శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కె
Last Modified: సోమవారం, 2 ఆగస్టు 2021 (23:15 IST)

ప్ర‌భుత్వ ఉద్యోగుల ఆప్ష‌న్ ప్ర‌భుత్వ ఆసుప‌త్రులే కావాలి

మెడిక‌ల్ కాలేజీల్లో కూడా నాడు నేడు కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించాల‌ని ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి సూచించారు. వైద్య ఆరోగ్యశాఖలో నాడు–నేడుపైనా సీఎం సమీక్ష చేశారు. కొత్తగా నిర్మిస్తున్న 16 మెడికల్‌ కాలేజీల్లో పనుల ప్రగతిని సీఎంకు  అధికారులు వివ‌రించారు. పాడేరు, విజయనగరం, పిడుగురాళ్ల, మచిలీపట్నం కాలేజీల్లో పనులు ప్రారంభమయ్యాయని తెలిపారు.

అనకాపల్లి, నంద్యాలలో మెడికల్ కాలేజీ స్థలాలపై హైకోర్టులో పిల్స్‌ దాఖలు అయ్యాయని తెల‌ప‌గా, వెంటనే పరిష్కారం దిశగా ప్రయత్నించాలని అధికారులకు సీఎం సూచించారు. అమలాపురం, రాజమండ్రి, పాలకొల్లు, ఏలూరు, బాపట్ల, మార్కాపురం, మదనపల్లె, పెనుగొండల్లో పనులు మొదలుపెట్టడానికి కాంట్రాక్టు సంస్థ సన్నాహాలు చేస్తోందని అధికారులు తెలిపారు. కర్నూలు జిల్లా ఆదోనిలో కూడా కాంట్రాక్ట్ సంస్థకు పనులు అవార్డ్‌ చేశామని, వెంటనే పనులు కూడా మొదలవుతాయన్నారు. 
 
ప్రస్తుతం ఉన్న మెడికల్ కాలేజీల్లో కూడా నాడు –నేడు పనులకు చర్యలు తీసుకోవాల‌ని సీఎం అధికారుల‌కు సూచించారు. ఒక మంచి ఉద్దేశంతో 16 మెడికల్‌కాలేజీల నిర్మాణాలను చేపట్టాం, కార్పొరేట్‌ తరహా వాతావరణం అక్కడ కనిపించాలి... ప్రైవేటు కార్పొరేట్‌ ఆస్పత్రులకు పోతే ఎలాంటి భావన ఉంటుందో... ప్రభుత్వ ఆస్పత్రులలో కూడా ప్రజలకు అదే రకమైన భావన కలగాల‌న్నారు. ప్ర‌భుత్వ ఉద్యోగులకు ఆరోగ్యం బాగాలేకపోతే వాళ్ల ఆప్షన్‌ మనం కడతున్న ప్రభుత్వ ఆస్పత్రులే అయ్యిండాల‌ని సీఎం పేర్కొన్నారు. 
 
ఈ సమీక్షా సమావేశానికి ఉప ముఖ్యమంత్రి (వైద్య, ఆరోగ్యశాఖ) ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్‌ (నాని), సీఎస్‌ ఆదిత్యనాథ్‌ దాస్, డీజీపీ గౌతం సవాంగ్, స్టేట్‌ కోవిడ్‌ కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ ఛైర్‌పర్సన్‌ డాక్టర్‌ కె ఎస్‌ జవహర్‌ రెడ్డి, వైద్య, ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌ కుమార్‌ సింఘాల్, వైద్య, ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి (కోవిడ్‌ మేనేజిమెంట్‌ అండ్‌ వ్యాక్సినేషన్‌) ఎం రవిచంద్ర, 104 కాల్‌ సెంటర్‌ ఇంచార్జి ఎ బాబు, ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్‌ కాటమనేని భాస్కర్, ఏపీఎంఎస్‌ఐడీసీ వీసీ అండ్‌ ఎండీ డి మురళీధర్‌ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.