మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 21 మే 2020 (22:04 IST)

ఉద్యోగ అవకాశాల్లో రాష్ట్ర యువతకే పెద్దపీట: మంత్రి మేకపాటి

ఉద్యోగ అవకాశాలలో రాష్ట్ర యువతకే పెద్దపీట వేసేలా ముందుకెళ్లాలని పరిశ్రమలు, ఐ.టీ, వాణిజ్య, జౌళి, నైపుణ్యాభివృద్ధి, శిక్షణ పెట్టుబడులు,మౌలికవసతులు శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి వెల్లడించారు.

రాష్ట్రానికి పెద్ద ఎత్తున్న పరిశ్రమలు రావాలన్నదే సిఎం లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు. పారిశ్రామిక, ఉపాధి రంగాలలో యువతను భాగస్వామ్యం చేయాలని మంత్రి ఆదేశించారు. కోవిడ్-19 పరిణామాల తర్వాత అన్ని రంగాలలో ముఖ్యంగా ఆలోచనల్లో మార్పు అనివార్యమని మంత్రి గౌతమ్ రెడ్డి పేర్కొన్నారు.

గురువారం సచివాలయంలోని నాల్గవ బ్లాక్ కాన్ఫరెన్స్ హాల్లో  పరిశ్రమలు,నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖల ఉన్నతాధికారులతో మంత్రి మేకపాటి వరుసగా సమీక్షా సమావేశం నిర్వహించారు. 
 
పరిశ్రమలు, పెట్టుబడులు, మౌలిక వసతులు, నైపుణ్యాభివృద్ధి శాఖలపై ఒకేసారి సమీక్ష నిర్వహించిన మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి...సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని పార్లమెంట్ నియోజకవర్గాలలో  25 నైపుణ్య శిక్షణా కళాశాల ఏర్పాటుకు సన్నద్ధం కావాలన్నారు. 7 జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. త్వరిత గతిన ఆయా జిల్లాలలో కళాశాలల ఏర్పాటుకుగల  స్థల సమస్యలను పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేశారు.

ప్రతీ చోట కనీసం 5 ఎకరాలకు తగ్గకుండా నైపుణ్య కళాశాలల నిర్మాణాల కోసం భూమిని సేకరించాలని సూచించారు. శుక్రవారం ముఖ్యమంత్రి చేతుల మీదుగా లాంఛనంగా ఇవ్వనున్న ఎమ్ఎస్ఎమ్ఈల ప్రోత్సాహకాల చెల్లింపులకు అవసరమయిన ఏర్పాట్లపై మంత్రి అడిగి తెలుసుకున్నారు.
 
ముఖ్యంగా పరిశ్రమలలో కార్మికుల అవసరం, ప్రస్తుత జాబితా వివరాలను సిద్ధం చేయాలని మంత్రి పేర్కొన్నారు. పరిశ్రమలు, సాంకేతిక, ఐటి, మౌలిక వసతుల శాఖల ఉన్నతాధికారులతోనూ మంత్రి సమీక్ష నిర్వహించారు.  ఈ నెల 28న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిర్వహించనున్న సమీక్షా సమావేశానికి సమాయత్తం కావాలని మంత్రి అధికారులను ఆదేశించారు. 
 
ముఖ్యంగా పరిశ్రమలు,నైపుణ్య,ఐ.టి రంగాల పురోగతిని తెలియజేసేలా ప్రజంటేషన్, కార్యక్రమాలు రూపొందించాలన్నారు. రాష్ట్ర యువతీ,యువకులకు అవకాశం కల్పించే విషయంపై సీఎం సమావేశ సమయానికి కసరత్తు పూర్తి కావాలని మంత్రి తెలిపారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను అనుసరిస్తూ  సిఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్రంలో చిన్న తరహా పరిశ్రమలకు ఊతమిచ్చేలా నడిపేందుకు అధికారులు కృషి చేయాలని సూచించారు.

