గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : ఆదివారం, 20 జనవరి 2019 (14:06 IST)

గుంటూరులో దారుణం : గ్యాస్ లీక్ చేసి మంటపెట్టిన దోపిడీ దొంగలు

గుంటూరులో దారుణం జరిగింది. దోపిడీ దొంగలు అత్యంత రాక్షసత్వంగా ప్రవర్తించారు. ఓ ఇంట్లో బంగారం, నగలు దోచుకున్న దోపిడీ దొంగలు.. గ్యాస్ సిలిండర్ లీక్ చేసి మంటపెట్టారు. ఈ మంటల్లో ఇంటిలో ఉన్న ఓ మహిళ తీవ్రంగా గాయపడ్డారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
గుంటూరు జిల్లాలోని ఫిరంగిపురం మండలం వేములూరిపాడు గ్రామంలో ఒంటరిగా ఓ మహిళ ఉంటోంది. దీంతో ఆ ఇంట్లో దోపిడీ చేయడానికి కొంతమంది దొంగలు వెళ్లారు. ఇందులోభాగంగా ఆదివారం తెల్లవారుజామున ఇంట్లోకి ప్రవేశించారు. అనంతరం మహిళ మెడలో ఉన్న బంగారు గొలుసులతో పాటు ఇంట్లోని నగలు, నగదును దోచుకున్నారు. 
 
ఆ తర్వాత వంటింట్లోని గ్యాస్ సిలిండర్‌ను లీక్ చేసి మంట పెట్టి పరారయ్యారు. బాధితురాలి కేకలు విన్న స్థానికులు ఆమెను రక్షించి జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు.. బాధితురాలి నుంచి వాంగ్మూలం సేకరించి ఈ దారుణానికి పాల్పడిన దోపిడీ దొంగల కోసం గాలిస్తున్నారు.