శుక్రవారం, 8 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 7 అక్టోబరు 2021 (15:06 IST)

లఖింపుర్ ఖేరి ఘటన మృతుల కుటుంబాలకు పరిహారం అందజేత

లఖింపుర్ ఖేరిలో జరిగిన ఘర్షణల్లో ప్రాణాలు కోల్పోయిన మృతుల కుటుంబాలకు గురువారం ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం పరిహారం అందజేసింది. ఒక్కో కుటుంబానికి రూ.45 లక్షల విలువైన చెక్కును ఇచ్చింది. మృతుల్లో నలుగురు రైతులు, ఇద్దరు భాజపా కార్యకర్తలు, ఒక డ్రైవర్, ఒక జర్నలిస్టు ఉన్నారు. 
 
ఈ ఎనిమిది కుటుంబాలకు ఈ రోజు చెక్కులు అందాయని యూపీ ప్రభుత్వం వెల్లడించింది. అలాగే వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని ఇప్పటికే హామీ ఇచ్చింది. ‘ఇది దురదృష్టకరమైన ఘటన. మొత్తం ఎనిమిది కుటుంబాలకు పరిహారం చెల్లించాం’ అని ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారు. 
 
మరోపక్క పరిహారం అంశం కూడా అక్కడ రాజకీయ విమర్శలకు దారితీస్తోంది. యూపీ ప్రభుత్వం ఎనిమిది మంది మృతుల కుటుంబాలకు పరిహారం అందివ్వగా.. కాంగ్రెస్ ఐదు కుటుంబాలకే పరిహారాన్ని అందజేసింది. ‘నలుగురు రైతులు, జర్నలిస్టు కుటుంబాలకే పరిహారం ఇవ్వాలని మేం నిర్ణయించాం. ఆ ముగ్గురు (ఇద్దరు భాజపా కార్యకర్తలు, వాహనం డ్రైవర్‌) ఈ ఘటనకు కారణమయ్యారు. వారికి పరిహారం ఎలా ఇవ్వాలి? వారు నిందితులు’ అంటూ కాంగ్రెస్ నేత ఒకరు మీడియాకు వెల్లడించారు. 
 
మరోవైపు, దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన లఖింపుర్ ఖేరి ఘటనపై విచారణ కమిషన్ ఏర్పాటైంది. అలహాబాద్ హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి ప్రదీప్ కుమార్ శ్రీవాస్తవ నేతృత్వంలోని కమిషన్ ఈ కేసుపై దర్యాప్తు జరపనుంది. 
 
లఖింపుర్ ఖేరి ఘటనకు సంబంధించి కేంద్రమంత్రి అజయ్ మిశ్రా రాజీనామా చేయాల్సిందేనని ప్రియాంక గాంధీ పట్టుబట్టారు. ‘ప్రజాస్వామ్యంలో న్యాయం పొందడం ఒక హక్కు. ఆ న్యాయం లభించేవరకు నా పోరాటాన్ని కొనసాగిస్తాను. మృతుల కుటుంబాలు అదే డిమాండ్ చేస్తున్నాయి. నిష్పక్షపాత దర్యాప్తు జరగాలంటే కేంద్రమంత్రి రాజీనామా చేయాల్సిందే’ అని ప్రియాంక విలేకరులతో మాట్లాడారు.