సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 3 సెప్టెంబరు 2019 (18:51 IST)

ప్రభుత్వ కార్యక్రమాలు ప్రజలకు చేరేలా పనిచేస్తా.. దేవులపల్లి అమర్

ఆంధ్రప్రదేశ్ యువ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి చేపడుతున్న అన్ని కార్యక్రమాలు ప్రజలకు చేరేలా పనిచేస్తానని జాతీయ మీడియా, అంతర్ రాష్ట్ర వ్యవహారాల మీడియా సలహాదారుగా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన దేవులపల్లి అమర్ పేర్కొన్నారు.

విజయవాడ పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ లోని సమాచార పౌర సంబంధాల శాఖ కమీషనర్ కార్యాలయంలో ఆయన జాతీయ మీడియా సలహాదారుగా మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ప్రభుత్వం తనపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించినందుకు ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

43 సంవత్సరాలు జర్నలిజం వృత్తిలో ఉన్నానని వివిధ పత్రికలలోను, ఎలక్ట్రానిక్ మీడియాలోను పనిచేశానన్నారు. వృత్తితోపాటు జర్నలిస్ట్ ట్రేడ్ యూనియన్ లో పనిచేశానన్నారు. ఎ.పి.యు.డబ్ల్యు.జె. యూనియన్ కార్యకర్తగా ప్రస్థానం ప్రారంభించి జాతీయ అధ్యక్షుడిగా పనిచేశానన్నారు.

15 సంవత్సరాలు ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేశానని, 2014 నుండి సాక్షి టీవీలో ప్రసారం అయిన ఫోర్త్ ఎస్టేట్ కార్యక్రమం, చర్చా కార్యక్రమాలు తనకు మంచి పేరు తీసుకువచ్చాయన్నారు. ఇంత పెద్దఎత్తున పాపులర్ కావడానికి సాక్షి ఎడిటోరియల్ డైరెక్టర్ శ్రీరామచంద్రమూర్తి కృషి ఎంతో ఉందన్నారు.

మీడియా ఇప్పుడున్న పరిస్థితులలో ప్రభుత్వం ఇచ్చిన బాధ్యతలు అంత తేలికైనవేమీ కాదని నాకున్న అనుభవం, నేర్చుకున్న విషయాలు, జాతీయ మీడియాతో తనకున్న పరిచయాలతో ప్రభుత్వానికి మంచి పేరు తీసుకు వస్తానన్నారు.

మీడియా వారందరికీ 24 గంటలూ అందుబాటులో ఉంటానని, అందరినీ వ్యక్తిగతంగా కలుస్తానన్నారు. లేనివి ఉన్నట్లుగా కాకుండా వాస్తవాలను వాస్తవంగా రిపోర్టుచేసే విధంగా పనిచేస్తానన్నారు. వృత్తిరీత్యా ఆంధ్రప్రదేశ్, తెలంగాణాలలో జాతీయస్థాయిలో జర్నలిస్టులతో పరిచయాలు ఉన్నాయని పదవిలోకి వచ్చినా జర్నలిస్టుల సమస్యలు పట్టించుకుంటానన్నారు.

జర్నలిస్టుల సమస్యల పట్ల ముఖ్యమంత్రి కూడా సానుకూల దృక్పధంతో ఉన్నారన్నారు. ప్రభుత్వం 25 లక్షల మందికి ఇళ్ళు నిర్మించి ఇవ్వబోతున్నదని, జర్నలిస్టుల సమస్య చాలా చిన్నదని, జర్నలిస్టులందరికీ ఇళ్ళు వచ్చే విధంగా కృషి చేస్తానన్నారు. 
 
అమర్ పరిపక్వత కలిగిన వ్యక్తి: సజ్జల రామకృష్ణారెడ్డి
ప్రభుత్వ ప్రజా వ్యవహారాల సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ అమర్ సీనియర్ పాత్రికేయుడు, జర్నలిస్టులందరికీ సుపరిచితుడు అని, జాతీయస్థాయిలో రిప్రజెంట్ చేయగల పరిపక్వత కలిగిన వ్యక్తిని గుర్తించి జాతీయ మీడియా సలహాదారుగా ముఖ్యమంత్రి నియమించడం హర్షణీయమన్నారు.

