గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 24 మే 2021 (13:13 IST)

ఏపీలో మూడు రోజుల పాటు కొవిషీల్డ్ ఫస్ట్ డోస్ పంపిణీ

నేటి నుంచి రాబోయే మూడు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా కొవిషీల్డ్ వ్యాక్సిన్ ను మొదటి డోసుగా వేయనున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. 45 ఏళ్లు నిండి... ప్రజలతో నిత్యం సంబంధాలు కలిగిన రైల్వే, ఆర్టీసీ, బ్యాంకు ఉద్యోగులతో  పాటు జర్నలిస్టులకు ఫస్ట్ డోస్ వేయాలని అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశామన్నారు.

ముంచుకొస్తున్న తుఫాన్ దృష్ట్యా ముందు జాగ్రత్తగా రాష్ట్రంలో ఆక్సిజన్ నిల్వలు సిద్ధం చేశామన్నారు. కృష్ణపట్నం మందుపై నిపుణుల కమిటీ నివేదిక రావాల్సి ఉందన్నారు. విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత మూడు రోజుల నుంచి రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతూ వస్తున్నాయన్నారు.

ఈ నెల 21 వ తేదీ 92,231 కరోనా టెస్టులు చేయగా,  20,937 పాజిటివ్ కేసులు నమోదయ్యాయన్నారు. 22వ తేదీన 90,609 టెస్టులు చేయగా, 19,981 పాజిటివ్ కేసులుగా నిర్ధారించారన్నారు. గడచిన 24 గంటల్లో 91,629 కరోనా టెస్టులు చేయగా, 18,767 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని, 104 మృతి చెందారని తెలిపారు. మూడు రోజుల నుంచి పరిశీలిస్తే రోజుకు వెయ్యి కేసుల వరకూ తగ్గుతూ వచ్చాయన్నారు. 104 కాల్ సెంటర్ కూడా కరోనా బాధితుల నుంచి వస్తున్న ఫోన్ కాల్స్ తగ్గుముఖం పట్టాయన్నారు.

ఈ నెల 21వ తేదీన 10,919 ఫోన్ కాల్స్ రాగా, 22వ తేదీన 8,414 కాల్స్, గడిచిన 24 గంటల్లో (23 వ తేదీన) 8,123 కాల్స్ వచ్చాయన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఐసీయూ బెడ్లు విషయానికొస్తే... ఈ నెల 21వ తేదీన 519 బెడ్లు, 22వ తేదీన 554, 23వ తేదీన 918 బెడ్లు ఖాళీగా ఉన్నాయన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆక్సిజన్ బెడ్ల సంఖ్య  గమనిస్తే, 21వ తేదీన 1,384, 22వ తేదీన 1,533, 23వ తేదీన 2,867 బెడ్లు అందుబాటులో ఉన్నాయన్నారు. మూడు రోజుల నుంచి అందుబాటులో ఉండే బెడ్లు సంఖ్య పెరుగుతుంటే, కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుతూ వచ్చిందన్నారు.

వాటన్నింటినీ గమనిస్తే...రాష్ట్రంలో కరోనా త్వరగా కంట్రోల్ లోకి వచ్చే అవకాశముందన్నారు. గడిచిన 24 గంటల్లో ప్రభుత్వాసుపత్రుల్లో 23,685 రెమిడెసివిర్ ఇంజక్షన్లు అందుబాటులో ఉండగా, ప్రైవేటు ఆసుపత్రులకు 18,094 ఇంజక్షన్లు సప్లయ్ చేశామన్నారు. 

తుఫాన్ నేపథ్యంలో ఆక్సిజన్ నిల్వల స్టాక్
రాబోయే రెండ్రోజుల్లో తుఫాన్ వల్ల ఇబ్బందులు ఉండొచ్చునని కేంద్ర ప్రభుత్వం హెచ్చరించిన నేపథ్యంలో రాష్ట్రంలో ఆక్సిజన్ నిల్వలు ముందుస్తుగా సమీకరించుకున్నామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. ఏపీపై తుఫాన్ ప్రభావం ప్రత్యక్షంగా పెద్దగా చూపకపోయినా, ఒడిశా నుంచి వచ్చే ఆక్సిజన్ సరఫరాలో ఇబ్బందులు రావొచ్చునని కేంద్ర కేబినెట్ సెక్రటరీ తెలియజేశారన్నారు.