ఈ మేరకు స్కిల్ డెవలప్ మెంట్,ఐటి శాఖ,సాంకేతిక విద్య శాఖలకు చెందిన అధికారుల నుంచి సూచనలు, సలహాలను స్వీకరించారు. ప్రధానంగా మూత పడ్డ పరిశ్రమలు,కోవిడ్- 19 కారణంగా సొంత ప్రాంతాలకు తరలి పోయిన వలస కూలీల వివరాలతో పాటుగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న నిరుద్యోగ యువతి,యువకులు వివరాలను సేకరించాలని ఆదేశించారు.

ఆయా శాఖల్లోని అప్లికేషన్లు  అన్నింటినీ కలిపి ఒకే ప్రామాణికంలో పూర్తి వివరాలు తెలిసేలా ఒకే రకం అప్లికేషన్ తయారు చెయ్యాలన్నారు. తద్వార నైపుణ్యకొరత గల నిరుద్యోగులను గుర్తించి వారికి శిక్షణ అందించడం, కనీస నైపుణ్యం ఉన్నవారిని ఎంపిక  చేసి తగిన ఉద్యోగాలు కల్పించడం వంటి అంశాలపై స్పష్టత వచ్చేలా చూడాలని మంత్రి గౌతమ్ రెడ్డి అధికారులను ఆదేశించారు.

పారిశ్రామిక రంగం త్వరలో కొత్త పుంతలు తొక్కడం ఖాయమని మంత్రి అన్నారు. పరిశ్రమలు, నైపుణ్యాభివృద్ధి, శిక్షణ, ఐ.టీ శాఖలన్నింటినీ ముఖ్యమంత్రి దూరదృష్టితో ఒక తాటిపైకి తీసుకువచ్చారని మంత్రి స్పష్టం చేశారు. ఎలాంటి నిర్ణయాల్లోనూ జాప్యం కూడదనే ఆయన వినూత్న ఆలోచనలకు శ్రీకారం చుట్టినట్లు మంత్రి వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో కోవిడ్ నేపథ్యంలో మూతపడిన పరిశ్రమలన్నీ తిరిగి ప్రారంభమయ్యాయని, అందుకు తగ్గ అన్ని ఏర్పాట్లపై ఎప్పటికప్పుడు వివరాలు కావాలని మంత్రి అధికారులకు తెలిపారు. 

రాష్ట్రంలోని 13 జిల్లాలలో పరిశ్రమల ఏర్పాటుకు ఆయా జిల్లా కలెక్టర్లు తీసుకున్న చర్యలను కూడా మంత్రి ప్రత్యేకంగా ఆరా తీశారు. స్కిల్, నిరుద్యోగు అంశాలపై ప్రస్తుత పరిస్థితిపైనా సంబంధిత శాఖలకు చెందిన అధికారులను అడిగి తెలుసుకున్నారు. సంత్సరకాలంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలో పరిశ్రమల శాఖలో ఎన్నో సంస్కరణలు, పారదర్శక విధానాలకు శ్రీకారం చుట్టామని మంత్రి గుర్తు చేశారు.

యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించే అంశంపైనా ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని మంత్రి పేర్కొన్నారు. సమావేశంలో పరిశ్రమలు, నైపుణ్యాభివృద్ధి, శిక్షణ, ఐ.టీ శాఖలకు చెందిన ఉన్నతాధికారులు నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ ప్రత్యేక కార్యదర్శి జి.అనంతరాము, ఐటి శాఖ ముఖ్య కార్యదర్శి కోనా శశిధర్, పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలెవన్, నైపుణ్యాభివృద్ధి సంస్థ ఉపాధి, శిక్షణా శాఖ డైరెక్టర్  లావణ్యవేణి,  రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఛైర్మన్ చల్లా మధుసూదనరెడ్డి, రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ హేమచంద్రారెడ్డి, ఎపిఎస్ఎస్ డిసి ఉన్నతాధికారులు, సిఈవో ఆర్జా శ్రీకాంత్,  సంబంధిత శాఖల ఇతర అధికారులు పాల్గొన్నారు.