శనివారం, 23 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శుక్రవారం, 20 డిశెంబరు 2019 (05:29 IST)

దిశ చట్టం అమలుకు ప్రభుత్వం పటిష్టమైన చర్యలు: సిఎస్

దేశంలో మొట్టమొదటి సారిగా మహిళలు,బాలికల భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ రూపొందించిన చారిత్రాత్మక ఆంధ్రప్రదేశ్ దిశ బిల్లుకు ఇటీవల రాష్ట్ర శాసన సభ ఆమోదం తెలిపింది.రాష్ట్రంలో మహిళలు, చిన్నారులపై జరిగే అకృత్యాలను అరికట్టేందుకు నూతనంగా తీసుకువచ్చిన ఎపి దిశ చట్టాన్ని పటిష్టంగా అమలు చేసేందుకు ప్రభుత్వం అవసరమైన అన్ని చర్యలు తీసుకోనుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని పేర్కొన్నారు.

ఇటీవల జరిగిన శాసనసభ శీతాకాల సమావేశాల్లో ఎపి దిశ చట్టానికి సంబంధించిన బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఆమోదించిన అనంతరం ఆబిల్లును రాష్ట్ర గవర్నర్ ఆమోదానికి పంపడం జరిగింది.దిశ చట్టం అమలుపై ఇప్పటికే రాష్ట్ర పోలీస్ డైరెక్టర్ జనరల్ గౌతం సవాంగ్,న్యాయ శాఖ కార్యదర్శి తదితర అధికారులతో చర్చించడం జరిగిందని తెలిపారు.

రాష్ట్ర డిజిపి కూడా ఇప్పటికే మూడు పర్యాయాలు సమావేశాలు నిర్వహించారని జిల్లాల ఎస్పిలతో రెండు సమావేశాలు,మహిళా శిశు సంక్షేమం తదితర శాఖల అధికారులతో ఒక సమావేశాన్ని నిర్వహించారు.ఈదిశ చట్టం ప్రకారం జిల్లా స్థాయిలో డిఎస్పీ ఆధ్వర్యంలో జిల్లా ప్రత్యేక పోలీస్ బృందాన్నిఏర్పాటు చేసేందుకు వీలుకల్పించగా ఆప్రకారం ప్రత్యేక పోలీస్ బృందాల ఏర్పాటుకు డిజిపి అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు.

ఇందుకు సంబంధించి నమోదయ్యే కేసులను సత్వరం విచారించి దోషులుగా నిర్ధారితమైన వారికి 21రోజుల్లోగా శిక్ష పడేవిధంగా అవసరమైన జిల్లాకొక ప్రత్యేక కోర్టుకు ఏర్పాటుకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోనుంది.అంతేగాక ప్రతి ప్రత్యేక కోర్టుకు ప్రత్యేకంగా పబ్లిక్ ప్రాసిక్యూటర్లను నియమించుకునే అవకాశం ఈచట్టం ద్వారా కల్పించడం జరిగింది.

ఇంత వరకూ ఏరాష్ట్రంలోను మహిళలు,పిల్లలపై జరిగే నేరాల సత్వర విచారణకు జిల్లాల్లో ప్రత్యేక కోర్టులు లేవు.దేశ చరిత్రలో తొలిసారిగా ఇలాంటి నేరాల సత్వర విచారణ ప్రక్రియ ముగింపు శిక్ష ఖరారుకై ఈకోర్టులను ఏర్పాటు చేయనున్నారు.

ఇందుకోసమై ఆంధ్రప్రదేశ్ దిశ చట్టం-మహిళలు,బాలలపై నిర్దేశిత నేరాల విచారణకు ప్రత్యేక న్యాయస్థానాల బిల్లు-2019ను ఇటీవల రాష్ట్ర శాసన సభ ఆమోదించింది. మహిళలపై అత్యాచారం,సామూహిక అత్యాచారం, యాసిడ్ దాడులు,సోషల్ మీడియా ద్వారా వేధించడం వంటి నేరాలు,పోక్సో పరిధిలోకి వచ్చే నేరాల్ని ఈప్రత్యేక కోర్టులు విచారించనున్నాయి. 

దిశ చట్టం కింద నమోదయ్యే మెడికో లీగల్ కేసులకు సంబంధించి రెవెన్యూ,పోలీస్, వైద్య ఆరోగ్యం,ఫోరెన్సిక్,మహిళా శిశు సంక్షేమశాఖల మధ్య సమన్వయం ఉండేలా తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని సిఎస్ నీలం సాహ్ని పేర్కొన్నారు. మహిళలు,బాలికలకు పూర్తి స్థాయిలో రక్షణ కల్పించడమే దిశ చట్టం ముఖ్య ఉద్దేశ్యమని కావున ఈచట్టాన్ని పటిష్టవంతంగా అమలు చేయడం ద్వారా వారికి పూర్తి రక్షణ కల్పించేందుకు ప్రభుత్వం అన్ని విధాలా చర్యలు తీసుకుంటుందని తెలిపారు.

దిశ లాంటి సంఘటనలు జరిగినపుడు వేగ వంతమైన దర్యాప్తు,విచారణ,సత్వర తీర్పుతోనే అలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా నివారించవచ్చనే లక్ష్యంతోనే ప్రభుత్వం ఈఎపి దిశ చట్టాన్ని ప్రవేశపెట్టడం జరిగిందని సిఎస్ నీలం సాహ్ని పేర్కొన్నారు.

దిశ లాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఈ చట్టం తీవ్రతపై ప్రజల్లో పెద్దఎత్తున అవగాహనను పెంపొందించే విధంగా ప్రభుత్వ పరంగా అవసరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని పేర్కొన్నారు.