అడిగితే, ఒక్క అవకాశం ఇవ్వండి సార్, వంద శాతం మీ పేరు నిలబెడతామని చెప్పారని తెలిపారు. ఎట్టిపరిస్థితుల్లోనూ సంక్షోభం జరగనివ్వబోమని వారు హామీ ఇచ్చారని, తాను కూడా ఏమీ జరగదని గట్టినమ్మకంతోనే ఉన్నానని కేసీఆర్ వెల్లడించారు. 
 
ఇపుడు, నేను పిలవడం, మీరు రావడం, ఇప్పుడీ సమావేశం అంతా సాఫీగా జరిగిపోయింది. సీఎం వద్దకు వెళ్లి ఏంతెచ్చారని మీ వాళ్లు అడిగితే సమ్మెకాలానికి పూర్తి జీతం తెచ్చామని చెప్పండంటూ కార్మికులపై వరాల జల్లు కురిపించారు. సమ్మె ఎన్నిరోజులు జరిగిందో అన్ని రోజులకు పూర్తి జీతం చెల్లిస్తామన్నారు. 
 
అదీకూడా మొత్తం ఒకే దఫాలో ఇస్తామన్నారు. యూనియన్లు, ఇతర రాజకీయాల జోలికి వెళ్లకుండా కష్టపడి పనిచేస్తే సింగరేణి తరహాలో బోనస్‌లు ఇస్తామని కేసీఆర్ వెల్లడించారు. అలాగే, కార్మికుల సమస్యలు పరిష్కరించేందుకు కేసీఆర్ హామీ ఇచ్చారు.