ఆదివారం, 26 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 12 అక్టోబరు 2019 (14:07 IST)

ఏపీలో మందుబాబులకు హెచ్చరిక!.. దుకాణాల వద్ద మందు వీల్లేదు

నూతన మద్యం విధానంలో దుకాణాల వద్ద మందు తాగే వీల్లేదు. దీని వల్ల ఎక్కడికక్కడే మందుబాబులు మద్యం తాగేస్తున్నారు. అందుకే ముందు జాగ్రత్తగా ఓ వ్యక్తి తన ఇంటి ముందు హెచ్చరిక బోర్డు పెట్టారు.

నూతన మద్యం విధానంతో దుకాణాల వద్ద మందు తాగడాన్ని ఎక్సైజ్ నిషేధించింది. అందుకే చాలా మంది సమీపంలోని ఇళ్లు, పొలాలు, బడులు, రహదాలు వద్ద మందు తాగుతున్నారు. ఇలాంటివి చూసిన గుంటూరు జిల్లా మాచావరంలోని ఖాసీం అనే వ్యక్తి తన ఇంటి ముందు ఓ బోర్డు పెట్టేశారు.

ఇంటి ముందు ఎవరూ మందు తాగొద్దంటూ అందులో రాసి పెట్టారు. ఆరుబయట మందు తాగితే పోలీసులకు ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు. దీన్ని గమనించిన ప్రజలంతా ఆయన్ని అభినందించారు.
 
వెనుకాల మాత్రం ఫుల్‌ ...
మద్యం దుకాణాల వద్ద తాగకూడదని ప్రభుత్వం చెబుతున్నా కొన్ని చోట్ల పరిస్థితి భిన్నంగా ఉంది. మందుబాబులను కూర్చోబెట్టి వారికి ఏం కావాలన్నా సరఫరా చేస్తున్నారు. స్థానిక నాయకుల అండదండలతో ఈ వ్యవహారం జరుగుతుందన్న విమర్శలు వస్తున్నాయి.

ఎక్సైజ్ అధికారులూ చూసీచూడనట్లు ఉండటం అనుమానాలను రేకెత్తిస్తోంది. ప్రభుత్వం మద్యాన్ని దశల వారీగా నిషేధించే క్రమంలో భాగంగా దుకాణాల సంఖ్య తగ్గించింది. ప్రభుత్వం ఆధ్వర్యంలోనే దుకాణాలను ఏర్పాటు చేసి నిర్వహిస్తోంది. ఈ క్రమంలో పర్మిట్‌ రూమ్‌లను తొలగించింది.

మద్యం తాగేవారు దుకాణాల్లో కొనుగోలు చేసి అక్కడ కాకుండా వేరే చోటికి తీసుకెళ్లి తాగాల్సి ఉంది. ముండ్లమూరు మండలం పెదఉల్లగల్లులో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. మద్యం దుకాణం వెనుకే మందుబాబులు దర్జాగా కూర్చుని తాగేస్తున్నారు. మద్యం మత్తులో జోగుతున్నారు. ఇందుకు అనుకూలంగా ఉండేలా గతంలో రెస్టారెంట్‌ నిర్వహించే వారు అక్కడే సిమెంట్‌ బల్లలు ఏర్పాటు చేశారు.

ప్రస్తుతం మందు తాగేవారికి ఇది అడ్డాగా మారింది. కోరుకుంటే మద్యం సీసాలు అక్కడికే సరఫరా అవుతున్నాయి. గ్లాసులు, మంచినీళ్లు, శీతలపానీయాలు వంటివి మందుబాబులకు తెచ్చిస్తున్నారు. అధికార పార్టీకి చెందిన కొందరు నాయకుల అండదండలతో ఈ వ్యవహారం సాగుతున్నట్టు విమర్శలున్నాయి. పెద్దఉల్లగల్లులో మద్యం దుకాణం పక్కనే రెస్టారెంట్‌ నిర్వహిస్తున్నారు. ఇక్కడ మద్యం తాగడానికి అనుమతి లేదు.

అయినా మందుబాబులు అక్కడే తమ పని చక్కబెట్టుకుంటున్నారు. అయినప్పటికీ ఎక్సైజ్‌ పోలీసులు తమకేం పట్టనట్టు వ్యవహరిస్తుండటం అనుమానాలకు తావిస్తోంది.