సెప్టెంబర్ నుంచి 'జనం'లోకి జగన్!
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వచ్చే నెల నుంచి మరింత దూకుడు పెంచనున్నారు. జిల్లాల పర్యటనలతో పాటు తాను మేనిఫేస్టోలో పెట్టిన అంశాలను క్షేత్రస్థాయిలో అమలు చేయాలని నిర్ణయించారు. ఇందుకోసం యంత్రాంగంతో పాటు పార్టీ నేతలకు స్పష్టమైన ఆదేశాలు అందాయి.
ముఖ్యమంత్రిగా బాధ్యతలను స్వీకరించిన తర్వాత వైఎస్ జగన్ అన్ని శాఖలను సవిూక్ష చేశారు. వాటిల్లో లోతుపాతులను పరిశీలించారు. దాదాపు మూడు నెలల నుంచి జగన్ తాడేపల్లి లోని తన క్యాంపు కార్యాలయానికే పరిమితమయ్యారు.అయితే సెప్టంబరు మాసం నుంచి ఇక జనంలోకి వెళ్లాలని నిర్ణయించు కున్నారు. తన విధానాలను నేరుగా ప్రజలకు వివరించేందుకు సిద్ధమయ్యారు.
సెప్టెంబర్ నెలలో రచ్చబండ పేరుతో వైఎస్ జగన్ జిల్లాలను పర్యటించనున్నారు. ఈమేరకు అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు అందాయి. తన తండ్రి రాజశేఖర్ రెడ్డి రచ్చబండను ప్రారంభించే కార్యక్రమంలో ప్రమాదంలో మృతి చెందడంతో అదే కార్యక్రమాన్ని వైఎస్ జగన్ పునరుద్ధరిస్తున్నారు. చిత్తూరు జిల్లా నుంచే రచ్చబండ కార్యక్రమం ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.
వైఎస్ జగన్ జిల్లాల పర్యటనకు వెళ్లే లోగా కొన్ని కార్యక్రమాలను గ్రౌండ్ చేస్తున్నారు. సెప్టెంబరు 1వ తేదీ నుంచి సన్న బియ్యం, పింఛన్లను డోర్ డెలివరీ చేయాలని నిర్ణయించారు. ఇక రేషన్, పింఛన్ల కోసం లబ్దిదారులు ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చే అవసరం లేదు. అంతేకాకుండా నాణ్యమైన ప్యాకింగ్ చేసిన సన్న బియ్యాన్ని శ్రీకాకుళం నుంచి ప్రారంభిస్తారు.
దీన్ని పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించనున్నారు. అందరూ ఎదురుచూస్తున్న ఆరోగ్యశ్రీని కూడా అమలు చేయనున్నారు.ఇక రైతుల కోసం వైఎస్సార్ భరోసా కార్యక్రమాన్ని అక్టోబరు 15వ తేదీన ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీని ఆహ్వనించే యోచనలో వైఎస్ జగన్ ఉన్నారు.
ఉగాది నాటికి ఇళ్ల స్థలాలు అందరికీ ఇవ్వాలన్న సంకల్పం చేశారు వైఎస్ జగన్. ఇలా వచ్చే నెల నుంచి పాలనలో మరింత దూకుడుపెంచేందుకు వైఎస్ జగన్ పక్కా ప్రణాళికను సిద్ధం చేశారు.