సోమవారం, 6 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఐవీఆర్
Last Updated : మంగళవారం, 16 నవంబరు 2021 (15:18 IST)

బ్రేక్‌ఫాస్ట్‌ ప్రోగ్రామ్‌ కోసం అక్షయ పాత్రకు మద్దతునందిస్తున్న గ్లాండ్‌ఫార్మా

అక్షయపాత్ర ఫౌండేషన్‌కు పలు రకాలుగా మద్దతునందిస్తున్న సుప్రసిద్ధ భారతీయ ఔషద కంపెనీ గ్లాండ్‌ ఫార్మా ఇప్పుడు బ్రేక్‌ఫాస్ట్‌ ప్రోగ్రామ్‌కు మద్దతునందించేందుకు కంది వద్ద నున్న అక్షయ పాత్ర యొక్క హైదరాబాద్‌ కిచెన్‌‌కు నూతన ఇడ్లీ మెషీన్‌లను అందించింది. ఈ ప్రోగ్రామ్‌ ద్వారా హైదరాబాద్‌, వైజాగ్‌లలోని 13,650 మంది పాఠశాల విద్యార్థులకు నాణ్యమైన అల్పాహారం అందించడంలో గ్లాండ్‌ఫార్మా సహాయపడనుంది.
 
అక్షయ పాత్ర ప్రతి రోజూ పాఠశాల పనిదినాల వేళ చిన్నారులకు ఉదయం అల్పాహారం అందిస్తుంటుంది. ఈ నూతనంగా ప్రారంభించిన మెషీన్‌లు కేవలం15-20 నిమిషాలలో 2వేల ఇడ్లీలను తయారుచేసే సామర్థ్యం కలిగి ఉన్నాయి. ఈ మెషీన్‌లలో పల్వెరైజర్‌, మిక్సింగ్‌, ఇడ్లీ పిండి ఆటోమేటిక్‌ అన్‌లోడింగ్‌, ఉష్ణోగ్రత నియంత్రిత కుకింగ్‌ చాంబర్‌, పరిశుభ్రంగా ఆహారం నిర్వహించడం, ఆరంభం నుంచి అంతిమం వరకూ మానవ స్పర్శ లేకపోవడం వంటి విశిష్టతలు కలిగి ఉన్నాయి. 
 
ఈ మెషీన్‌లతో దాదాపు 45వేల ఇడ్లీలను అతి సులభంగా, వేగంగా వేయడం సాధ్యమవుతుంది. ఈ బ్రేక్‌ఫాస్ట్‌ ప్రోగ్రామ్‌ను హైదరాబాద్‌లో నవంబర్‌ 2019లో గ్లాండ్‌ ఫార్మా లిమిటెడ్‌ ఎండీ అండ్‌ సీఈవో శ్రీ శ్రీనివాస్‌ సాధు ప్రారంభించారు. అనంతరం ఫిబ్రవరి 2020లో ఈకార్యక్రమాన్ని విశాఖపట్నంలో ప్రారంభించారు.
 
‘‘రోజులో అత్యంత కీలకమైన ఆహారం ఉదయం పూట బ్రేక్‌ఫాస్ట్‌. కానీ నిరుపేద వర్గాలకు చెందిన పిల్లలు ఆర్ధిక అవరోధాలతో తరచుగా దీనిని తీసుకోవడం లేదు. ఈ కార్యక్రమం ద్వారా, చిన్నారులు  చక్కటి బ్రేక్‌ఫాస్ట్‌తో తమ రోజును ప్రారంభించగలరనే భరోసా అందిస్తున్నాం. తద్వారా వారి ఆరోగ్య, విద్యా ప్రదర్శన కూడా మెరుగుపడేలా చేయగలుగుతున్నాం. అక్షయ పాత్ర ద్వారా మరిన్ని కార్యక్రమాలకు మద్దతునందించనున్నాం’’ అని శ్రీ శ్రీనివాస్‌ సాధు అన్నారు.
 
అక్షయ పాత్ర ఫౌండేషన్‌ సీఈవో శ్రీ శ్రీధర్‌ వెంకట్‌ మాట్లాడుతూ, ‘‘హైదరాబాద్‌ మరియు వైజాగ్‌లలో మా బ్రేక్‌ఫాస్ట్‌ కార్యక్రమం కోసం మద్దతునందించడం పట్ల గ్లాండ్‌ఫార్మాకు కృతజ్ఞతలు తెలుపుతున్నాము. గ్లాండ్‌ ఫార్మా మరియు అక్షయపాత్రలు ఈ కార్యక్రమం కోసం చేతులు కలుపడం మా అదృష్టం. ఈ భాగస్వామ్యంతో వేలాది మంది చిన్నారులకు మధ్యాహ్న భోజనం కూడా అందించగలుగుతున్నాం’’ అని అన్నారు.
 
ఈ నూతన ఇడ్లీ మెషీన్‌ను ప్రారంభించడంతో పాటుగా అక్షయపాత్ర యొక్క కంది  కిచెన్‌లో బ్రేక్‌ ఫాస్ట్‌ ప్రోగ్రామ్‌కు అంకితం చేశారు. ఈ కార్యక్రమంలో గ్లాండ్‌-ఫోసన్‌ ఫౌండేషన్‌ ట్రస్టీలు శ్రీ కె రఘురామ్‌, శ్రీ సంపత్‌కుమార్‌; Ms శిల్పా సహాయ్‌ మరియు Ms ఎస్‌ స్వాతి పాల్గొన్నారు. అక్షయ పాత్ర తరపున శ్రీ యజ్ఞేశ్వర ప్రభు,వైస్‌ ప్రెసిడెంట్- హైదరాబాద్‌ అక్షయ పాత్ర చాప్టర్‌; Ms రజినీ సిన్హా, స్టేట్‌ హెడ్‌ కూడా పాల్గొన్నారు.