దీంతో ముందు జాగ్రత్తగా ఆక్సిజన్ నిల్వలను వివిధ రాష్ట్రాల నుంచి తెప్పించుకున్నామన్నారు. రోజువారీగా కేంద్ర ప్రభుత్వం ఏపీకి 590 మెట్రిక్ టన్నులను కేటాయిస్తోందన్నారు. ఈ నెల 19వ తేదీన 711 మెట్రిక్ టన్నులు, 20 తేదీన 600 మెట్రిక్ టన్నులు, 22న  608 మెట్రిక్ టన్నులు డ్రా చేశామన్నారు. తుఫాన్ నేపథ్యంలో గడిచిన 24 గంటల్లో 770 మెట్రిక్ టన్నులు డ్రా చేశామన్నారు.

అందులో రూర్కెల్లా, జామ్ నగర్ నుంచి 70 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ వచ్చిందన్నారు.  తుఫాన్ వల్ల ఒడిశా ఇతర రాష్ట్రాల నుంచి ఆక్సిజన్ సరఫరాలో ఆలస్యమైనా, ముందుగా అదనంగా డ్రా చేసిన ఆక్సిజన్ నిల్వల వల్ల ఎటువంటి ఇబ్బందులు రావన్నారు. 

జోరుగా జర్వపీడుతుల గుర్తింపు సర్వే
రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన జ్వర పీడుతుల గుర్తింపు సర్వే చురుగ్గా సాగుతోందన్నారు. కొన్ని జిల్లాల్లో 6,7 విడతల సర్వే కూడా సాగుతోందన్నారు. ఈ సర్వేల్లో జ్వరపీడుతుల నుంచి శాంపిళ్లు సేకరించి రిపోర్టులు త్వరగా అందజేస్తున్నామన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాల్లో 36 గంటల్లోనే రిపోర్టులు ఇస్తున్నారన్నారు. ఇలా అన్ని జిల్లాల్లో రిపోర్టులు త్వరగా ఇచ్చేలా ఆయా జిల్లా అధికారులు కృషి చేస్తున్నారన్నారు.

కరోనా వల్ల తల్లిదండ్రులు కోల్పోయిన చిన్నారుల జాబితాలను అన్ని జిల్లాల కలెక్టర్లు సిద్ధం చేస్తున్నారన్నారు. బ్లాక్ ఫంగస్ కేసుల వివరాలను సేకరిస్తున్నారన్నారు. కొవిడ్ పై సమీక్షా సమావేశాన్ని సోమవారం మధ్యాహ్నం సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి  నిర్వహించనున్నారన్నారు. ఆ సమావేశంలో ఈ రెండింటికి సంబంధించిన పూర్తి జాబితాను సీఎం జగన్మోహన్ రెడ్డికి అందజేస్తామన్నారు.

బ్లాక్ ఫంగస్ నివారణకు సంబంధించి కేంద్ర నుంచి వెయ్యి వరకూ ఇంజక్షన్లు వచ్చాయని, వాటిని అన్ని జిల్లాలకు అందజేశామని తెలిపారు. సోమవారం మరిన్ని ఇంజక్షన్లు కేంద్రం నుంచి రానున్నాయని, వాటిని జిల్లాలకు పంపిణీ చేస్తామని తెలిపారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో ఆక్సిజన్ ఆడిట్ నిర్వహించామన్నారు. 

జూన్ 15లోగా 14,86,220 వ్యాక్సిన్ల కొనుగోలు 
కేంద్ర ప్రభుత్వం నుంచి నేటి వరకూ 76,49,960 కరోనా వ్యాక్సిన్లు వచ్చాయని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సొంతంగా  ఇప్పటి వరకూ 11,64,120 డోసులు కొనుగోలు చేసిందన్నారు. నేటి వరకూ రాష్ట్ర వ్యాప్తంగా 78,78,604 డోసు లు అందజేశామని, వాటిలో రెండు డోసులు చొప్పున 23,38,791 మందికి, 32,01,022 మందికి ఒక డోసు ఇచ్చామని తెలిపారు.

మే నెలాఖరుకు వరకూ అంటే రాబోయే వారం రోజుల్లో 1,18,129 మందికి సెకండ్ డోసు కొవాగ్జిన్ టీకా వేయాల్సి ఉందన్నారు. మొత్తంగా చూస్తే... మే నెలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం 14,15,420 డోసులు ఏపీకి కేటాయించిందన్నారు. వాటిలో 11,65,365 డోసులు రాగా, ఇంకా 2,50,060 డోసులు కేంద్రం నుంచి రావాల్సి ఉందన్నారు. ఇక జూన్ నెల గమనిస్తే, వచ్చే నెల 15వ తేదీలోగా 7,68,010 డోసులను ఏపీకి కేంద్ర ప్రభుత్వం కేటాయించిందన్నారు. 

