శనివారం, 23 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , శుక్రవారం, 8 అక్టోబరు 2021 (11:53 IST)

తెలంగాణతో సమానంగా ఏపీ ఆయిల్ పామ్ రైతులకు ధర క‌ల్పించాలి

ఆయిల్ పామ్ కంపెనీల యాజమాన్యాలు, దళారుల మోసాలు అరికట్టి  ఆయిల్ పామ్ రైతులను ఆదుకోవాలని, తెలంగాణతో సమానంగా ఆయిల్ పామ్ రైతులకు ధర ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాస్, జిల్లా సహాయ కార్యదర్శి కట్టా భాస్కరరావు డిమాండ్ చేశారు.
ఆయిల్ పామ్ గెలలు కొనుగోలులో జరుగుతున్న మోసాలపై,ఆయిల్ పామ్ గెలలకు మద్ధతు ధరపై ఏలూరు పవర్ పేటలోని అన్నే వెంకటేశ్వరరావు భవనంలో నిర్వహించిన సమావేశంలో రైతులు మాట్లాడారు.
 
ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలో రెండు లక్షల ఎకరాలకు పైగా ఆయిల్ పామ్ తోటలు విస్తరించి ఉన్నాయని, ఏటా 10 లక్షల టన్నుల ఆయిల్ పామ్ గెలలు ఉత్పత్తి జరుగుతున్నదని చెప్పారు. తెలంగాణతో సమానంగా ఆయిల్ పామ్ గెలలకు ధర ఇస్తామని పాదయాత్ర సందర్భంగా జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారని చెప్పారు. హామీ ప్రకారం 18.68 శాతం రికవరీ పై ధర ఇవ్వాలని జీవో 22ను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిందన్నారు. అయితే తెలంగాణలో టన్ను ఆయిల్ పామ్ గెలలకు రూ.21వేలు ధర ఇస్తుంటే ఆంధ్రప్రదేశ్ లో రూ.18 వేలు మాత్రమే ఇవ్వడంతో ఆయిల్ పామ్ రైతులు టన్ను గెలలకు రూ.3వేలకు పైగా నష్టపోతున్నారని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. 
 
మరోవైపు గెలలు గ్రేడింగ్ పేరుతో, తూకాలు పేరుతో కంపెనీల యాజమాన్యాలు, దళారులు రైతులను మోసం చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. దళారులు రైతుల వద్ద తక్కువ ధరకు కొనుగోలు చేసి తెలంగాణ ధర పొంది రైతులకు నష్టం కలిగిస్తున్నారని చెప్పారు. ఆయిల్ పామ్ కంపెనీల యాజమాన్యాలు, దళారుల మోసాలు అరికట్టి ఆయిల్ పామ్ రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణతో సమానంగా ధర ఇవ్వాలని కోరారు. లేనిపక్షంలో ఆయిల్ పామ్ రైతులను సమీకరించి ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.