బుధవారం, 27 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Modified: మంగళవారం, 30 మార్చి 2021 (20:20 IST)

అర్ధరూపాయి కూడా ఇవ్వను, ఓటు వేయకపోతే పోండి: మాజీ కేంద్రమంత్రి చింతామోహన్

తిరుపతి ఉప ఎన్నికలు నువ్వా నేనా అన్నట్లు హాట్ హాట్‌గా నడుస్తోంది. ప్రధాన పార్టీలకు ధీటుగా కాంగ్రెస్ పార్టీ కూడా ఎన్నికల కదన రంగం లోకి దూకింది. సుదీర్ఘ రాజకీయ అనుభవంతో పాటు ఆరుసార్లు ఎంపీగా గెలిచిన చింతామోహన్ ఈసారి ఉప ఎన్నికలలో పోటీ చేస్తున్నారు.
 
100 సంవత్సరాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ హయాంలో తిరుపతి పార్లమెంటు పరిధిలో జరిగిన అభివృద్ధిని వివరిస్తూ చింతా మోహన్ ప్రచారం కొనసాగిస్తున్నారు. అయితే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు శైలజానాథ్‌తో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేసిన చింతా మోహన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
 
తిరుపతి ఉప ఎన్నికల్లో అధికార వైసిపి ఇప్పటికే ప్రలోభాలకు తెరలేపిందని ఆరోపించారు. వైసీపీ నేతలు ఇచ్చిన డబ్బులు తాను ఇవ్వలేనని అసలు అర్ధరూపాయి కూడా ఓటర్లకు ఇచ్చే పరిస్థితిలో తాను లేనని, ఓటు వేయాలని ఉన్నవారు వేయచ్చు.. ఓటు వేయకపోయినా పర్వాలేదన్నారు చింతా మోహన్. 
 
ప్రధాన పార్టీల కన్నా ధీటుగా చింతా మోహన్ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ఎలాంటి హంగూ ఆర్భాటాలు లేకుండా కేవలం ముగ్గురే ముగ్గురితో నామినేషన్ దాఖలు చేశారు. ప్రచారాన్ని కూడా కొడుకు, కూతురుతో కలిసి చేస్తున్నారు. అయితే మీడియాతో మాట్లాడుతున్న ప్రతిసారి చింతా మోహన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు.