గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఐవీఆర్
Last Modified: శుక్రవారం, 22 నవంబరు 2019 (15:16 IST)

టీఎస్ ఆర్టీసీ సమ్మె కొనసాగింపు, డిపోలకు వెళ్లినా బస్సు తాళాలివ్వని అధికారులు

కేసీఆరా మజాకా... తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయానికి భిన్నంగా ప్రవర్తించిన ఆర్టీసీ కార్మికులకు ఆయన చుక్కలు చూపిస్తున్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్న ప్రతిపాదనను తోసిపుచ్చిన ముఖ్యమంత్రి కార్మికులంతా సమ్మెను విరమించి విధుల్లో చేరాలని గత నెల విజ్ఞప్తి చేశారు. కానీ ఆయన మాటను ఆర్టీసి కార్మికులు పట్టించుకోలేదు. సమ్మెను కొనసాగించారు. 
 
అలా 47 రోజులు గడిచిపోయాయి. దీనితో ఆర్టీసీ కార్మికుల కుటుంబాలు జీతాలు రాక అల్లాడిపోతున్నాయి. కొంతమంది ఇప్పటికే ఆత్మహత్యలు చేసుకున్నారు. అటు కేసీఆర్ పట్టు ఇటు యూనియన్ నాయకుల బెట్టు మధ్య ఆర్టీసి కార్మికులు నలిగిపోతున్నారు. వారికి దిక్కుతెలియని స్థితి ఏర్పడింది. 
 
ఈ క్రమంలో మొన్న తెలంగాణ ఆర్టీసీ సంఘాలు తమ సమ్మెను విరమిస్తున్నట్లు ప్రకటించాయి. కార్మికులను భేషరతుగా విధుల్లోకి తీసుకోవాలనీ, ఎలాంటి షరతులు విధించకూడదంటూ ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారు. అసలే పట్టు మీద వున్న ముఖ్యమంత్రి కేసీఆర్ వూరుకుంటారా? ఎంతమాత్రం స్పందించలేదు. పైగా ప్రస్తుతం ఆర్టీసీని నడపడం ప్రభుత్వానికి గుదిబండలా మారిందంటూ వ్యాఖ్యానించడంతో తెలంగాణ ఆర్టీసీ కార్మికులకు గుండెల్లో రాయి పడ్డట్లయింది. 
 
విధుల్లో చేరుతాము మహాప్రభో అని ఆర్టీసి డిపోలకు వెళ్లి పడిగాపులు కాసినా అధికారులు వారిని అనుమతించలేదు. దీనితో ఏం చేయాలో తెలియని అయోమయంలో పడిపోయారు. ఫలితంగా యూనియన్ నాయకుడు అశ్వత్థామ రెడ్డి, తాము సమ్మెను కొనసాగిస్తున్నట్లు ప్రకటించారు. ఈ నేపధ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం ఎలా వుండనుందన్నది ఆసక్తిగా మారింది.