మే నెలలో రావాల్సిన కోటాతో పాటు జూన్ 15 తేదీ వరకూ సంబంధించి కేంద్ర నుంచి 10,18,000 డోసులు రావాల్సి ఉందన్నారు. ఇప్పటికే ఏపీ వద్ద ఉన్న 3,29,000 డోసులతో పాటు కేంద్ర నుంచి వచ్చే 10,18,000 డోసులు కలిపి మొత్తం 13.50 లక్షలు డోసులు అందుబాటులో ఉన్నాయన్నారు. ఇవన్నీ ఏపీకి కేంద్ర ప్రభుత్వం కోటా కింద వచ్చే డోసులన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం మే నెల మాదిరిగానే జూన్ నెలకు సంబంధించి కొవిషీల్డ్ 11,45,540 డోసులను, కొవాగ్జిన్ 3,40,680 డోసులను మొత్తం కలిపి 14,86,220 డోసులు కొనుగోలు చేయనుందన్నారు. వాటికి సంబంధించి సోమవారం ఆర్డర్ ఇస్తామని, జూన్ 15 తరవాత సప్లయ్ చేస్తామని ఆ రెండు కంపెనీలు తెలిపాయని వెల్లడించారు.  

నేటి నుంచి కొవిషీల్డ్ ఫస్ట్ డోసు పంపిణీ
ఏపీ దగ్గర స్టాక్, కేంద్ర నుంచి రావాల్సిన టీకాలు, రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా కొనుగోలు చేసే మొత్తం కలిపి జూన్ 15వ తేదీ నాటికి 28,15,000 డోసుల వ్యాక్సిన్ నిల్వలు ఉంటాయన్నారు. నేటి వరకూ రాష్ట్ర ప్రభుత్వం వద్దనున్న 13,13,000 లక్షల టీకాలు జిల్లాలకు పంపించామన్నారు. వాటిలో 1,55,000 కోవాగ్జిన్ వ్యాక్సిన్లు ఉన్నాయని, వాటిని సెకండ్ డోసుగా వేస్తామన్నారు.

మిగిలిన 11,58,000 కొవిషీల్డ్ టీకాలను  హైరిస్క్ కలిగి, ప్రజలతో నిత్యం సత్సంబంధాలు కలిగే ఉండే రైల్వే, ఏపీఎస్ ఆర్టీసీ, కోర్డు, బ్యాంకు, సివిల్ సప్లయ్ ఉద్యోగులతో పాటు జర్నలిస్టులకు ఫస్ట్ డోసుగా వేస్తామన్నారు.  45 ఏళ్లు పైబడిన వారికి టీకాలు వేయాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించాం. రాబోయే మూడ్రోజులు సోమ, మంగళ, బుధవారాల్లో వ్యాక్సిన్ వేస్తారన్నారు.

ఏపీలో కొవాగ్జిన్ ఫస్ట్ డోస్ లు ఇచ్చే అవకాశం లేదన్నారు. పూర్తి స్థాయిలో వ్యాక్సిన్లు అందుబాటులో లేవని, ఇటువంటి సమయంలో ప్రైవేటు ఆసుపత్రుల ద్వారా టీకాల విక్రయాలు చేయడం సరికాదని పీఎం నరేంద్రమోడికి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి లేఖ రాశారన్నారు. 

కృష్ణపట్నం మందుపై నివేదిక రావాల్సి ఉంది...
కృష్ణపట్నం ఆయుర్వేద మందుపై నివేదిక ఇంకా రావాల్సి ఉందని, నాటు మందుకు పర్మిషన్ ఇవ్వాల్సిన అవసరం లేదని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. హైదరాబాద్ ల్యాబ్ లో నిర్వహించిన పరిశోధనలో కృష్ణపట్నం మందులో ఎటువంటి హానికర పదార్థాలు లేవని నిర్ధారించారన్నారు. ఆ మందును ఆయుర్వేదిక్ మందు అని నిర్ధారణ చేయాలంటే కొన్ని పద్ధతులు పాటించాల్సి ఉంటుందన్నారు.

కృష్ణపట్నం మందు తయారీ విధానాన్ని ఆయూష్ కమిషనర్ స్వయంగా పరిశీలించారన్నారు. ఇప్పటికే ఆ మందు వాడిన వారిపై ఎటువంటి ప్రభావం చూపించిందనే విషయంపై వివరాలు సేకరిస్తున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నియమించిన నిపుణుల నివేదిక కోసం ఎదురు చూస్తున్నామన్నారు.