ఆదివారం, 26 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 14 డిశెంబరు 2019 (09:45 IST)

నా బిడ్డను హత్య చేసింది ఎవరో ఆర్కే రోజాకు తెలుసు : అయేషా తల్లి

తన బిడ్డను హత్య చేసింది ఎవరో వైకాపా ఎమ్మెల్యే ఆర్కే రోజాకు బాగా తెలుసని ఆయేషా మీరా తల్లి శంషాద్ బేగం ఆరోపించారు. 2007లో దారుణ హత్యకు గురైన ఆయేషా మీరా మృతదేహానికి మరికాసేపట్లో మరోమారు రీపోస్టుమార్టం చేయనున్న విషయం తెల్సిందే. దీనికోసం ఇప్పటికే తెనాలిలోని చెంచుపేట శ్మశానవాటికకు సీబీఐ అధికారులు, పోలీసులు చేరుకున్నారు. 
 
ఈ సందర్భంగా ఆయేషా మీరా తల్లి శంషాద్ బేగం సంచలన వ్యాఖ్యలు చేశారు. తన కూతురిని చంపిందెవరో వైసీపీ ఎమ్మెల్యే రోజాకు తెలుసని అన్నారు. తన కూతురు హత్యకు గురైన తర్వాత రోజా ఎంతో హడావుడి చేశారని... నేరస్తులెవరో ఆమెకు తెలుసని అన్నారు. వారి గురించి అసెంబ్లీలో రోజా ఎందుకు మాట్లాడటం లేదని, ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు.
 
నాయకులకు, డబ్బున్న వారికే చట్టాలు చుట్టాలని శంషాద్ బేగం అన్నారు. మధ్యతరగతి, పేదలకు ఎప్పుడూ న్యాయం జరగదని చెప్పారు. నేరస్తుల గురించి గతంలో తాను ఒకసారి మాట్లాడితే కోటి రూపాయలకు పరువు నష్టం దావా వేస్తామని హెచ్చరించారని... తమ వద్ద కోటి పైసలు కూడా లేవని... ఎలాంటి దావా అయినా వేసుకోవచ్చని అన్నారు. విచారణలో నిజాలు వెలుగు చూస్తే... ఎవరు కోటి రూపాయలు చెల్లించాలో, ఎవరు శిక్ష అనుభవించాలో తెలుస్తుందని చెప్పారు.
 
న్యాయం కోసం 12 ఏళ్ల నుంచి పోరాడుతున్నానని శంషాద్ బేగం తెలిపారు. మన దేశంలో న్యాయం జరుగుతుందనే నమ్మకం పోయిందని చెప్పారు. 21 రోజుల్లో నిందితులపై చర్యలు తీసుకుంటామని చెబుతున్న ముఖ్యమంత్రి జగన్ ఈ కేసును కూడా పరిగణనలోకి తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. అలాగే, ఈ కేసులోని నిందితులకు సీబీఐ నార్కో టెస్టులు (నిజ నిర్ధారణ పరీక్షలు) చేయాలని ఆమె కోరారు.