ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : సోమవారం, 17 జూన్ 2024 (18:00 IST)

జగన్‌పై క్రిమినల్ చర్యలు తీసుకోవాలి : బ్రాహ్మణ వేదిక నేత ఫిర్యాదు

ys jagan
మాజీ ముఖ్యమంత్రి, వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని గుంటూరులో బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు శిరిపురపు శ్రీధర్ శర్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు. క్యాంపు కార్యాలయం ముసుగులో ప్రజాధనం దోపిడీ చేయడమేకాకుండా ఓటమి అనంతరం ప్రభుత్వానికి అప్పగించాల్సిన కోట్ల ఖరీదైన సామగ్రిని తన ఇంట్లో అక్రమంగా ఉంచుకుని వాడుకుంటున్నారని, అందువల్ల అతనిపై క్రిమినల్ కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని కోరారు. 
 
ఈ మేరకు తెలుగు యువత, బ్రాహ్మణ చైతన్య వేదిక నాయకులతో కలసి గుంటూరు ఎస్పీ కార్యాలయంలో సీసీఎస్ అదనపు ఎస్పీ శ్రీనివాసరావుకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు అందించారు. జగన్ తాడేపల్లిలోని తన సొంత ఇంటికి సుమారు రూ.45.54 కోట్ల విలువైన ప్రజాధనం వెచ్చించి హంగు ఆర్భాటాలతో విలాసవంతమైన మౌలిక సదుపాయాలు కల్పించుకున్నారని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. 
 
ఆ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మాజీ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు విషయంలో గతంలో జగన్ ప్రభుత్వం ఏవిధంగా వ్యవహరించిందో, ఇప్పుడు జగన్ విషయంలో కూడా కొత్త ప్రభుత్వం అదేవిధంగా వ్యవహరించాలని డిమాండ్ చేశారు. అప్పట్లో కోడెల ముందుగానే ఫర్నీచర్ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువవచ్చారని, అయినప్పటికీ ఆయనపై అక్రమంగా కేసు పెట్టి మానసికంగా వేధించి ఆత్మహత్య చేసుకునేలా చేశారని ఆయన గుర్తు చేశారు. కానీ, ఇపుడు జగన్ మాత్రం మీడియా సంస్థలు బయట పెట్టేవరకూ గుట్టుగా ఉంచారన్నారు. కోడెల మీద పెట్టిన కేసులోని సెక్షన్ల కంటే జగన్‌పై అదనపు సెక్షన్ల కింద కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.