1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కె
Last Modified: విజయవాడ , బుధవారం, 1 సెప్టెంబరు 2021 (11:16 IST)

మీరు చెప్పిందల్లా చేయడానికి ఉద్యోగులు వైసీపీ కార్యకర్తలు కాదు

ప్రభుత్వ ఉద్యోగులంటే ప్రజలకు సేవ చేసేవారే గానీ వైసీపీ నేతల అడుగులకు మడుగులొత్తే వారు కాదనే విషయాన్ని గుర్తుంచుకుని వ్యవహరించాల‌ని టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు సూచించారు. వైసీపీ రాజకీయ ప్రయోజనాలకు రాల్లెత్తే కూళీల్లా ఉద్యోగులు కనిపిస్తున్నారా.? జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ ఉద్యోగులను వైసీపీ నేతలు వేధించుకు తింటున్నారు. నిత్యం వైసీపీ నేతలు వేధిస్తున్నారు. ఇది రాచరిక పాలనా? ప్రజాస్వామ్య పాలనా.?  అనంతపురం జిల్లా కదిరిలో వైసీపీ కౌన్సిలర్లు పెట్టే వేధింపులు తాళలేక పట్టణ ప్రణాళిక అధికారి రహమన్  కాస్త విషమిస్తే చచ్చిపోతా అనే దాకా వచ్చారంటే, వేధింపులు ఏ స్థాయిలో వున్నాయో అద్దం పడుతోంద‌ని అశోక్ బాబు విమ‌ర్శించారు. 
 
ఎస్ఎస్‌సీ బోర్డులోని ప్రభుత్వ ఉద్యోగులపై అకారణంగా సస్పెన్షన్ వేశారు. ధర్మవరంలో ఒత్తిళ్లు తట్టుకోలేక అధికారులు సామూహిక సెలవులు పెట్టి వెళ్లిపోయారు. ఉద్యోగులు స్వేచ్ఛగా విధులు నిర్వహించే వాతావరణం రాష్ట్రంలో లేదు. మీరు చెప్పిందల్లా చేయడానికి ప్రభుత్వ ఉద్యోగలనుకుంటున్నారా..వైసీపీ కార్యకర్తలు అనుకుంటున్నారా? గతంలో అనితారాణి అనే దళిత ఉద్యోగిని పట్ల వైసీపీ కార్యకర్తలు వ్యవహరించిన తీరు హేయం. వారిపై ఇప్పటికీ చర్యలు తీసుకోలేదు.  కింది స్థాయి వైసీపీ కార్యకర్తలు కూడా అధికారులను బెదిరిస్తున్నారంటే ఉద్యోగులు ఎంత దీనస్థితిలో ఉన్నారో అర్థమవుతోంద‌న్నారు
 
జీతాలు నెల వచ్చే సరికి ఇవ్వడం లేదు. వాయిదాల పద్ధతిలో ఇచ్చే సంస్కృతిని తెచ్చారు. రాబోయే రోజుల్లో నెలజీతం సరిగా వస్తే పాలాభిషేకం చేసే రోజులు తెస్తారేమో.ఉద్యోగులను వేధించిన వాళ్లపై క్రిమినల్ కేసులు పెట్టి శిక్షించాలి. లేదంటే ఉద్యోగుల పక్షాన నిలబడి పోరాడతాం. ఉద్యోగులను వైసీపీ నేతలు వేధించడంపై గవర్నర్ జోక్యం చేసుకోవాల‌ని అశోక్ బాబు డిమాండు చేశారు. 
 
అధికారంలోకి వచ్చిన వారంలో సీపీఎస్ రద్దు చేస్తానని పాదయాత్రలో ఇచ్చిన హామీని జగన్మోహన్ రెడ్డి విస్మరిస్తున్నారు. అధికారంలోకి వచ్చి 112 వారాలైంది. ఇప్పటికీ దానిపై నోరు మెదపడం లేదు.  మీరు రద్దు చేస్తానన్న సీపీఎస్ నే ఉద్యోగులు అడుగుతున్నారు. సీపీఎస్ రద్దు విషయంలో ఉద్యోగులు మీకు చాలా సమయమే ఇచ్చారు. ఇచ్చిన మాట మీద నిలబడటం నేర్చుకోండి. బయటకు వచ్చి బాధ చెప్పుకోలేని స్థితిలో నేడు రాష్ట్ర ఉద్యోగులు ఉన్నారు. అణచివేత, గొంతు నొక్కడం ఎంత వరకు సమంజసం.? ప్రభుత్వ అధికారులు ప్రజలకు జవాబుదారి కానీ..వైసీపీ నేతలకు కాదన్న విషయాన్ని గుర్తుంచుకోవాల‌ని పర్చూరి అశోక్ బాబు చెప్పారు.