శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 11 ఏప్రియల్ 2022 (10:14 IST)

ఏపీకి మళ్లీ ఐదుగురు ఉప ముఖ్యమంత్రులు?

ys jagan
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన మంత్రివర్గాన్ని పునర్‌వ్యవస్థీకరించారు. పాత మంత్రుల్లో 14 మందిని తొలగించారు. 11 మందికి తిరిగి అవకాశం కల్పించారు. మొత్తం 25 మందితో కూడిన మంత్రివర్గం సోమవారం 11.30 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనుంది. ఇందుకోసం అన్ని ఏర్పాట్లూ చేశారు. ఇదిలావుంటే, కొత్త మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నవారిలో ఐదుగురికి ఉప ముఖ్యమంత్రి హోదా కల్పించనున్నారు. 
 
గత మంత్రివర్గంలో ఎస్సీ, మైనార్టీ విభాగంలో ఉప ముఖ్యమంత్రులుగా నారాయణ స్వామి, అంజాద్ బాషాలకు తిరిగి డిప్యూటీ సీఎం పదవులు కేటాయించనున్నారు. వీరిద్దరితో పాటు ఎస్టీ కోటాలా రాజన్నదొర డిప్యూటీ సీఎం అయ్యే అవకాశం ఉంది. 
 
అలాగే, బీసీ కోటాలో సీనియర్ మంత్రి ధర్మాన ప్రసాద రావుకు, కాపు సామాజికవర్గంలో అంబటి రాంబాబు లేదా గుడివాడ అమర్నాథ్ లేదా కొట్టు సత్యనారాయణ, దాడిశెట్టి రాజాలలో పోటీ నెలకొంది. వీరిలో ఒక్కరికి డిప్యూటీ సీఎం అయ్యే అవకాశం ఉంది. 
 
కొత్త మంత్రుల జాబితాకు గవర్నర్ ఆమోదం 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కొత్త మంత్రి మండలి జాబితాకు రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిందన్ ఆమోదముద్ర వేశారు. దీంతో కొత్త మంత్రులు సోమవారం మధ్యాహ్నం 11.31 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. వీరితో గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయిస్తారు. 
 
కాగా, కొత్త మంత్రివర్గాన్ని సీఎం జగన్‌తో పాటు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, కోర్ కమిటీ తీవ్ర కసరత్తుల అనంతరం 25 మందితో కూడిన నూత మంత్రివర్గాన్ని రూపకల్పన చేశారు. వీరిలో 11 మంది పాతవారికి, 14 మందికి కొత్తవారికి అవకాశం కల్పించారు. కొత్తగా మంత్రులుగ దక్కించుకున్న వారిలో రోజా, అంబటి రాంబాబు, విడదల రజనీ, ధర్మాన ప్రసాదరావు, జోగి రమేష్, గుడివాడ అమర్నాథ్ తదితరులు ఉన్నారు. 
 
ఏపీ కొత్త మంత్రివర్గం సభ్యులు 
బొత్స సత్యనారాయణ, సీదిరి అప్పలరాజు, పినిపే విశ్వరూప్, చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, తానేటి వనిత, ఆదిమూలపు సురేష్, అంజాద్ బాషా, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, గుమ్మనూరు జయరాం, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కె.నారాయణ స్వామి, ధర్మాన ప్రసాదరావు, పిడిక రాజన్నదొర, గుడివాడ అమర్నాథ్, బూడి ముత్యాలనాయుడు, దాడిశెట్టి రామలింగేశ్వర రావు, కారుమూరి వెంకట నాగేశ్వ రావు, కొట్టు సత్యనారాయణ, జోగి రమేష్, అంబటి రాంబాబు, మేరుగ నాగార్జున, విడదల రజినీ, కాకాణ గోవర్థన్ రెడ్డి, ఆర్కే.రోజా, ఉష శ్రీచరణ్‌లు మంత్రులుగా నియమితులయ్యారు. 
 
అదేసమయంలో మంత్రి పదవులు కోల్పోయిన వారిలో ధర్మాన కృష్ణదాస్, పుష్ప శ్రీవాణి, అవంతి శ్రీనివాస్, కురసాల కన్నబాబు, ఆళ్ళనాని, కొడాలి నాని, పేర్ని నాని, చెరుకువాడ శ్రీరంగనాథ రాజు, వెల్లంపల్లి శ్రీనివాస్, మేకతోటి సుచరిత, బాలినేని శ్రీనివాస రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, శంకరణ నారాయణలు మంత్రిపదవులను కోల్పోయారు.