చెవిరెడ్డికి జోడుపదవులు... ప్రభుత్వ విప్‌లు వీరే
చిత్తూరు జిల్లాలోని చంద్రగిరి అసెంబ్లీ స్థానం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి రెండు పదవులు దక్కాయి. అందులో ఒకటి ప్రభుత్వ విప్ కాగా, మరొకటి తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ (తుడా) ఛైర్మన్. ఈ మేరకు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సర్కారు ఉత్తర్వులు జారీచేసింది.
నిజానికి జగన్ మంత్రివర్గంలో చెవిరెడ్డికి మంత్రిపదవి దక్కుతుందని ప్రతి ఒక్కరూ భావించారు. అయితే సామాజిక సమీకరణాల దృష్ట్యా చిత్తూరు జిల్లా నుంచి ఇద్దరిని మాత్రమే కేబినెట్‌లోకి తీసుకున్నారు. వీరిలో ఒకరు సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి (పుంగనూరు) కాగా, మరొకరు నారాయణ స్వామి (గంగాధర నెల్లూరు) ఉన్నారు.
అయితే, ఇదే జిల్లా నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న ఆర్కే రోజా (నగరి), చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి (చంద్రగిరి), భూమన కరుణాకర్ రెడ్డి (తిరుపతి)లు కూడా మంత్రిపదవులు ఆశించారు. కానీ, వారికి మంత్రిపదవులు ఇవ్వలేదు. ఈ క్రమంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి మాత్రం సీఎం జగన్ జోడు పదవులు కేటాయించారు. చోటు దక్కలేదు.
ఇదిలావుండగా, మంత్రివర్గ ప్రమాణ స్వీకారానికి ముందే ప్రభుత్వ విప్‌ల జాబితాను ముఖ్యమంత్రి ప్రకటించారు. శనివారం మధ్యాహ్నం 11.49 గంటలకు 25 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్న విషయం తెలిసిందే. మంత్రుల జాబితాలో చోటు దక్కని కొందరికి విప్ పదవులు వరించాయి. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి శనివారం ఉదయం సచివాలయంలోకి ముఖ్యమంత్రి అడుగుపెట్టారు.
అనంతరం అన్ని శాఖల హెచ్‌ఓడీలతో ఆయన సమావేశంలో ఉండగానే ప్రభుత్వ చీఫ్ విప్‌గా పార్టీ సీనియర్ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డిని, విప్‌లుగా చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, ముత్యాలనాయుడు, దాడిశెట్టి రాజా, పార్థసారథి, కొరుముట్ల శ్రీనివాస్‌లను జగన్ నియమించినట్లు ఉత్తర్వులు వెలువడ్డాయి. వీరిలో దాదాపు అందరూ మంత్రి పదవి ఆశించినవారే. అయితే, సామాజిక సమతూకంలో వీరికి మంత్రి పదవులు దక్కలేదు. దీంతో విప్‌లుగా ఈ ఐదుగురు కీలక నేతలకు బాధ్యతలు అప్పగించారు.