శనివారం, 9 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 6 ఏప్రియల్ 2024 (11:14 IST)

వైకాపాకు మరో షాక్... పార్టీని వీడనున్న గుంటూరు వైకాపా అధ్యక్షుడు డొక్కా మాణిక్యవరప్రసాద్!!

Dokka ManikyavaraPrasad
సార్వత్రిక ఎన్నికల సమయం సమీపిస్తుండటంతో ఏపీలో అధికార వైకాపాకు మరో గట్టి షాక్ తగలనుంది. ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి, గుంటూరు జిల్లా వైకాపా అధ్యక్షుడు డొక్కా మాణిక్యవరప్రసాద్ పార్టీని వీడనున్నారనే ప్రచారం జోరుగా సాగుతుంది. ప్రస్తుతం ఆయన గుంటూరు జిల్లా వైకాపా అధ్యక్షుడిగా ఉన్నప్పటికీ ఎన్నికల ప్రచారంలోనే కాకుండా పార్టీ కార్యక్రమాల్లో ఏమాత్రం క్రియాశీలకంగా లేరు. పార్టీ తనకు తనకు గౌరవ మర్యాదలు లేకపోవడంతో ఆయన ముభావంగా ఉన్నారు. 
 
నిజానికి గత సార్వత్రిక ఎన్నికల ముందు తెదేపాలోకి చేరగానే ఎమ్మెల్సీ పదవి ఇచ్చింది. 2019లో టీడీపీ తరపున ప్రత్తిపాడు అభ్యర్థిత్వం దక్కించుకున్న ఆయన ఆ ఎన్నికల్లో ఓడిపోయినా టీడీపీ ఎమ్మెల్సీగా కొనసాగారు. మూడు రాజధానుల బిల్లు సమయంలో అనూహ్యంగా వైకాపా వైపు చేరారు. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. అనంతరం వైకాపా తరఫున ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. వైకాపాలో ఉన్న డొక్కా ఆ పార్టీ తీరుపైన అసంతృప్తితో ఉన్నారు. 
 
ఇటీవల వైకాపా సామాజిక సాధికార బస్సు యాత్రలో భాగంగా తాడికొండ సభలో మాట్లాడుతూ పార్టీ అధినేత జగన్‌ను కలిసే పరిస్థితి లేదని, తనను ఆయన వద్దకు తీసుకెళ్లాలని పార్టీ నాయకులను కోరడం చర్చనీయాంశమైంది. బహిరంగంగానే పార్టీ అధినేతను కలిసే పరిస్థితి లేదని ఆందోళన వ్యక్తం చేశారు. తనతో సంప్రదించకుండానే తాడికొండ ఇన్‌ఛార్జిగా నియమించడం, అర్ధంతరంగా బాధ్యతల నుంచి తప్పించడంపై ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. 
 
ప్రస్తుతం వైకాపా జిల్లా అధ్యక్ష బాధ్యతల్లో ఉన్న డొక్కా మాణిక్య వరప్రసాద్‌ అంటీముట్టనట్లుగా ఉంటున్నారు. ఒకప్పుడు మంత్రిగా ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్‌లో కీలకపాత్ర పోషించిన డొక్కా ఇప్పుడు ఎక్కడా సీటు దక్కకపోగా క్రియాశీలకంగానూ లేకపోవడం గమనార్హం. ఈనేపథ్యంలో రాజకీయంగా నిర్ణయం తీసుకుంటారా? అన్నది వేచిచూడాల్సిందే. ఇందులో భాగంగానే ఆయన కొన్నాళ్లుగా వైకాపాలో చురుగ్గా ఉండడం లేదా? అన్న చర్చ జరుగుతోంది.
 
ఇదిలావుంటే, శుక్రవారం సాయంత్రం మంత్రి అంబటి రాంబాబు గుంటూరులోని డొక్కా మాణిక్య వరప్రసాద్‌ ఇంటికి వచ్చి చర్చించారు. పల్నాడు జిల్లాలోనూ అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని, ప్రచారంలో పాల్గొనాలని కోరారు. పార్టీలో ప్రాధాన్యత ఉండేలా చూస్తామని చెప్పినట్లు తెలిసింది. పార్టీ అధిష్టానం నుంచి స్పష్టమైన హామీ రాకపోవడంతో డొక్కా ప్రస్తుతం క్రియాశీలకంగా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. గుంటూరు జిల్లాలో వైకాపా అభ్యర్థుల ప్రచారంలోనూ ఆయన పాల్గొనడం లేదు. జిల్లా అధ్యక్ష బాధ్యతల్లో ఉన్నప్పటికీ పార్టీ కార్యక్రమాల్లోనూ చురుగ్గా లేరు. తనకు రాజకీయంగా ప్రాధాన్యత లేదన్న అసంతృప్తితో ఆయన ఉన్నారు.