తాళి కట్టిన అరగంటకే వరుడు పరార్
శ్రీకాకుళం జిల్లా దండులక్ష్మీపురం గ్రామానికి చెందిన మిరియాబిల్లి వెంకటేష్ అనే యువకుడు ఓ గ్రామానికి చెందిన యువతిని ఇష్టపడ్డాడు. ఆమె సైకిల్‌పై కళాశాలకు వెళ్తున్న సమయంలో వెంటపడే వాడు. ప్రేమించాలని ఒత్తిడి చేసే వాడు.
దీంతో ఆమె ప్రేమకు అంగీకరించింది. 2017 నుంచి మూడేళ్ల పాటు వీరి ప్రేమ సాగింది. వివాహం చేసుకోవాలని ప్రేయసి ఒత్తిడి చేయ డంతో ఈ దసరా సెలవుల్లో చేసుకుంటానని వెంకటేష్ నమ్మబలికాడు.
చివరకు నిన్న దండులక్ష్మీపురం శివారున గల అమ్మవారి ఆలయంలో ఆమెకు పసుపు తాడు కట్టాడు. కాళ్లకు మెట్టెలు సైతం తొడిగాడు.
అయితే, అరగంట తరువాత వెంకటేష్ బంధువులు వచ్చి పసుపు తాడు, మెట్టెలను తొలగించి ఎవరింటికి వారు వెళ్లిపోండని బెదిరించారని, దీంతో వెంకటేష్ తనను ఒంటరిగా వదిలేసి పరారయ్యాడని బాధితురాలు వాపోయింది.
దీనిపై ఉదయం తన తల్లిదండ్రులు, బంధువులు, గ్రామపెద్దలతో కలిసి పోలాకి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.