జాతీయ స్థాయిలో చురుకైన పాత్ర పోషిస్తూ ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటూ జర్నలిస్టుల సమస్యలపై ముందుండి నడిపించారన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అంశాలను జాతీయస్థాయిలో చక్కగా షోకేస్ చేయగల శక్తియుక్తులన్నీ అమర్ కు ఉన్నాయన్నారు.

ఆయన పరిపక్వత, పారదర్శకతతో ఏవైనా సమస్యలున్నా అధిగమించగల శక్తి ఉన్నవాడన్నారు. దేనినీ వక్రీకరించకుండా చూపగలగడమే ప్రచారం అని, అటువంటి విషయంలో అమర్ సిద్ధహస్తుడన్నారు. ఇలాంటి పదవి ఇవ్వడం ఇదే తొలిసారని, అమర్ తనకు మిత్రుడని, వ్యక్తిగతంగా అనుబంధం ఉందన్నారు. జాతీయ మీడియా సలహాదారుగా నియమించబడినందుకు ఆయనను అభినందిస్తున్నాన్నారు.
 
 
అమర్ మీడియాకు సుపరిచితుడు:
సీనియర్ ఎడిటర్ కె.శ్రీరామచంద్రమూర్తి మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాలతో పాటు జాతీయస్థాయిలో మీడియాతో పరిచయం ఉన్న వ్యక్తి అమర్ అని అన్నారు. జాతీయస్థాయిలో ఐ.జె.యు. అధ్యక్షుడిగా, ప్రెస్ కౌన్సిల్ మెంబరుగా పనిచేసిన అనుభవం ఉన్న వ్యక్తి అన్నారు.

సామాజిక సమస్యలమీద సామాజిక స్పృహ ఉన్న వ్యక్తి, జర్నలిస్టు హృదయం, జన హృదయం, జగనన్న హృదయం తెలిసిన వ్యక్తి అన్నారు. తనకు ఇచ్చిన బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తారనడంలో ఎలాంటి సందేహం లేదన్నారు. జర్నలిస్టులు, సంపాదకులు, యాజమాన్యాలతో కూడా మాట్లాడగలిగిన వ్యక్తి అని, ప్రభుత్వానికి మంచిపేరు తీసుకు వస్తారని భావిస్తున్నానన్నారు.

జర్నలిస్టుల సమస్యలు కూడా పరిష్కరించ గలుగుతారనారు. ముందుగా సమాచార పౌర సంబంధాల శాఖ కమీషనర్ టి.విజయకుమార్ రెడ్డి మాట్లాడుతూ జాతీయ మీడియాలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అమర్ ప్రాధాన్యత తీసుకువస్తారని ఆశిస్తున్నామన్నారు. ప్రభుత్వ పథకాలకు సంబంధించి జాతీయ స్థాయిలో మంచి ప్రాచుర్యం కల్పించాలని కోరారు.

అమర్ ఈరోజు ముఖ్యమంత్రిని కలిశారని ఎలా ముందుకు వెళ్ళాలో దిశానిర్దేశం చేశారన్నారు. ముందుగా సమాచార శాఖ కమీషనర్ పుష్పగుచ్చం ఇచ్చి శాలువా కప్పి అమర్ ను అభినందించారు. కార్యక్రమం అనంతరం వివిధ పత్రికలు, ఛానల్స్ కు సంబంధించిన జర్నలిస్టులు ఆయనకు పుష్పగుచ్ఛాలు ఇచ్చి అభినందనలు తెలిపారు.

కార్యక్రమంలో సమాచార శాఖ అడిషనల్ డైరెక్టర్ డి.శ్రీనివాస్, జాయింట్ డైరెక్టర్లు కిరణ్ కుమార్, వెంకటేష్, టి.కస్తూరి, ఆర్ఐఇ కృష్ణారెడ్డి పలువురు సమాచార శాఖ అధికారులు, జర్నలిస్టులు ఆయనకు అభినందనలు తెలిపారు.