కాంగ్రెస్ మహిళా నేతను చంపేసిన 'దృశ్యం' మూవీ... బీజేపీ నేత ఘాతుకం
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో దృశ్యం మూవీలో స్టైల్లో హత్య జరిగింది. ఈ హత్యకు పాల్పడింది బీజేపీ నేతలే కావడం గమనార్హం. కొందరు బీజేపీ నేతలు దృశ్యం మూవీ స్టైల్‌లో కాంగ్రెస్ మహిళా నేతను హత్య చేసి కారులోనే కాల్చివేశారు. ఆ తర్వాత ఓ కుక్కను చంపి ఓ చోట పూడ్చిపెట్టారు. పోలీసులకు కూడా కించిత్ అనుమానం రాకుండా ఈ పనికిపాల్పడ్డారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్‌కు చెందిన బీజేపీ నేత జగదీశ్ కరోటియాకు స్థానిక కాంగ్రెస్ మహిళా కార్యకర్త 22 యేళ్ళ ట్వింకిల్ మధ్య కొన్నేళ్లుగా భూ వివాదం నడుస్తోంది. అయితే, రెండేళ్ళ క్రితం ట్వింకిల్ కనిపించకుండా పోయింది. అప్పటి నుంచి మిస్సింగ్ కేసుగా నమోదు చేసిన ఇండోర్ పోలీసులు.. ఆమె కోసం గాలిస్తూ వచ్చారు. అయితే, భూవివాదం కారణంగా కరోటియానే హత్య చేయించివుంటాడని స్థానికులంతా బలంగా నమ్ముతూ వచ్చాయి.
అదేసమయంలో ట్వింకిల్ హత్య తర్వాత పోలీసులతోపాటు కాంగ్రెస్ నేతలు, స్థానికులు కూడా తమనే నమ్ముతారని ఊహించిన కరోటియా... పోలీసులను తప్పుదోవ పట్టించాడు. ఇందులోభాగంగా, ఒక కుక్కను చంపి దాన్ని తీసుకొచ్చి ఓ ప్రాంతంలో గుంత తవ్వి పూడ్చిపెట్టారు.
ఈ నేపథ్యంలో ఇటీవల మధ్యప్రదేశ్ రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగింది. బీజేపీ ప్రభుత్వ స్థానంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైంది. దీంతో కేసు విచారణలో వేగం పుంజుకుంది. ఫలితంగా ట్వింకిల్ హత్య కేసులో నిజాలు బహిర్గతమయ్యాయి.
ట్వింకిల్‌ను కరోటియా, అతని ముగ్గురు కుమారులు కలిసి మరో వ్యక్తి సాయంతో హత్య చేసినట్టు విచారణలో పోలీసులు గుర్తించారు. ఆ తర్వాత వారిని అదుపులోకి తీసుకుని విచారించగా, అసలు విషయం వెల్లడైంది. మృతదేహాన్ని పాతిపెట్టినట్టు చెప్పారు. వారు చెప్పినట్టుగా అక్కడ తవ్వి చూడగా, కుక్క ఎముకలు బయటపడ్డాయి. అనంతరం తమదైనశైలిలో విచారించడంతో నిజాన్ని కక్కారు. ట్వింకిల్‌ను చంపేసి కారులోనే కాల్చివేసినట్టు వెల్లడించారు. దీంతో వారందరినీ అరెస్టు చేశారు.